రేపటి ధర్నాకు టీచర్లు తరలిరావాలి | Sakshi
Sakshi News home page

రేపటి ధర్నాకు టీచర్లు తరలిరావాలి

Published Mon, Mar 27 2023 12:54 AM

చెత్తాచెదారం తొలగిస్తున్న వలంటీర్లు
 - Sakshi

కరీంనగర్‌: టీచర్ల పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని, అన్ని రకాల బిల్లులను సత్వరమే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 28న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పోరెడ్డి దామోదర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. 5 వేల మంది టీచర్లతో యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలివచ్చి, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఉపాధ్యాయునికి డాక్టరేట్‌

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలంలోని మొగ్ధుంపూర్‌ మైనారిటీ గురుకుల పాఠశాల ఇంగ్లిష్‌ ఉపాధ్యాయుడు ఒల్లాల శ్రీనివాస్‌కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. డాక్టర్‌ ఎం.కోటేశ్వర్‌రావు పర్యవేక్షణలో జెండర్‌ డైనమిక్స్‌ ఎ క్రిటికల్‌ స్టడీ ఆఫ్‌ ది సెలెక్ట్‌ నోవెల్స్‌ ఆఫ్‌ శోభా డే అనే అంశంపై చేసిన పరిశోధనకు డాక్టరేట్‌ వచ్చినట్లు శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధికారులు, ఉపాధ్యాయులు ఆదివారం అభినందించారు.

వలంటీర్ల శ్రమదానం

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలంలోని మొగ్ధుంపూర్‌లో వాణినికేతన్‌ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరంలో భాగంగా వలంటీర్లు ఆదివారం శ్రమదానం చేశారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని చెత్తాచెదారం తొలగించారు. సాయంత్రం నిర్వహించిన సమావేశంలో లియో క్లబ్‌ కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌ఎస్‌వీ సాగర్‌ ఆరోగ్యం, పరిశుభ్రతపై వలంటీర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో రమేశ్‌, పర్షరాం, సునీత తదితరులు పాల్గొన్నారు. బొమ్మకల్‌లో ఎస్సారార్‌ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరానికి జాతీయ యువజన అవార్డు గ్రహీత కొండ రవి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచు శ్రీనివాస్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో శారద తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ భవనాలను లైబ్రరీలుగా మార్చాలి

కరీంనగర్‌రూరల్‌: గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న అంబేడ్కర్‌ భవనాలను తాత్కాలిక లైబ్రరీలుగా మార్చాలని దళిత విద్యావంతుల వేదిక గౌరవ అధ్యక్షుడు తాండ్ర మధుకర్‌ కోరారు. ఆదివారం కరీంనగర్‌ మండలంలోని ఇరుకుల్ల, దుర్శేడ్‌, బహుదూర్‌ఖాన్‌పేట తది తర గ్రామాల్లోని భవనాలను ఆయన పరిశీలించారు. వాటికి మరమ్మతులు చేసి, లైబ్రరీలుగా మారిస్తే నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రతినిధులు సురేశ్‌, అజయ్‌, వెంకన్న, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

చీరలు పంపిణీ

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలంలోని గోపాల్‌పూర్‌లో ఆదివారం పంచాయతీ మహిళా కార్మికులు, స్వశక్తి సంఘాల మహిళలకు సర్పంచు ఊరడి మంజుల చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఇటీవల దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ వికాస్‌ పురస్కార్‌ పొందినందుకు స్వశక్తి మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జగన్మోహన్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ వేల్పుల నారాయణ, ఉపసర్పంచు ఆరె శ్రీకాంత్‌, దుర్శేడ్‌ సింగిల్‌విండో చైర్మన్‌ గోనె నర్సయ్య, వార్డుసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల స్థలాలకు హద్దులు ఏర్పాటు చేయాలి

జమ్మికుంట(హుజూరాబాద్‌) : పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి పదేళ్లు గడుస్తుందని, హద్దులు ఏర్పాటు చేయాలని సీపీఎం జోన్‌ కమిటీ నాయకుడు కొప్పుల శంకర్‌ అన్నారు. ఆదివారం మండలంలోని సైదాబాద్‌లో పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలపై ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని, పేదలకు దక్కాల్సిన స్థలాలు దక్కడం లేదని ఆరోపించారు. గ్రామంలో రోడ్డు, మహిళా సమాఖ్య భవనం, యూత్‌ కమ్యూనిటీ హాల్‌ నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

చీరలు అందిస్తున్న సర్పంచు మంజుల
1/2

చీరలు అందిస్తున్న సర్పంచు మంజుల

శ్రీనివాస్‌
2/2

శ్రీనివాస్‌

Advertisement
Advertisement