ఈసారి స్థానికులే అధికం | Sakshi
Sakshi News home page

ఈసారి స్థానికులే అధికం

Published Sun, Nov 12 2023 1:24 AM

-

● చొప్పదండిలో 18 నామినేషన్లు ● 15 మంది స్థానికులే.. ● స్థానికేతరుల ముద్రకు దూరం ● నియోజకవర్గ పరిధిలోనే ఓటు హక్కు

చొప్పదండి: ఆరు శాతాబ్దాలుగా అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికేతరుల అడ్డాగా పేరుగాంచిన చొప్పదండి నియోజకవర్గంలో ఈసారి స్థానిక ఓటర్లే నామినేషన్‌ల పర్వంలో ముందున్నారు. ఈ నెల 10న ముగిసిన నామినేషన్‌ ప్రక్రియలో పద్దెనిమిది మంది నామినేషన్‌లు వేయగా పదిహేను మంది స్థానిక ఓటర్లే కావడం గమనార్హం. నియోజకవర్గంలోని చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయిన్‌పల్లి మండలాలకు చెందిన ఓటర్లు 15 మంది నామినేషన్‌ దాఖలు చేసిన వారిలో ఉన్నారు. మరో ముగ్గురు స్థానికేతరులు.

అడ్రస్‌ మార్చారు

ప్రధాన రాజకీయ పార్టీల తరఫున నామినేషన్‌లు వేసిన అభ్యర్థులు తమ ఓటుహక్కును నియోజకవర్గపరిధిలోకి మార్చుకున్నారు. సైదాపూర్‌ మండలానికి చెందిన బీజేపీ అభ్యర్థి బొడిగె శోభ, ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థి మేడిపల్లి సత్యంలు గంగాధర మండలం మధురానగర్‌లో తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. వీరిద్దరు 2014, 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ తలపడ్డారు.

ఇండిపెండెంట్లుగా ఆరుగురు

జాతీయ, రాష్ట్రీయ రాజకీయ పార్టీల నుంచి నలుగురు అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేయగా, రిజిష్టర్డ్‌ పొలిటికల్‌ పార్టీల తరఫున ఎనిమిది మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక నియోజకవర్గంలోని అయిదుగురు, స్థానికేతరులు ఒక్కరు ఇండిపెండెంట్లుగా నామినేషన్‌లు వేసిన వారిలో ఉన్నారు. ప్రస్తుతం గంగాధర, చొప్పదండి మండలాల నుంచి అయిదుగురు చొప్పున, రామడుగు మండలం నుంచి ముగ్గురు, బోయినపల్లి మండలం నుంచి ఇద్దరు నామినేషన్‌లు వేయగా, మిగితా ముగ్గురు కరీంనగర్‌, పెగడపల్లి, ధర్మారం మండలాల నుంచి నామినేషన్‌ వేశారు.

ఈవీఎంలో పదిహేను మందికే అవకాశం

శాసనసభ ఎన్నికలలో అభ్యర్థుల సంఖ్య పదిహేను దాటితే రెండు ఈవీఎంలను ఉపయోగించాల్సి ఉంటుంది. నామినేషన్‌ల ఉపసంహకరణ అనంతరం ఎంత మంది బరిలో ఉంటారో తేలాకే ఈవీఎంలపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. చొప్పదండి అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో 14 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో ఒక బూత్‌లో ఒకే ఈవీఎంతో ఎన్నికలను నిర్వహించారు. ఇక 2014లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 16 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో నోటాతో కలిపి 17 గుర్తులను కేటాయించాల్సి రావడంతో ఒక్క అభ్యర్థి కోసం ప్రతి బూత్‌లో రెండు ఈవీఎంలను వాడారు. ఈ నెల 15న నామినేషన్‌ల ఉపసంహకరణ ప్రక్రియ పూర్తయ్యాకే బరిలో నిలిచేవారి సంఖ్య తేలనుంది.

Advertisement
Advertisement