ఇంటి కోసం జీపీ దహనానికి యత్నం | Sakshi
Sakshi News home page

ఇంటి కోసం జీపీ దహనానికి యత్నం

Published Thu, Dec 21 2023 1:12 AM

వివరాలు తెలుపుతున్న సర్పంచ్‌ 
జనగామ శ్రీనివాస్‌  - Sakshi

భిక్కనూరు: తమకు మంజూరైన డబుల్‌ బెడ్‌ రూం ఇంటిని అప్పగించడం లేదన్న ఆవేదనతో ఓ యువకుడు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తగలబెట్టడానికి యత్నించాడు. శ్రీసిద్ధరామేశ్వరనగర్‌ గ్రామంలో చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గఽంధం భాగ్యకు ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు అప్పగించలేదు. ఈ విషయమై మాట్లాడేందుకు భాగ్య కుమారుడు గంధం రంజిత్‌ మంగళవారం గ్రామపంచాయతీకి వచ్చాడు. వస్తూ వస్తూనే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఎందుకు ఇవ్వలేదంటూ అక్కడే ఉన్న సర్పంచ్‌ శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడాడు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే డబుల్‌ బెడ్‌రూం ఇంటిని అప్పగిస్తామని సర్పంచ్‌ శ్రీనివాస్‌ వివరించినా వినిపించుకోకుండా బైక్‌పై వెళ్లిపోయాడు. సర్పంచ్‌ జనగామ శ్రీనివాస్‌, వీడీసీ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్‌లు జీపీ నుంచి బయటికి వచ్చి మాట్లాడుకుంటున్నారు. కొంత సేపటికి తిరిగి వచ్చిన రంజిత్‌ తన వెంట బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను కార్యాలయంలో చల్లి నిప్పంటించాడు. దీనిని గమనించిన సర్పంచ్‌ శ్రీనివాస్‌, వీడీసీ అధ్యక్షుడు కార్యాలయంలోకి వచ్చి రంజిత్‌ను సముదాయిస్తుండగా సర్పంచ్‌పైనా పెట్రోల్‌ పోశాడు. చుట్టుపక్కలనున్నవారు అక్కడికి వచ్చి స్వల్పంగా చెలరేగిన మంటలను ఆర్పారు. సర్పంచ్‌, వీడీసీ చైర్మన్‌లు అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సర్పంచ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

సర్పంచ్‌పైనా పెట్రోల్‌ పోసిన యువకుడు

త్రుటిలో తప్పించుకున్న సర్పంచ్‌,

వీడీసీ అధ్యక్షుడు

Advertisement
Advertisement