కాంగ్రెస్‌, బీజేపీని నమ్మొద్దు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌, బీజేపీని నమ్మొద్దు

Published Thu, Nov 16 2023 6:12 AM

హాజరైన జనం - Sakshi

కరీంనగర్‌: పుట్టిన బిడ్డ తల్లి ఒడిలో ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో.. అలాగే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్‌ చేతిలో ఉంటేనే మన భవిష్యత్‌ బాగుంటుందని, కాంగ్రెస్‌, బీజేపీల మాయమాటలను నమ్మొద్దని బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా 6, 7, 30 డివిజన్ల పరిధిలోని యజ్ఞవరహాస్వామి టెంపుల్‌, మారుతినగర్‌ చౌరస్తా, హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీల్లో గంగుల కమలాకర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమం ఇంతకు రెట్టింపుతో అమలు కావాలంటే కేసీఆర్‌ గెలవాలి.. కేసీఆర్‌ గెలవాలంటే కారు గుర్తుకు ఓటేయాలని సూచించారు. మూడోసారి అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌, కేసీఆర్‌ ఆరోగ్య బీమా, సౌభాగ్యలక్ష్మి పేరుతో అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేలు అందివ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి, రైతుబంధు ఎత్తేస్తాం అంటున్నారు.. 24 గంటల కరెంట్‌కు బదులు 3 గంటల కరెంట్‌ ఇస్తామని నేతలు అంటున్నారు.. ఈ మూడు ఎత్తేస్తే రైతాంగం తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌తోనే తెలంగాణ భవిత భద్రంగా ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు చేస్తున్న గోబెల్స్‌ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని, అబద్ధాలు ఆడటం వారి నైజమని, రానున్న రోజుల్లో ఆ రెండు పార్టీల అభ్యర్థులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నగర మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్‌, కార్పొరేటర్లు కోల మాలతి–సంపత్‌రెడ్డి, నేతికుంట యాదయ్య, ఆకుల పద్మ ప్రకాష్‌, నియోజకవర్గ యూత్‌ ప్రెసిడెంట్‌ నేతికుంట హరీష్‌, నాయకులు గోలి రవి, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌లో చేరిక

పూసాల శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో రజక సంఘం నాయకులు, కార్పొరేటర్‌ కొండపల్లి సరిత సతీష్‌ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు పెద్దఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గంగుల కమలాకర్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గంగుల మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు.

నామినేషన్ల ఉపసంహరణ

కరీంనగర్‌ అభివృద్ధి కేవలం మంత్రి గంగుల కమలాకర్‌తోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో గంగుల గెలుపు కోసం తాము పని చేస్తామని ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు బుధవారం నామినేషన్లు ఉపసంహరించుకొని గంగులకు మద్దతు పలికారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన కంది అశోక్‌రెడ్డి, కొట్టే రమేశ్‌, ఎండీ షుక్రోద్దీన్‌ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మంత్రి గంగులను గెలిపించుకునేందుకే నామినేషన్లను ఉపసంహరించుకున్నామని వెల్లడించారు.

టిప్పర్‌ అసోసియేషన్‌ సభ్యుల మద్దతు

శివశక్తి టిప్పర్‌ అసోసియేషన్‌ సభ్యులు మంత్రి గంగుల కమలాకర్‌ సమక్షంలో బుధవారం బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతుగా తీర్మాన పత్రాన్ని అందజేశారు. మంత్రి గంగుల మాట్లాడుతూ.. కరీంనగర్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపరచడం జరిగిందని, 70సంవత్సరాలుగా జరగని అభివృద్ధి కేసీఆర్‌ పాలనలో పది సంవత్సరాలుగా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. శివశక్తి టిప్పర్‌ అసోసియేషన్‌ సలహాదారుడు, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గుంజపడుగు హరిప్రసాద్‌, అధ్యక్షుడు చందు, ప్రధాన కార్యదర్శి అభిలాష్‌ ఆధ్వర్యంలో గంగులకు పూర్తి మద్దతు ప్రకటించారు. నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, పొన్నం అనిల్‌, నాయకులు నందెల్లి మహిపాల్‌, వాసాల రమేశ్‌, జమీలొద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి చూసే చేరిక

సీఎం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి యువత పెద్దఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని నగర మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు. కరీంనగర్‌లోని మంత్రి గంగుల కమలాకర్‌ నివాసం వద్ద బుధవారం కమాన్‌పూర్‌ గ్రామానికి చెందిన 40 మంది యువకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. మేయర్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు గంగుల హరిహరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓటు బీఆర్‌ఎస్‌కే వేయాలి

కొత్తపల్లి: మంత్రి గంగుల కమలాకర్‌కు ఓటెయ్యవా దయచేసి అంటూ మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల గదవ పట్టుకొని విజ్ఞప్తి చేశారు. 10, 11 వార్డుల్లో బీఆర్‌ఎస్‌నే గెలిపించాలని కోరారు. కౌన్సిలర్లు సత్యనారాయణరెడ్డి, గండు రాంబాబు, నాయకులు ఆంజనేయులు, ఎస్‌.సత్యనారాయణ, విజయ్‌, సదానందం తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమం మా ఎజెండా

పదేళ్ల అభివృద్ధిని చూసి ఓటేయండి

బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థి,

మంత్రి గంగుల కమలాకర్‌

యజ్ఞవరాహాస్వామి ఆలయం వద్ద ప్రచారంలో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌
1/1

యజ్ఞవరాహాస్వామి ఆలయం వద్ద ప్రచారంలో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌

Advertisement
Advertisement