అమాత్య అవకాశం ఎవరికో..? | Sakshi
Sakshi News home page

అమాత్య అవకాశం ఎవరికో..?

Published Tue, Dec 5 2023 5:00 AM

- - Sakshi

● ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో తీవ్రపోటీ ● రేసులో పొన్నం ప్రభాకర్‌, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌లో మంత్రి పదవులు చర్చ మొదలైంది. సీఎం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కేబినెట్‌ ఏర్పాటు చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు పోటీపడుతున్నారు. వీరిలో ముఖ్యంగా గతంలో మంత్రిగా పనిచేసిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌లను కేబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. 13 స్థానాలు ఉన్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నాలుగు కొత్త జిల్లాలుగా ఆవిర్భావించిన నేపథ్యంలో జిల్లాకు ఒక మంత్రి చొప్పున ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు తెలిపారు. గతంలో కేటీఆర్‌(సిరిసిల్ల), కొప్పుల ఈశ్వర్‌(ధర్మపురి), గంగుల కమలాకర్‌(కరీంనగర్‌), ఈటల రాజేందర్‌ (హుజూరాబాద్‌) నలుగురు మంత్రులుగా కొనసాగారని గుర్తు చేస్తున్నారు.

పోటీలో కొత్తవారు సైతం...

సీనియర్‌ నాయకులతో పాటు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకులు కూడా మంత్రి మండలిలో చోటు లేదా పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరిలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు కీలక బాధ్యతలు చేపట్టాలని ఉత్సాహంగా ఉన్నారు. పాత జిల్లాలో ఐక్యమత్యంతో పోరాడి 13 అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిదింటిని కై వసం చేసుకున్న హస్తం నేతలు ఎన్నికల అనంతరం కూడా తాము ఇదే వైఖరితో ఐక్యంగా రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావులు కూడా కేబినెట్‌లో చోటు ఆశిస్తున్నారని తెలిసింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సీనియర్లకు మంత్రి పదవులు, తొలిసారిగా గెలిచిన వారికి సామర్థ్యాన్ని బట్టి సహాయ మంత్రి లేదా పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో జగిత్యాల అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈయన కూడా గతంలో అనేక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ఇప్పటికి శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతుండడంతో ఆయనను మంత్రి మండలిలోకి లేదా స్పీకర్‌ పదవికి ఎంపిక చేయవచ్చునని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.

జీవన్‌రెడ్డి
1/3

జీవన్‌రెడ్డి

దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
2/3

దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

పొన్నం ప్రభాకర్‌
3/3

పొన్నం ప్రభాకర్‌

Advertisement
Advertisement