ముగ్గురూ ముగ్గురే! ఎమ్మెల్యేలుగా తొలిసారి ఎన్నిక.. | Sakshi
Sakshi News home page

ముగ్గురూ ముగ్గురే! ఎమ్మెల్యేలుగా తొలిసారి ఎన్నిక..

Published Mon, Dec 25 2023 12:44 AM

- - Sakshi

కామారెడ్డి: జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఒక్క బాన్సువాడలోనే సీనియర్‌ నాయకుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మూడు దశాబ్దాల కాలంలో ఒక్కసారి తప్ప ప్రతి ఎన్నికలో విజయం సాధించారు. మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గానూ పనిచేశారు. అన్ని వ్యవస్థల మీద ఆయనకు అవగాహన ఉంది. కామారెడ్డి నుంచి తొలిసారి విజయం సాధించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డికి గతంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది.

ఎల్లారెడ్డి నుంచి గెలిచిన కె.మదన్‌మోహన్‌రావుకు ప్రజాప్రతినిధిగా ఇది తొలి అనుభవం. ఆయన గతంలో రెండు పర్యాయాలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఉన్నత విద్యావంతుడైన మదన్‌మోహన్‌రావు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ వ్యాపార రంగంలో రాణించారు. పదేళ్లుగా ఇక్కడే ఉంటూ అనేక సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన వివిధ అంశాలపై 20 నిమిషాలపాటు మాట్లాడారు.

నియోజకవర్గ సమస్యలనూ కేస్‌ స్టడీస్‌గా చూపుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో లోటుపాట్లను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. జుక్కల్‌లో తోట లక్ష్మీకాంతారావు కూడా తొలిసారి విజయం సాధించారు. ఉన్నత విద్యావంతుడైన లక్ష్మీకాంతారావు గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. అలాగే వ్యాపార, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.

అధికారులతో సమీక్షలు..
జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు తొలిసారి విజయం సాధించినప్పటికీ వ్యవస్థల మీద ఉన్న అవగాహనతో ముందుకు సాగుతున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవినీతి రహిత నియోజకవర్గంగా కామారెడ్డిని తీర్చిదిద్దడానికి సహకరించాలని అధికారులను కోరారు. ప్రభుత్వాలు అందించే సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేలా, అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలన్నారు. మున్సిపల్‌ సమావేశానికి హాజరై పట్టణాభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని కోరారు. అక్రమాలకు తావులేకుండా ముందుకు సాగాలని సూచించారు.

  • ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు నియోజకవర్గ కేంద్రంలో అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌తో పాటు జిల్లా అధికారులందరూ హాజరయ్యారు. నియోజకవర్గం అభివృద్ధిలో ముందు స్థానంలో నిలిచేలా కృషి చేయాలని కోరారు.
  • జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సైతం ఇటీవల కలెక్టరేట్‌లో అధికారులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు.

అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ..
అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో తప్ప మిగతా రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలోనూ పాల్గొంటున్నారు. అలాగే ఎమ్మెల్యే హోదాలో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఫోకస్‌ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు హాజరవుతూ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు.

ఇవి చ‌ద‌వండి: జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా ‘పొంగులేటి’!

Advertisement

తప్పక చదవండి

Advertisement