ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు స్థానాలు రిజర్వేషన్‌? | Sakshi
Sakshi News home page

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు స్థానాలు రిజర్వేషన్‌?

Published Wed, Sep 20 2023 1:48 AM

- - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: మహిళా బిల్లు ప్రస్తావన ప్రకంపనలు రేపుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే మన రాష్ట్రంలో ఎమ్మెల్యే ఆశావహులను జమిలీ ప్రకటన వెంటాడుతుండగానే మహిళా బిల్లు వార్త గుండెలపై పిడుగుపాటులా పడింది. మహిళా బిల్లుకు పార్లమెంటు ఆమోదం లాంఛనమైన వేళ ఈ చర్చ స్థానికంగా దుమారం రేపుతోంది. బిల్లు ఇప్పటికిప్పుడు అమల్లోకి వస్తే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో ఏయే స్థానాలు రిజర్వేషన్‌ కిందకు వస్తాయి? అన్న లెక్కలు అప్పుడే మొదలయ్యాయి.

అయితే, అదే సమయంలో మహిళా బిల్లును చూడకుండా అందులో పొందుపర్చిన అంశాలు అధ్యయనం చేయకుండా అప్పుడే నిర్ణయానికి రాలేమని సీనియర్‌ ఎమ్మెల్యేలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ నోట్ల రద్దు తరహాలో ప్రభుత్వం ఇప్పటికిప్పుడు అమలు చేస్తే మాత్రం ఉమ్మడి జిల్లా రాజకీయాలపై పా ర్టీలకు అతీతంగా ప్రభావం చూపడం గ్యారెంటీ అ ని కుండబద్దలు కొడుతున్నారు. ఇది నియోజవకరా ్గల పునర్విభజన తర్వాత ఉంటుందా? లేదా ఇ ప్పుడే అమలు చేస్తారా? అనే దానిపై స్పష్టత లేదు.

పాత జిల్లా పరిస్థితి ఇదీ
ఉద్యమాల జిల్లాగా పేరొందిన పాత కరీంనగర్‌ జిల్లా ప్రజలు ఓటు రూపంలో తీర్పులు ఇవ్వడంలోనూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మొత్తం మూడు పార్లమెంటు, 13 అసెంబ్లీ స్థానాలు ఉన్న పాత జిల్లాలో మహిళా రిజర్వేషన్‌ ఇప్పటికప్పుడు అమలు చేయాల్సి వస్తే.. కనీసం నాలుగు సీట్లు కేటాయించాల్సి వస్తుంది. ఇప్పటికే మానకొండూరు, చొప్పదండి, ధర్మపురి నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు స్థానాలు. వీటికి అదనంగా మరో నాలుగు సీట్లను జనాభా దామాషాన మహిళలకు కేటాయించాల్సి వస్తుంది. అంటే.. మూడు ఎస్సీ, నాలుగు మహిళలకు కేటాయిస్తే ఆరు జనరల్‌ స్థానాలు అవుతాయి.

ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ 13 మంది అసెంబ్లీ స్థానాలకు 13 మంది అభ్యర్థులు పురుషులనే ప్రకటించింది. ఆ సమయంలో ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు 85 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఇంకా ఖరారు కాలేదు. బీఎస్పీ, ఏఐఎఫ్‌బీ నుంచి పోటీకి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. మహిళా బిల్లు అనివార్యమైతే ఇప్పటికే బరిలో ఉన్న సిట్టింగ్‌లు, పోటీ చేయబోయే ఆశావహుల(దాదాపు 150 మంది)కు ఈ బిల్లును శరాఘాతంగా భావిస్తున్నారు.

1951 నుంచి తక్కువే..
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కరీంనగర్‌ జిల్లా నుంచి మహిళా ప్రాతినిధ్యం తక్కువే అని చెప్పాలి. దీనికి సామాజికంగా, రాజకీయంగా అనేక కారణాలు ఉన్నాయి. హైదరాబాద్‌ రాష్ట్రంలో 1951లో జరిగిన ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి జేఎం రాజమణి దేవి (ఎస్‌సీఎఫ్‌) వేదికపై విజయం సాధించారు. తర్వాత 1972 నుస్తులాపూర్‌ నియోజకవర్గం నుంచి ప్రేమలతా దేవి (కాంగ్రెస్‌) విజయం సాధించారు.

1998లో విద్యాసాగర్‌రావు లోక్‌సభకు ఎన్నికవడంతో మెట్‌పల్లి అసెంబ్లీస్థానానికి రాజీనామా చేశారు. దీంతో కొమిరెడ్డి జ్యోతిదేవి (కాంగ్రెస్‌) మెట్‌పల్లి ఉపఎన్నికల్లో గెలిచారు. 1998, 1999 పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి ఎంపీగా డాక్టర్‌ సుగుణకుమారి రెండుసార్లు గెలిచారు. 2014లో చొప్పదండి నుంచి బొడిగె శోభ (టీఆర్‌ఎస్‌) ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వం 33శాతం అమలు చేయాల్సి వస్తే ఈ లెక్కలన్నీ మారిపోతాయనడంలో సందేహం లేదు.

తెరపైకి సతీమణులు
మహిళా బిల్లు ఇప్పటికప్పుడు అమలు చేయాల్సి వచ్చినా.. మన నేతలు నిరుత్సాహపడినా.. పోటీకి వెనకడుగు వేయడం, నియోజకవర్గం మారడం వంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. ఒకవేళ మహిళా బిల్లు అమలు చేయాల్సి వస్తే తమ భార్యలు, కూతుళ్లు, కోడళ్లను రంగంలోకి దించాలని యోచిస్తున్నారు. మహిళా బిల్లు పార్టీలతో సంబంధం లేకుండా అమలు చేయాల్సిన అంశం కాబట్టి, దీని అమలు ప్రభావం అన్ని పార్టీల్లో ఉంటుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే తమ అభ్యర్థుల జాబితా ప్రకటించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా అభ్యర్థుల పేర్లు మార్చాల్సి రావొచ్చు.

అలాగే, కాంగ్రెస్‌, బీజేపీలు కూడా బిల్లుకు అనుగుణంగా తమ జాబితాను రూపొందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ పార్టీ నాయకుడైనా సరే తమకు కాకుంటే తమ ఇంట్లో ఆడవారికి ఇప్పించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. తిరిగి గెలిచేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఈసారైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్ష పార్టీలు గత పదేళ్లుగా నియోజకవర్గాల్లో రూ.కోట్లాది ఖర్చు చేశారు. తీరా మహిళా బిల్లు వారికి శరాఘాతంగా మారినా.. అమలు అనివార్యమైతే దానిని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో తలమునకలయ్యారు.

Advertisement
Advertisement