కూలీలందరికీ ‘ఉపాధి’ లక్ష్యం | Sakshi
Sakshi News home page

కూలీలందరికీ ‘ఉపాధి’ లక్ష్యం

Published Sun, Apr 7 2024 2:05 AM

చెరువులో కందకాలు తవ్వుతున్న కూలీలు - Sakshi

కరీంనగర్‌రూరల్‌: గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించి స్థానికంగా పనులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలు చేస్తోంది. ఉపాధిహామీ పథకంలో కూలీలందరికీ పనులు లభిస్తున్నాయి. ఎక్కువ కుటుంబాలకు వంద రోజుల పని కల్పించే లక్ష్యంతో అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

99శాతం పనుల కల్పన

కరీంనగర్‌ మండలంలోని 17గ్రామపంచాయతీల పరిధిలో మొత్తం 6వేల మంది ఉపాధి హామీ కూలీలున్నారు. వీరిలో 4,353 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 1.51లక్షల పని దినాలను కూలీలకు కల్పించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు మార్చి 31వరకు కూలీలకు మొత్తం 1,49,170 పనిదినాలు కల్పించి 99 శాతం లక్ష్యం చేరుకున్నారు. అత్యధికంగా మొగ్ధుంపూర్‌లో 15,816, గోపాల్‌పూర్‌లో 15,517, చేగుర్తిలో 14,647, బొమ్మకల్‌లో 14,105, చామనపల్లిలో 13,900, ఎలబోతారంలో 10,606, జూబ్లీనగర్‌లో 9,745 పనిదినాలను కల్పించారు. మొత్తం 409 కుటుంబాలు వంద రోజుల పనిని పూర్తి చేసుకున్నాయి. అత్యధికంగా చామనపల్లిలో 73, చేగుర్తిలో 64, జూబ్లీనగర్‌లో 48, ఎలబోతారంలో 36, గోపాల్‌పూర్‌లో 33, ఇరుకుల్లలో 31, దుర్శేడ్‌లో 27, నగునూరులో 23 కుటుంబాలున్నాయి.

ఈ ఏడాది లక్ష్యం చేరేనా?

2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.3.40కోట్ల విలువైన పనులను చేపట్టేందుకు అధికారులు గ్రామాల వారీగా ప్రణాళికలు రూపొందించారు. మొత్తం 130 పనుల ద్వారా కూలీలకు మొత్తం 1.25 లక్షల పనిదినాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ప్రధానంగా వ్యవసాయఅనుబంధ పనులు, నీటి నిల్వ, భూగర్భ జలాలు పెంపొందించే పనులకు ప్రాధాన్యతనిచ్చారు. నీటికుంటలు, పంటకాలువలు, కందకాల తవ్వకం, చెరువులు, కుంటలు, ఎస్సారెస్పీ కాలువల్లో పూడికతీత పనులున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులు ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. వేసవికాలంలో మండల వ్యాప్తంగా ప్రతిరోజూ 150మంది కూలీలకు పని కల్పించాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. రోజుకు సుమారుగా 1500 మంది కూలీలకు పనులు కల్పిస్తున్నారు.

2023–24 ఆర్థిక సంవత్సరంలో 99శాతం వినియోగం

409 కుటుంబాలకు వందరోజులు పని

లక్ష్యానికి అనుగుణంగా పనుల కల్పన

లక్ష్యానికి అనుగుణంగా కూలీలకు పనులు కల్పించడం జరుగుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1.51 లక్షల పనిదినాలు లక్ష్యం కాగా మార్చినెలాఖరు వరకు 1,49,170 రోజులు కూలీలకు కల్పించి 99శాతం లక్ష్యాన్ని చేరుకున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యం మేరకు కూలీలకు పని కల్పిస్తున్నాం.

– శోభారాణి, ఏపీవో, ఉపాధిహామీ పథకం

Advertisement
Advertisement