కంచుకోటకు బీటలు | Sakshi
Sakshi News home page

కంచుకోటకు బీటలు

Published Tue, Dec 5 2023 5:00 AM

- - Sakshi

● ఉమ్మడి జిల్లాలో ‘కారు’కు ఊహించని ఫలితాలు ● ఏ పథకం మొదలు పెట్టినా ఇక్కడ నుంచే.. ● పథకాల అమలులోనూ పక్షపాతం ● పార్టీ నేతల అవినీతి, వెన్నుపోటు రాజకీయాలు ఓటమికి కారణమని అనుమానం

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువైన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీకి శాసనసభ ఫలితాల్లో ఊహించని దెబ్బ తగి లింది. తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారిగా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 2014లో జగిత్యాల నుంచి కాంగ్రెస్‌ శాసనసభ్యుడిగా తాటిపర్తి జీవన్‌రెడ్డి ఎన్ని కయ్యారు. మిగతా 12 సీట్లను బీఆర్‌ఎస్‌ గెలుచుకు ని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2018 ఎన్నికల్లో మంథని నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఒక్కరే ఎన్నికయ్యారు. మిగితా 12 చోట్ల బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలే గెలువడంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా గులాబీ పార్టీకి గుండెకాయలా నిలిచింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా ఎనిమిది సీట్లను గెలుచుకుని గులాబీ కంచుకోటకు బీటలు పారించడడంతో గులాబీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఐదు సీట్లకే పరిమితం

బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. రెండు దఫాలుగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఒక్క సీటుకు పరిమితం చేయడమేకాకుండా పది సంవత్సరాలుగా జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీల ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుస్తూ ప్రతిపక్షాలను చిత్తు చేయడంతో ఆ పార్టీల ఊసే లేకుండాపోయింది. సర్పంచ్‌ మొదలు ఎమ్మెల్యే, మంత్రుల వరకూ గులాబీ దళపతులే కావడంతో పరిపాలన వ్యవస్థ గాడి తప్పింది. బీఆర్‌ఎస్‌ నేతలు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల ను ప్రజలకు అందించే క్రమంలో.. లబ్ధిదారుల ఎంపికలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అర్హులకు కా కుండా అనర్హులను ఎంపిక చేయడంతో గ్రామాల్లో అలజడులకు బీజం పోసినట్లయింది. పార్టీ నాయకుల ఒంటెత్తుపోకడలు, వారిని అదుపులో పెట్టాల్సిన ప్రజాప్రతినిధులు చూసీచూడనట్లు ఉండటంతో క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌ అంటేనే గ్రామాల్లో ఒకింత అసహనానికి గురి చేసింది. ఇలా పెత్త నం చెలాయించే వ్యక్తుల సంఖ్య క్రమేపీ పెరిగింది. డబుల్‌బెడ్‌రూం, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బీసీ చేయూత, గృహలక్ష్మి వంటి పథకాలు ప్రవేశపెట్టిన క్రమంలో చెప్పిన మాటలకు క్షేత్రస్థాయిలో జరిగిన ఆచరణకు పొంతన లేకపోవడంతో పల్లెల్లో ప్రజలు, నాయకులకు మధ్య విభజన రేఖ మొదలైంది. పథకాల అమలు విషయంలో పార్టీ వ్యక్తులు, అనుకూలమైన వారికే కట్టబెట్టడం వంటి సంఘటనలను ప్రజలు మరిచిపోలేకపోయారు. లబ్ధిదారుల అర్హుల జాబితా తయారు చేసే సమయంలో గ్రామాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు రావడం, పదుల సంఖ్యలో పథకాలు అమలుకావడంతో ప్రజల్లో బీఆర్‌ఎస్‌ పార్టీపై, నాయకుల తీరుపై చర్చలు తీవ్రస్థాయిలో ఆలోచింపజేసే విధంగా జరిగి అసంతృప్తికి దారి తీశాయి.

