విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

Published Fri, Nov 3 2023 1:56 AM

రవి (ఫైల్‌), కుమార్‌ సింగ్‌ (ఫైల్‌)
 - Sakshi

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామ శివారులోని స్టోన్‌ క్రషర్‌ వద్ద పని కోసం లారీపై తరలిస్తున్న ఎక్సవేటర్‌ యంత్రం వేలాడుతున్న కరెంటు తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై భూక్య రవి(40) అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడ్డ లారీ డ్రైవర్‌ దీప్‌నారాయణ్‌ కుమార్‌సింగ్‌(38) చికిత్స పొందుతూ కరీంనగర్‌లో మరణించాడు. క్లీనర్‌ ఉదయ్‌ చౌదరి గాయపడి చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బసంత్‌నగర్‌ ఎస్సై వెంకటేశ్‌ వెల్లడించారు. హుస్నాబాద్‌ నుంచి పెద్దపల్లి మండలం బొంపల్లి శివారులోని క్రషర్‌లో పని చేసేందుకు వస్తుండగా జరిగిన ప్రమాదంలో నల్ల గొండ జిల్లా దామరచర్ల మండలం దంజాతండాకు చెందిన భూక్య రవి అక్కడికక్కడే మరణించాడని తెలిపారు. మృతుడికి భార్య కవిత, ఇద్దరు పిల్లలున్నారు. లారీ డ్రైవర్‌గా పని చేస్తున్న బీహార్‌ రాష్ట్రానికి చెందిన దీప్‌నారాయణ్‌ కుమార్‌సింగ్‌, క్లీనర్‌ ఉదయ్‌ చౌదరి గాయపడ్డారు. వారిని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చేయించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దీప్‌నారాయణ్‌ కుమార్‌సింగ్‌ మరణించాడు. ఉదయ్‌ చౌదరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఎస్సై తెలిపారు. మృతుడు రవి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

అధికారుల నిర్లక్ష్యమే కారణం

బొంపల్లి గ్రామ శివారులో విద్యుత్‌ తీగలు వేలాడుతున్నాయని, వాటిని సరి చేయాలంటూ విద్యుత్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్లే రెండు నిండు ప్రాణాలు బలయ్యాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కరెంటు తీగలతో ప్రమాదముందంటూ పంచాయతీ పాలకులు, క్రషర్‌ యజమాన్యం రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసినా సంబంధిత విద్యుత్‌ అధికారుల్లో స్పందన కరువైందని వాపోతున్నారు.

మరో పది నిమిషాలైతే..

హుస్నాబాద్‌ నుంచి ఎక్సవేటర్‌తో లారీపై బయల్దేరిన వారు మరో పది నిమిషాలైతే పని చేయాల్సిన స్టోన్‌ క్రషర్‌ వద్దకు చేరుకునేవారని స్థానికులు పేర్కొంటున్నారు. క్షణాల్లో విద్యుదాఘాతానికి గురై ఇరువురు మరణించడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

1/1

Advertisement
Advertisement