రెండో స్థానం కోసమే వారి పోటీ | Sakshi
Sakshi News home page

రెండో స్థానం కోసమే వారి పోటీ

Published Thu, Nov 16 2023 6:12 AM

హాజరైన జనం - Sakshi

కరీంనగర్‌టౌన్‌: కరీంనగర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. బీజేపీ గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు. సాలు గంగుల.. ఇక సెలవు గంగుల.. బైబై గంగుల అంటూ యువకులతో కలిసి నినదించారు. ఎన్నికల్లో భాగంగా బుధవారం కరీంనగర్‌ బీజేపీ కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆ తరువాత కరీంనగర్‌లోని రాంనగర్‌, సీతారాంపూర్‌, ఆరెపల్లిలో బండి సంజయ్‌ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో గంగుల కమలాకర్‌ లక్ష సెల్‌ఫోన్లను, ఓటుకు రూ.10 వేలను నమ్ముకున్నడు.. నేను ధర్మాన్ని, కరీంనగర్‌ ప్రజలను నమ్ముకున్న.. ప్రజలే అంతిమ నిర్ణేతలు.. తగిన తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు. ఓట్లు, సీట్ల కోసం పేర్లు, కులగోత్రాలు మార్చుకునే నీచమైన పార్టీలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్సేనని విమర్శించారు. రాహుల్‌ గాంధీ అసలు పేరు రౌల్‌ విన్సీ.. రాజకీయాల్లోకి వచ్చి రాహుల్‌ గాంధీగా మారారు.. కల్వకుంట్ల అజయ్‌రావు.. కల్వకుంట్ల తారక రామారావుగా మారారు.. ఇప్పుడు కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌ ఎంఐఎం ఓట్ల కోసం దారుస్సలాం పోయి టోపీ పెట్టుకొని కరీంనగర్‌ కమ్రుద్దీన్‌గా మారారంటూ తనదైన శైలిలో సైటెర్లు వేశారు. 50 లక్షల మంది నిరుద్యోగులు, 40 లక్షల మంది రైతులతో పాటు మహిళలు, విద్యార్థులు సహా సబ్బండ వర్గాల సమస్యలపై యుద్ధం చేసిన.. రెండుసార్లు జైలుకు పోయిన.. లాఠీ దెబ్బలు తిన్న.. కేసీఆర్‌ నాపై 74 కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నడు.. అయినా వెనకాడలేదు.. పోరాడుతూనే ఉంటా.. కేసీఆర్‌ ఇంటికో ఉద్యోగమిస్తామని మోసం చేసిండు.. 50 లక్షల నిరుద్యోగులు ఏళ్ల తరబడి కోచింగ్‌కే పరిమితమై తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నరు.. నేను ప్రజా సమస్యలపైనే పోరాడిన తప్ప.. దొంగ దందాలు, భూకబ్జాలు చేయలేదు.. నా కుటుంబం కోసం కొట్లాడలేదు.. కానీ ఇక్కడ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రజల కోసం ఏం చేశారు? భూకబ్జాలు, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నరు.. నేను కరీంనగర్‌ అభివృద్ధికి ఏం చేశానో? ఎన్ని కేంద్ర నిధులు తెచ్చానో బహిరంగంగా చర్చించేందుకు సిద్ధమని సవాల్‌ విసిరితే ముఖం చాటేసినోళ్లు బీఆర్‌ఎస్‌ నేతలు.. ఇప్పుడు చెబుతున్నా.. కరీంనగర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులకు నిధులన్నీ కేంద్రానివే.. తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణం కోసం రూ.150 కోట్ల నిధులు నేను తీసుకొస్తే.. తానే చేసినట్లు కొబ్బరికాయ కొట్టి ఫోజులిచ్చిన మోసగాడు గంగుల కమలాకర్‌.. కేంద్రం నుంచి ఆ నిధులన్నీ నేనే తెచ్చినట్లు ఆధారాలతో సహా నిరూపిస్తా.. అంతేకాదు.. కరీంనగర్‌ అభివృద్ధికి నేను ఎన్ని నిధులు తెచ్చానో లెక్కాపత్రంతో వస్తా.. దమ్ముంటే కేసీఆర్‌ను బహిరంగ సభకు రమ్మను.. నేను తప్పు చేసినట్లు రుజువు చేస్తే ఎన్నికల్లో పోటీ చేయకుండా విరమించుకుంటా అంటూ సవాల్‌ విసిరారు. ఇప్పుడు ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంట్‌ రెచ్చగొట్టాలని చూస్తున్నడు.. బీఆర్‌ఎస్‌ ఓడిపోతే ఆంధ్రోళ్ల పెత్తనం వస్తదట.. నేనడుగుతున్న.. ఇప్పుడు ఆంధ్రా ఎక్కడిది? నీకు అవసరముంటే తెలంగాణ అంటవ్‌.. అవసరం తీరాక కరివేపాకులా తీసిపారేస్తవ్‌.. అసలు టీఆర్‌ఎస్‌ పేరును తీసేసి బీఆర్‌ఎస్‌గా పెట్టుకున్న మీకు తెలంగాణ పేరెత్తే అర్హత కూడా లేదన్నారు. నేనడుగుతున్నా.. తెలంగాణకు దక్కాల్సిన కృష్ణ నీళ్లను ఆంధ్రాకు దోచిపెట్టింది కేసీఆర్‌ కదా? రాయలసీమకు పోయి చేపల పులుసు తిని తెలంగాణ సొమ్ముతో రాయలసీమను రత్నాల సీమగా మారుస్తానన్నడు.. అప్పుడెందుకు కేసీఆర్‌ను నిలదీయలేదు కమలాకర్‌ అని ప్రశ్నించారు. తెలంగాణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2లక్షల40వేల ఇళ్లు మంజూరు చేస్తే.. కేసీఆర్‌ పేదలకు ఒక్క ఇల్లయినా ఇచ్చారా? ఇవ్వకపోతే గంగుల కమలాకర్‌ కేసీఆర్‌ను ఎందుకు అడగలేదు? ఆ ఇళ్లన్నీ పేదలకు కట్టిస్తే.. నేను ప్రధానితో మాట్లాడి తెలంగాణకు మరో 5 లక్షల ఇళ్లు మంజూరు చేయించుకొస్తా.. సహకరించాలని చెబితే కేసీఆర్‌ కిమ్మనలేదు.. కేసీఆర్‌ 100 గదులతో ప్రగతి భవన్‌ కట్టుకొని హాయిగా తాగుతున్నవ్‌.. మరి పేదలు ఏం పాపం చేశారు.. వాళ్లకు ఇళ్లు ఎందుకివ్వలేదని మండిపడ్డారు. ఓట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ ముస్లిం మత గురువులను నమ్ముకుంది.. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంఐఎం పార్టీని పట్టుకుంది.. వాళ్ల మత గురువులు వచ్చి గల్లీల్లో ప్రచారం చేస్తున్నరు.. రెండు పార్టీలు సిగ్గు లేకుండా 12 శాతం ఓట్ల కోసం పని చేస్తన్నయ్‌.. హిందూ మత పెద్దలు, సాధుసంతులు, అర్చక సమాజం ఆలోచించాలి.. మీరు కూడా బయటకు రండి.. హిందూ సమాజ సంఘటిత శక్తిని ఏకం చేయండి.. లేకుంటే రెండు పార్టీలు హిందూ సమాజాన్ని చులకనగా చూసే ప్రమాదముంది.. బొట్టు పెట్టుకొని, కంకణం కట్టుకునే పరిస్థితి కూడా ఉండదని మండిపడ్డారు. ఓటర్లు ఆలోచించి పువ్వు గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ధర్మాన్ని, కరీంనగర్‌ ప్రజలనే నమ్ముకున్నా

గంగుల ఓటుకు రూ.10 వేలు,

లక్ష సెల్‌ఫోన్లను నమ్ముకున్నడు

బీజేపీ కరీంనగర్‌ అసెంబ్లీ అభ్యర్థి

బండి సంజయ్‌కుమార్‌

సీతారాంపూర్‌లో మాట్లాడుతున్న ఎంపీ బండి సంజయ్‌కుమార్‌
1/1

సీతారాంపూర్‌లో మాట్లాడుతున్న ఎంపీ బండి సంజయ్‌కుమార్‌

Advertisement
Advertisement