ఓటరు అర్జీల పరిశీలన స్పీడప్‌ | Sakshi
Sakshi News home page

ఓటరు అర్జీల పరిశీలన స్పీడప్‌

Published Tue, Sep 12 2023 12:24 AM

వీసీలో కలెక్టర్‌ గోపి - Sakshi

● స్వీప్‌ కార్యాచరణపై ప్రణాళిక తయారు చేయండి ● వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

కరీంనగర్‌ అర్బన్‌: ఓటరు జాబితా సవరణలో వచ్చే దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. పెండింగ్‌ ఉన్న దరఖాస్తులను ప్రతీ పోలింగ్‌ కేంద్రం వారీగా పరిశీలించాలని, సంబంధిత అధికారులను పర్యవేక్షిస్తూ త్వరితగతిన దరఖాస్తుల పరిష్కారం అయ్యే విధంగా చూడాలని అన్నారు. జనాభా ఓటరు నిష్పత్తి రూపొందించే సమయంలో 2023 సంవత్సరానికి ఉన్న జనాభా అంచనాను తీసుకోవాలన్నారు. జిల్లాలో అధికంగా, అత్యల్పంగా ఓటరు నమోదు జరిగిన పోలింగ్‌ కేంద్రాలను రివ్యూ చేయాలని, పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్లలో లింగ నిష్పత్తి పరిశీలించాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన థర్డ్‌ జెండర్‌ లు, సెక్స్‌ వర్కర్లు ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలన్నారు. నూతనంగా మంజూరు చేసిన ఓటర్లు, ముద్రించిన ఓటర్‌ గుర్తింపు కార్డులు, పంపిణీపై జిల్లా ఎన్నికల అధికారులు దృష్టి సారించాలని, ఈ నెలాఖరు వరకు మంజూరు చేసిన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులు అందించేందుకు త్వరగా ముద్రణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో నిర్వహించే స్వీప్‌ యాక్టివిటీస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతీ విద్యాసంస్థలో ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేసేందుకు వివిధ రకాల పోటీలు నిర్వహించాలని, జిల్లాలో ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రజలను ప్రభావితం చేయగలిగే ప్రముఖులను గుర్తించి వారితో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నించాలని అన్నారు. జిల్లాలో జరిగే స్వీప్‌ యాక్టివిటీస్‌, ఓటరు అవగాహన కార్యక్రమాలపై మీడియాలో ప్రచారం వచ్చే విధంగా చూడాలని, ప్రతీ కార్యక్రమ వివరాలు సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ కేంద్రాలు, ఓటరు జాబితా, ఓటరు కార్డుల పంపిణీ, ఈవీఎం వీవీప్యాట్‌ యంత్రాల లభ్యత, డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌, కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాటు వంటి అనేక అంశాల పరిశీలన పూర్తిచేయాలని అన్నారు. కలెక్టర్‌ డా.బి.గోపి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, ఇన్‌చార్జి డీఆర్‌వో పవన్‌ కుమార్‌, అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ సి.రాజు, కరీంనగర్‌, హుజూరాబాద్‌ ఆర్డీవోలు కుందారపు మహేశ్వర్‌, సోలిపేట రాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement