మంత్రిగా ఒకే ఒక్కడు | Sakshi
Sakshi News home page

మంత్రిగా ఒకే ఒక్కడు

Published Fri, Nov 24 2023 1:18 AM

- - Sakshi

కామారెడ్డి క్రైం: కామారెడ్డి నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకుని రెండు పర్యాయాలు మంత్రిగా పని చేసిన ఘనతను షబ్బీర్‌ అలీ సొంతం చేసుకున్నారు. నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మరెవరికీ ఇప్పటివరకు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసే అవకాశం దక్కలేదు. ఇక్కడ నుంచి మంత్రి పదవిలో కొనసాగిన ఒకే ఒక్కడుగా చెప్పవచ్చు. గతంలో ఆయన రెండు పర్యాయాలు మంత్రిగా పని చేయడమే కాకుండా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కీలకనేతగా ఉన్నారు. జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నిజామాబాద్‌ అర్బన్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ నుంచి పోటీ చేసినా పార్టీ అధికారంలోకి వస్తే మూడోసారి మంత్రి పదవిలో గానీ, మరేదైనా ఉన్నత పదవిలోగానీ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

కామారెడ్డి నియోజకవర్గానికి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. మొత్తం 11 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో ఒక్క షబ్బీర్‌ అలీని మాత్రమే మంత్రి పదవి వరించింది. యువజన కాంగ్రెస్‌ నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన షబ్బీర్‌అలీకి కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ టికెట్‌ కేటాయించింది. టీడీపీ అభ్యర్థి యూసుఫ్‌అలీపై భారీ మెజార్టీతో గెలుపొంది అప్పటి వరకు నియోజకవర్గంలో కొనసాగుతున్న తెలుగుదేశం హవాకు ఆయన బ్రేకులు వేశారు. అంతేగాకుండా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన షబ్బీర్‌అలీ తన 37వ ఏటనే మర్రి చెన్నారెడ్డి కేబినెట్‌లో మంత్రి అయ్యారు. మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. అప్పటి నుంచే జాతీయ స్థాయిలో పార్టీ ప్రముఖులతో సంబంధాలు పెరిగాయి. ఏఐసీసీలోని ముఖ్యనేతలతో నేరుగా సంబంధాలు కలిగిన నాయకునిగా పేరు సాధించారు. 2004లో మరోసారి షబ్బీర్‌అలీ భారీ విజయం సాధించి అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేశారు.

మరోసారి గెలిస్తే...

రెండుసార్లు కేబినెట్‌ మంత్రిగా పని చేసిన షబ్బీర్‌ అలీ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిని వ దిలి ప్రస్తుతం నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పలుసార్లు అదృష్టం కలిసిరాకపోయినా ఈ సారి మాత్రం ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో షబ్బీర్‌అలీ, ఆయన అనుచరవర్గం పని చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే మరోసారి ఉన్నత పదవిలో చూడవచ్చని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

కామారెడ్డి నుంచి రెండు సార్లు కేబినెట్‌ మంత్రిగా పనిచేసిన షబ్బీర్‌ అలీ

ఇతర నేతలకు దక్కని అవకాశం

1/1

Advertisement
Advertisement