రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

14 Nov, 2023 01:02 IST|Sakshi
సువర్ణ మృతదేహం

జమ్మికుంట(హుజూరాబాద్‌): రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. జమ్మికుంట పట్టణ సీఐ రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మికుంట మండలంలోని సైదాబాద్‌కు చెందిన కోడెం శ్రీనివాస్‌కు గోదావరిఖనికి చెందిన సువర్ణ(35)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దంపతులిద్దరూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపనీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో దీపావళి నోము ఉందని శనివారం రాత్రి దంపతులు హైదరాబాద్‌ నుంచి బైక్‌పై సైదాబాద్‌ వస్తున్నారు. జమ్మికుంట పట్టణ శివారులోని స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద వాహనం అదుపుతప్పడంతో సువర్ణ కిందపడింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాస్‌ అజాగ్రత్తగా బైక్‌ నడపడం వల్లే సువర్ణ మృతి చెందిందని ఆమె సోదరుడు పోరండ్ల భీంరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

విద్యుదాఘాతంతో యువకుడు..

కోరుట్లరూరల్‌: చిన్నమెట్‌పల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో మహమ్మద్‌ ముస్తాక్‌(30) అనే వ్యక్తి మృతిచెందాడు. సోమవారం తను కౌలుకు చేసే పొలంలో కింద పడి ఉన్న విద్యుత్‌ తీగను చుడుతుండగా.. ప్రమాదవశాత్తు షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు