శోభాయమానంగా హనుమాన్‌ విజయయాత్ర | Sakshi
Sakshi News home page

శోభాయమానంగా హనుమాన్‌ విజయయాత్ర

Published Fri, Apr 7 2023 9:32 AM

అభివాదం తెలుపుతున్న  పీఠాధిపతి, తదితరులు - Sakshi

సప్తగిరికాలనీ: ‘రామలక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్‌కీ.. భారత్‌ మాతాకీ జై.. జై శ్రీరాం.. జై హనుమాన్‌..’ వంటి నినాదాలతో భారీ కాషాయ ధ్వజాలు.. శ్రీరామ, హనుమాన్‌, భరతమాత విగ్రహాలు.. భక్తిశ్రద్ధల మధ్య గురువారం హనుమాన్‌ విజయ యాత్ర ఘనంగా సాగింది. హనుమాన్‌ చిన్న జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్‌, భజరంగదళ్‌ ఆధ్వర్యంలో గాంధీరోడ్‌ రామాలయం వద్ద విగ్రహాలకు నమిలకొండ రమణాచార్యులు పూజలు చేశారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కాగా.. టవర్‌ సర్కిల్‌, కమాన్‌, వన్‌టౌన్‌, బస్టాండ్‌, తెలంగాణ చౌక్‌, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌజ్‌, కోర్టు, మంచిర్యాల చౌరస్తాల మీదుగా ర్యాలీ గాంధీరోడ్‌ రామాలయం వద్దకు చేరుకుంది. సంగారెడ్డి, దుగ్యాలకు చెందిన శ్రీగిరి శేషాద్రినాథ్‌ మఠ పీఠాధిపతి సర్వేశ్వరాంబికా శివాచార్య స్వామీజీ మాట్లాడుతూ.. ధర్మానికి, విశ్వానికి జరుగుతున్న అన్యాయాన్ని రూపుమాపే శక్తి యువతలో ఉందన్నారు. కాషాయం జెండాకు అడ్డగా కరీంనగర్‌ మారబోతోందని అన్నారు. కార్యక్రమంలో పంచముఖ హనుమాన్‌ పీఠాధిపతి పరబ్రహ్మానందగిరి స్వామి, వీహెచ్‌ రాష్ట్ర ప్రచార ప్రముఖ్‌ టి.బాలస్వామి, జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌ రావు, గోరక్ష విభాగ్‌ ప్రముఖ్‌ ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా సంఘ చాలక్‌ డాక్టర్‌ సీహెచ్‌ రమణాచారి తదితరులు పాల్గొన్నారు. పోలీస్‌ కమిషనర్‌ సుబ్బారాయుడు పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement