బీఆర్‌ఎస్‌, ఎంఐఎం.. బీజేపీ బీ టీం | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌, ఎంఐఎం.. బీజేపీ బీ టీం

Published Mon, Nov 27 2023 12:12 AM

అభివాదం చేస్తున్న ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బగేల్‌, కాంగ్రెస్‌ నాయకులు
 - Sakshi

కరీంనగర్‌ కార్పొరేషన్‌: బీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు బీజేపీకి బీ టీం అని, ఈ మూడు పార్టీలు ఒక్కటేనని చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బగేల్‌ అన్నారు. దేశంలో ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌పార్టీ విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్‌ అంటేనే భరోసా అని, అధికారంలోకి రాగానే తెలంగాణలో ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తుందని ఆయన తెలిపారు. ఆదివారం నగరంలోని మహాత్మా జ్యోతిబాపూలే మైదానంలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ బహిరంగసభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 30న నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఘన విజయం సాధిస్తుందని, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాబోతోందని చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణను కేసీఆర్‌ లూటీ చేస్తుంటే, ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నాడన్నారు. తెలంగాణలో బీజేపీ గెలిచే సత్తా లేదన్నారు. దేశవ్యాప్తంగా సిలిండర్‌ను రూ.500కు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ప్రజల కోసం సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, కేసీఆర్‌ ఆ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ఆరు గ్యారంటీ పథకాలను ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతోనే ఆరు గ్యారంటీలు అమలు చేసి చూపిస్తామని అన్నారు. రోటీని కాల్చేటప్పుడు తిప్పకపోతే మాడిపోతుందని, ఈ సారి రాష్ట్రంలో అలా రోటీని తిప్పితేనే తినగలుగుతామని చమత్కరించారు. ఈ సభలో కాంగ్రెస్‌ నాయకులు మస్తాన్‌అలీ, వైద్యుల అంజన్‌కుమార్‌, మెనేని రోహిత్‌రావు, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కట్ల సతీష్‌, ఆరిఫ్‌ అహ్మద్‌, ఎం.డి.తాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగం ద్వారానే స్వేచ్ఛా

రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే వ్యక్తి స్వేచ్ఛ సాధ్యమైందని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆదివారం డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. డీసీసీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కొరివి అరుణ్‌కుమార్‌, పీసీసీ మాజీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ముల్కల ప్రవీణ్‌, బొబ్బిలి విక్టర్‌, కవిత, షబానా, జ్యోతి, రమేష్‌, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

దోచుకోవడమే పనిగా కేసీఆర్‌ కుటుంబం

నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌దే విజయం

అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు

ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బగేల్‌

Advertisement
Advertisement