అందరికీ జై కొడ్తాం.. | Sakshi
Sakshi News home page

అందరికీ జై కొడ్తాం..

Published Fri, Nov 24 2023 1:18 AM

- - Sakshi

మోర్తాడ్‌(బాల్కొండ): ఇప్పుడు జరుగుతున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసిన నుంచి అన్ని రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల ర్యాలీలు, సభలకు జనం తండోపతండాలుగా వస్తుండటంతో అభ్యర్థులను సంతోషపెడుతున్నా ఓటర్ల నాడి అంతుచిక్కకుండా ఉండి కొంత గందరగోళానికి దారి తీస్తుంది. అధికార బీఆర్‌ఎస్‌తో పాటు, కాంగ్రెస్‌, బీజేపీల తరపున జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఆయా పార్టీలు రంగంలోకి దింపాయి. బాల్కొండ, ఆర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌, అర్బన్‌, బోధన్‌ నియోజకవర్గాల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని మండలాలు కొన్ని జిల్లాలో ఉండగా అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు గ్రామాల్లోకి వచ్చి ర్యాలీలను నిర్వహిస్తూ ప్రధాన కూడళ్ల వద్ద సమావేశాలను నిర్వహిస్తున్నారు. ర్యాలీలకు మహిళలు హజరై మంగళ హారతులు, బోనాలు ఎత్తుకుని స్వాగతం పలుకుతున్నారు. సభలకు సైతం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏ పార్టీ అభ్యర్థి ప్రచారం నిర్వహించినా జన సందోహం భారీగానే కనిపిస్తుంది. గ్రామాల్లో అయితే అక్కడి జనాభా ప్రకారం వందల సంఖ్యలో జనంను సమీకరిస్తున్నారు. మహిళా సంఘాల నాయకులతో జన సమీకరణ చేస్తుండగా ఒక్కో మహిళకు రూ.200ల నుంచి రూ.300ల వరకు ర్యాలీ, సమావేశానికి వచ్చినందుకు చెల్లిస్తున్నారు.

ముందస్తుగా సమాచారం..

డబ్బులు ఇవ్వనిదే ఏ పార్టీ సమావేశానికి జనం వచ్చే పరిస్థితి లేకపోవడంతో అభ్యర్థులు తాము వెళ్లే గ్రామానికి ముందస్తుగా సమాచారం ఇచ్చి జనం సమీకరించాలని కార్యకర్తలు, నాయకులకు సూచిస్తున్నారు. వంద నుంచి 500ల మంది మహిళలు, కొందరు మగవారు సభలకు హాజరు అవుతున్నారు. ప్రతి పార్టీ సమావేశాలకు జనం అంతే మొత్తంలో పాల్గొంటుండటంతో ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందోనని అభ్యర్థులకు అంతు చిక్కకుండా ఉంది. సీఎం కేసీఆర్‌, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఇతర నాయకులు ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా సభల్లో పాల్గొంటున్నారు. ఈ సమావేశాలకు కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు హజరు అవుతున్నారు. ఏ పార్టీ సమావేశం కూడా జనం లేకుండా జరుగడం లేదు. అన్ని పార్టీలకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివస్తుండటంతో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో ఎవరు కనిపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్ది అన్ని పార్టీల ప్రచారం ఊపందుకోవడం, జనం భారీ సంఖ్యలో హజరు అవుతుండటంతో తీర్పు ఎలా ఉండబోతుందోననే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు.

అన్ని పార్టీల మీటింగ్‌లకు వెళ్తున్న ప్రజలు

రాజకీయ పార్టీలకు చిక్కని ఓటర్ల నాడి

అయోమయంలో అభ్యర్థులు

Advertisement
Advertisement