ప్రాణం తీసిన స్థిరాస్తి గొడవ | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన స్థిరాస్తి గొడవ

Published Thu, Mar 23 2023 12:44 AM

- - Sakshi

కరీంనగర్‌క్రైం: పండుగపూట నగరంలో విషాదం నెలకొంది. సంతోషంగా ఉగాది వేడుక జరుపుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. భూ వివాదంలో కక్ష పెంచుకొని ఓ వ్యక్తిని గొంతుకోసి దారుణంగా హత్యచేసిన ఘటన భయాందోళనకు గురిచేసింది. కరీంనగర్‌ టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని సంతోశ్‌నగర్‌లో నివాసిస్తున్న పురంశెట్టి నర్సింగరావు– లక్ష్మీ దంపతులకు ఇద్దరు కొడుకులు. చిన్నకొడుకు నరేందర్‌రావు(40) గతంలో ఆస్ట్రేలియాలో చదివి 2009లో స్వస్థలానికి వచ్చాడు. హైదరాబాద్‌కు చెందిన అనూషతో వివాహం కాగా.. కూతురు ఉంది. రెండు నెలల కిత్రం వరకు జార్ఖండ్‌లో సింగరేణిలో ప్రయివేటు ఉద్యోగం చేసి ఇటీవల కరీంనగర్‌కు వచ్చి ఖాళీగా ఉంటున్నాడు. బుధవారం ఉదయం తన ఇంట్లో మటన్‌ ఇచ్చి, 9 గంటల సమయంలో బయటకు వెళ్లాడు. మధ్యలో తన తండ్రి నర్సింగరావు ఫోన్‌ చేసి త్వరగా ఇంటికి రమ్మని సూచించాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో పీటీసీ కాలేజ్‌ రోడ్డు దగ్గరలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ పాతస్కూల్‌ వద్ద గొంతుకోసి హత్యకు గురై నరేందర్‌రావు రక్తపుమడుగులో పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన కుమారుడు నరేందర్‌రావుకు విద్యానగర్‌కు చెందిన బోనాల అజయ్‌, అభిషేక్‌, రాజిరెడ్డి, సత్తి, రాజేందర్‌, శేఖర్‌, శ్రీను, ఆదిరెడ్డితో వివాదాస్పద భూముల గొడవలున్నాయని, సదరు భూమి విషయంలో బలవంతంగా సంతకం చేయకపోయేసరికి కక్ష పెంచుకొని గొంతుకోసి చంపారని చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి నర్సింగరావు కరీంనగర్‌ టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

లోతుగా పోలీసుల విచారణ

హత్య జరిగిన ప్రదేశాన్ని కరీంనగర్‌ టౌన్‌ ఏసీపీతో పాటు సీఐ లక్ష్మీబాబు పరిశీలించారు. సీపీ ఆదేశాల మేరకు లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు విద్యానగర్‌కు చెందిన వారితో గతంలోనే వివాదాస్పద భూమి విషయంలో గొడవలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాలు పరిశీలించగా ఉదయం రెండు బైకులపై ముగ్గురు, ముగ్గురుగా వెళ్లి ఓ బార్‌లో మద్యం తాగారని, తర్వాతే హత్య జరిగిన ప్రదేశానికి సుమారు 3 గంటల వరకు వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. ఆ ఎనిమిది మంది కాల్‌ డేటాను పరిశీలించి ఎవరు ఎవరికి కాల్‌చేశారనే విషయాలపై దృష్టిసారించినట్లు సమాచారం. మద్యం తాగిన తర్వాత భూవివాదం విషయంలో మాటమాట పెరిగి హత్యకు కారణమైనట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ లక్ష్మీబాబు తెలిపారు. భూవివాదంలో జరిగిన హత్యను సీపీ ఎల్‌.సుబ్బారాయుడు సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు తెలిసింది.

నరేందర్‌(ఫైల్‌)

హత్యకు గురైన అమిరిశెట్టి నరేందర్‌

కరీంనగర్‌లో వ్యక్తి దారుణహత్య

కొన్నాళ్లుగా కొనసాగుతున్న భూ వివాదం

పథకం ప్రకారమే హత్య.. కుటుంబ సభ్యుల ఆరోపణ

కేసు నమోదు చేసి లోతుగా విచారిస్తున్న పోలీసులు

అదుపులో ఎనిమిది మంది.. కాల్‌డేటా పరిశీలన

1/1

Advertisement
Advertisement