మొదలైన పోస్టుమార్టం

గులాబీ జెండాకు అండగా నిలుస్తూ వచ్చిన ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి ఎనిమిది సీట్లను కట్టబెట్టడం.. బీఆర్‌ఎస్‌కు కేవలం ఐదు సీట్లకు పరిమితం చేయడంపై పార్టీలో పోస్టుమార్టం మొదలైంది. పెద్దపల్లి జిల్లా మొత్తంలో ఒక్కసీటు కూడా రాకపోవడంపై బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు ఆరా తీస్తున్నారు. సింగరేణి కార్మికులు ఉద్యమకాలం నుంచి బీఆర్‌ఎస్‌ వైపే ఉన్నా.. మంథని, రామగుండం, పెద్దపల్లిలో విజయం సిద్ధించకపోవడంపై పోస్టుమార్టం మొదలైంది. చొప్పదండిలో పోలీసు పోస్టింగుల వివాదం, స్థానిక నేతల మధ్య సయోధ్య కుదరకపోవడం ద్వారా అక్కడ పార్టీ పరాజయం పాలైందని సమాచారం. అలాగే మానకొండూరులో దళితబంధులో అక్రమాలు జరిగాయని, అభివృద్ధి పనులు సరిగా జరగలేదన్న అభిప్రాయం ఓటమికి కారణమై ఉండవచ్చని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు. వేములవాడలో బీఆర్‌ఎస్‌ హోరాహోరీగా పోరాడినా.. కాంగ్రెస్‌ అభ్యర్థిపై సానుభూతి ముందు నిలవలేకపోయింది. ధర్మపురిలోనూ ఇదే సానుభూతి పవనాలు కాంగ్రెస్‌ విజయానికి బాటలు వేశాయి. కరీంనగర్‌లో వెన్నుపోటు రాజకీయాలు విజయాన్ని ప్రభావితం చేశాయి. కొందరు కీలక నేతలు ఆఖరు నిమిషంలో పార్టీ మారడం, బీఆర్‌ఎస్‌లో ఉండి ఇతర పార్టీల కోసం పనిచేయడం విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది.

కొంపముంచిన అవినీతి, వెన్నుపోటు రాజకీయాలు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగడం, క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు ద్వితీయ శ్రేణి నాయకులు చేతివాటం ప్రదర్శించడంతో గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ నాయకుల అవినీతికి అడ్డూఅదుపు లేకుండాపోయింది. పార్టీని సమన్వయం చేసి ప్రభుత్వ పథకాలను ప్రజలదరికి చేర్చాల్సిన ప్రజాప్రతినిధులు.. గ్రామాల్లో రెండుగా విడిపోయి వర్గాలుగా తయారుకావడం, వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడటం లాంటి విషయాలు పార్టీని కోలుకోని దెబ్బతీశాయని చెప్పవచ్చు. ఏదేమైనా 2001లో ఎస్సారార్‌ కళాశాల మైదానం వేదికగా జరిగిన సింహాగర్జన బహిరంగ సభ నుంచి, తెలంగాణ ఉద్యమంలో ప్రతి సందర్భాన్ని కరీంనగర్‌ నుంచే ఉద్యమాన్ని రగిలించడం, చివరకు 2009లో తెలంగాణ కోసం కేసీఆర్‌ ఆమరణ దీక్షకు పూనుకోవడం లాంటి సంఘటనలు ఉద్యమ తొలినాళ్లల్లో మరిచిపోలేని సంఘటనలు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలన్నింటికి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లానే వేదిక కావడం మరిచిపోలేని విషయం.

ఉమ్మడి జిల్లాకు పెద్దపీట

బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లాలో ఈటల రాజేందర్‌, కేటీఆర్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌కు మంత్రి పదవులు కట్టబెట్టడమే కాకుండా పదుల సంఖ్యలో రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులను జిల్లాకు చెందిన వారికే అవకాశం ఇచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారించకుండా, జిల్లా, మండల, గ్రామ కమిటీలు లేకుండా, పార్టీ అనుబంధ విభాగాలపై దృష్టిసారించకుండా చోటామోటా నాయకులంతా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించడంతో పార్టీపై అజమాయిషీ లేకుండా పోయింది. దీంతో క్షేత్రస్థాయి నాయకుల ప్రవర్తనకు, వారు చేస్తున్న అవినీతికి విసిగివేసారిన ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న తరుణంలో శాసనసభ ఎన్నికలు వచ్చాయి. ప్రత్యామ్నాయ రూపంలో కాంగ్రెస్‌ పార్టీ కనబడడంతో ఆ పార్టీ వైపే అన్ని వర్గాల ప్రజలు మొగ్గు చూపారు. ఇది బీఆర్‌ఎస్‌ పార్టీ కోటకు బీటలు పడినట్లయింది. ధరణితో ఒకరి భూములు ఒకరికి మారాయని కార్యాలయాల చుట్టూ తిరిగినా రెవెన్యూ అధికారులు సమస్యలు పరిష్కరించకపోవడం, మార్గం చూపించకపోవడం రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది. రెవెన్యూ, కలెక్టరేట్‌ కార్యాలయాల ఎదుట బాహాటంగానే నిరసనలకు దిగిన సంఘటనలు కోకొల్లలుగా జరిగాయి.

Advertisement
Advertisement