Sakshi News home page

అంధులపై ఎందుకీ బ్రహ్మాస్త్రం! అసలేం జరిగింది?

Published Tue, Apr 16 2024 12:25 AM

- - Sakshi

వేతనాల చలాన్లలో రూ.10 లక్షల వరకు గోల్‌మాల్‌

అంధ క్లర్కు దంపతులపై హెడ్మాస్టర్‌ ఫిర్యాదు

ప్రాథమిక విచారణ లేకుండా ఫిర్యాదు ఆధారంగా కేసు

వేతనాలు ప్రిపేర్‌ చేసిన వ్యక్తిని మినహాయించడంపై విస్మయం

చూపులేకుండా అక్రమాలు ఎలా చేస్తామంటున్న దంపతులు

టీచర్లు విదేశాలకు వెళ్లినా.. హెడ్మాస్టర్‌ జీతమెలా ఇచ్చాడని ప్రశ్న

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: తిరుమల–రాజ్‌కుమార్‌ దంపతులు అంధులు. కరీంనగర్‌ జిల్లా ఎల్‌ఎండీ కాలనీలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో తిరుమల క్లర్కు. ఆమెకు జూనియర్‌ అసిస్టెంట్‌ విధులు కేటాయించారు. సాయం కోసం (స్క్రైబ్‌) తన భర్త రాజ్‌కుమార్‌ను తోడుగా తెచ్చుకునేది. వీరిద్దరికీ 80శాతం చూపులేదు. కనీసం నాలుగు అంగుళాల దగ్గరగా ఉంటే తప్ప చూడలేరు. వ్యక్తులను కేవలం గొంతు ఆధారంగా గుర్తు పడతారు.

కానీ, దాదాపు రూ.10 లక్షల వరకు టీచ ర్ల సొమ్ము ప్రభుత్వానికి జమ చేయకుండా జేబులో వేసుకున్నారని హెడ్‌మాస్టర్‌ ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదయ్యా యి. దీంతో, టీచర్ల లోకం భగ్గుమంది. పోలీసుల తీరుపై మండి పడుతోంది. చూపులేని వారు తమ వేతనాలు ఎలా కాజేస్తారు? ఆ విషయాన్ని పోలీసులు ఎలా నమ్మారు? అసలు ప్రాథమిక విచారణ జరిగిందా? అని ప్రశ్నిస్తున్నారు. తమను స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ రాజభాను చంద్రప్రకాశ్‌ ఈ కేసులో ఇరికించారని, ఎదుటి వ్యక్తిని చూడలేని తాము రూ.లక్షలు ఎలా తీసుకుంటామని ఆ అంధ దంపతులు అంటున్నారు.

అసలేం జరిగింది?
ఈ వ్యవహారంలో అంధ దంపతులు ‘సాక్షి’ని ఆశ్రయించి జరిగింది మొత్తం వివరించారు. వారెమన్నారంటే.. ‘ఎల్‌ఎండీ కాలనీ జెడ్పీ హైస్కూల్లో రాజ భాను చంద్రప్రకాశ్‌ హెడ్‌మాస్టర్‌. ప్రతినెలా పాఠశాలలో పనిచేసే టీచర్ల జీతాలు ఇతనే ప్రిపేర్‌ చేసి, పంపిస్తారు. ఇక్కడి ఉపాధ్యాయుల్లో చాలామంది వివిధ వ్యక్తిగత కారణాలతో సెలవు (మెడికల్‌/చైల్డ్‌ కేర్‌ తదితర లీవు)లు పెడుతుంటారు. కానీ, హెచ్‌ఎం వారు సెలవులో ఉన్నట్లు కాకుండా పని చేసినట్లు రికార్డులో నమోదు చేస్తారు.

ఆయా పని దినాలకు వేతనం లెక్కగట్టి, ఉన్నతాధికారులకు పంపుతారు. వేతనం టీచర్ల ఖాతాలో క్రెడిట్‌ కాగానే వారి కి ఫోన్‌ చేసి, పొరపాటున సెలవు దినాలకు జీతం యాడ్‌ అయిందని, దాన్ని వెనక్కి పంపితే చలానా రూపంలో తిరిగి ప్రభుత్వానికి పంపుతానని నమ్మబలుకుతారు. ఇలా 2021 నుంచి 2024 వరకు దాదాపు రూ.10 లక్షల వరకు వేతనాలను క్రెడిట్‌ చేయడం, అనంతరం వారి నుంచి తీసుకోవడం, వాటిని తన జేబులో వేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు.

ఎవరైనా అడిగితే నకిలీ చలానాలు చూపేవారు. ఐటీ రిటర్నుల విషయంలోనూ ఇలాగే చేసి, డబ్బులు వసూలు చేసేవారు’ అని అంధ దంపతులు బోరుమన్నారు. ప్రతీసారి టీచర్ల డబ్బును తెలి విగా తమకు ఫోన్‌ పే/గూగుల్‌ పే చేయించేవారని, వాటిని తాము డ్రా చేసి నగదు రూపంలో హెడ్‌మాస్టర్‌కు అందజేసేవారమని చెప్పారు. ఇటీవల కొందరు టీచర్లకు అనుమానం వచ్చి, నిలదీసేసరికి విషయాన్ని తమపైకి నెట్టాడని వాపోయారు.

రూ.7 లక్షలు అడిగితే ఇచ్చాం..
ఈ నెల మొదటివారంలో తమ వద్దకు వచ్చిన హెడ్‌మాస్టర్‌ తమను బెదిరించి, బలవంతంగా తామే ఈ నేరానికి పాల్పడినట్లు లెటర్‌ తీసుకున్నారని తిరుమల–రాజ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం పోకుండా ఉండాలంటే రూ.7 లక్షలు కట్టాలని బెదిరిస్తే.. అప్పు చేసి ఇచ్చామన్నారు. ఆ తర్వాత జరిగిన వ్యవహారంలో ఎక్కడా ఆయన పాత్ర లేకుండా చూపేందుకు ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసి, సమాజంలో తమను దోషులను చేశాడని వాపోయారు. తమకు ఇద్దరు పిల్లలని, ఇప్పుడు ఈ కేసులో జైలుకు పంపి, తమ కుటుంబాన్ని నాశనం చేసే కుట్రకు తెరతీశారని కన్నీరు పెట్టుకున్నారు.

అమెరికా వెళ్లినా జీతం క్లెయిమ్‌..
తిమ్మాపూర్‌లో ఓ టీచర్‌ 2022 సెప్టెంబర్‌లో అమెరికా వెళ్లారని, ఇందుకోసం 6 నెలలపాటు ముందస్తుగా డీఈవో వద్ద అనుమతి పొందారని తెలిపారు. నవంబర్‌ జీతం డిసెంబర్‌లో ఆమెకు బ్యాంకు ఖాతాలో పడిందన్నారు. వెంటనే హెడ్‌మాస్టర్‌ సదరు టీచర్‌ను సంప్రదించి, మొత్తం వేతనం వెనక్కి తెప్పించారని, ఈ వ్యవహారంలో సదరు టీచర్‌ హెచ్‌ఎం తీరుపై మండిపడి, నిలదీశారని తెలిపారు. కాగా ఈ విషయమై పాఠశాల హెచ్‌ఎంను సంప్రదించగా.. అందుబాటులోకి రాలేదు.

విదేశాలకు వెళ్లిన టీచర్‌కు డీఈవో అనుమతి

కనికరం లేని పోలీసులు..
పోలీసులు కేసు నమోదు చేసే క్రమంలో కనీసం తమను సంప్రదించలేదని, అసలు 80 శాతం చూపులేని తమకు హెడ్‌మాస్టర్‌ ముఖమే తెలి యదని, సంతకాలు ఎలా ఫోర్జరీ చేస్తామని ఆ అంధ దంపతులు అన్నారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండా తమపై కేసు నమో దు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేసు విషయంలో నిజానిజాలు తెలుసుకునేందుకు తిమ్మాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే తమను పట్టించుకోలేదని వాపోయారు.

కంటిచూపులేని వారమన్న కనికరమైనా చూపకుండా హెచ్‌ఎంపై ఫిర్యాదు తీసుకోకపోవడం దారుణమన్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులను, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. హెచ్‌ఎం రాజభాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ప్రతీచోట తాము అంధులమని పేర్కొన్న విషయాన్ని గమనించాలని కోరారు.

ఇవి చదవండి: ఏఆర్‌ డీఎస్పీ ఇంటి ఎదుట భార్య ఆందోళన

Advertisement
Advertisement