పల్లె ప్రకృతి వనం.. కబ్జాకు యత్నం | Sakshi
Sakshi News home page

పల్లె ప్రకృతి వనం.. కబ్జాకు యత్నం

Published Thu, Dec 14 2023 12:48 AM

ఎలగందులలో పల్లె ప్రకృతి వనం చెట్లను తొలగించిన స్థలం - Sakshi

కొత్తపల్లి: ఎలగందుల గ్రామంలో ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో జోరుగా కొనసాగుతున్న ఆక్రమణలను అడ్డుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. కోట్లాది రూపాయల విలువ గల భూమి కళ్లెదుటే ఆక్రమణకు గురవుతుంటే చూడలేని ప్రజలు ఉన్నతాధికారులకు విన్నవించినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. ఎలగందులలో పల్లె ప్రకృతి వనంలోని చెట్లను ధ్వంసం చేసి భూఆక్రమణకు పాల్పడుతున్నా అధికారులు మిన్నకుండిపోవటం అనుమానాలకు తావిస్తోంది. దీనికితోడు ఎన్నికల సమయంలో అధికారులు బిజీగా ఉండటం అక్రమార్కులకు వరంగా మారింది. పలుమార్లు ప్రజావాణిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం స్థానికంగా ఆవేదనకు లోను చేస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పల్లె ప్రకృతి వనం ధ్వంసం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

చర్యలేవి..

ఎలగందులలో పల్లె ప్రకృతి వనం తొలగించి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనం చెట్లను సైతం అక్రమార్కులు వదలకపోగా.. పెరిగిన చెట్లను ధ్వంసం చేసి భూమి చదును చేపట్టి అక్రమ నిర్మాణాలకు సన్నద్ధమయ్యారు. ఎలగందుల గ్రామంలోని సర్వే నెంబర్‌ 28లో పల్లె ప్రకృతి వనం మొక్కల పెంపకానికి 20 గుంటల స్థలం కేటాయించారు. ఈ స్థలంలో సుమారు 1,800 మొక్కులు ఈజీఎస్‌ ద్వారా నాటి పంచాయతీకి బాధ్యతలు అప్పజెప్పారు. పంచాయతీ సిబ్బంది కళ్లుగప్పి పల్లె ప్రకృతి వనం చెట్లను ధ్వంసం చేసి, భూమిని చదును చేసి, అందులో బేస్మెంట్‌ నిర్మాణాలు చేపట్టగా.. వాటిని అధికారులు తొలగించారు. అయితే చెట్లు తొలగించిన వారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. స్థానిక నేతల ఒత్తిడితో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి చెట్లను ధ్వంసం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

చట్ట ప్రకారం చర్యలు

ఎలగందుల పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం చెట్లను ధ్వంసం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. చెట్లు తొలగించిన వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని పోలీసు కేసు నమోదు చేస్తాం. సార్వత్రిక ఎన్నికల్లో నిమగ్నమై ఉండటంతో దృష్టి సారించలేకపోయాం.

– ఎ.శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో, కొత్తపల్లి

చెట్ల తొలగింపు.. ఆపై భూమి చదును

అడ్డుకోవడంలో అధికారుల వైఫల్యం

ఎలగందులలో స్థానిక

నేతల ఇష్టారాజ్యం

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement