ట్రాఫిక్‌ కూడళ్లకు ఏఐ హంగు | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ కూడళ్లకు ఏఐ హంగు

Published Wed, Mar 22 2023 2:04 AM

- - Sakshi

సాక్షి, బెంగళూరు: బెంగళూరు మహానగరంలో ట్రాఫిక్‌ రద్దీ ఎంత చిక్కుముడిగా ఉంటుందో తెలియనిది కాదు. కిలోమీటరు ప్రయాణానికి కూడా గంటలు పడుతుంది. త్వరలో ఆధునిక కంప్యూటర్‌ ఆధారిత ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. అనుకున్న ప్రకారం జరిగితే 2025 ప్రారంభంలోనే ఐటీ సిటీలో చాలావరకు ట్రాఫిక్‌ సిగ్నళ్లు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పరిజ్ఞానంతో పని చేయనున్నాయి. తద్వారా నగరంలో ట్రాఫిక్‌ ఒత్తిడిని కొంతయినా తగ్గుతుందని ప్రభుత్వం ఆలోచన.

మొదట 165 కూడళ్లలో

బెంగళూరులో ట్రాఫిక్‌ సిగ్నళ్లు పాత సాంకేతికతతో పనిచేస్తున్నాయి. నిర్ణీత సమయం ఎర్ర, గ్రీన్‌, ఆరెంజ్‌ లైట్లు వెలుగుతూ ఉండే ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థ ఉంది. అలాగే పోలీసులు కూడళ్లలో నిలబడి వాహనాలను నియంత్రిస్తారు. ఇక కొత్తగా ఏఐతో అనుసంధానించిన ట్రాఫిక్‌ వ్యవస్థ రానుంది. కర్ణాటక రోడ్డు అభివృద్ధి సహకార సంస్థ ఈ కొత్త టెక్నాలజీతో బెంగళూరులోని 17 కారిడార్లలో 165 ప్రముఖ ట్రాఫిక్‌ సిగ్నళ్లను అనుసంధానించాలని చూస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం టెండర్లను కూడా ఆహ్వానించింది.

ఎలా పనిచేస్తాయి

ఈ ఏఐ అనుసంధానిత ట్రాఫిక్‌ సిగ్నళ్ల ద్వారా వాహన రద్దీ ఏ వైపు ఎక్కువగా ఉందో గమనించి అందుకు తగ్గట్లు సొంతంగా సిగ్నళ్లు పడడం, ఆగిపోవడం చేస్తాయి. ఆ వ్యవస్థే సిగ్నల్‌ సమయాలను పెంచడం, తగ్గించడం చేస్తుంది. ఇందుకుగాను ఆధునిక డిజిటల్‌ సాఫ్ట్‌వేర్‌, కెమెరాలు, ఇతరత్రా వ్యవస్థలను అమర్చాల్సి ఉంటుంది. కూడళ్లలో అనవసర రద్దీ ఏర్పడకుండా రాకపోకలు సాగించే అవకాశం లభిస్తుంది. తద్వారా ట్రాఫిక్‌ సమయం తగ్గడమే కాకుండా వాహనాల ఇంధనఖర్చు కూడా ఆదా అవుతుంది. పాదచారులు సులభంగా రోడ్డు దాటేందుకు కూడా ఈ ఏఐ సిగ్నళ్లు ఉపయోగపడతాయి.

సిలికాన్‌ నగరంలో ట్రాఫిక్‌ పద్మవ్యూహం

ఏఐ ట్రాఫిక్‌ వ్యవస్థలో ఆటోమేటిక్‌గా సిగ్నల్స్‌ పనిచేస్తాయి

ఆటోమేటిక్‌గా సిగ్నళ్లు, సజావుగా సంచారం

బెంగళూరులో ఏర్పాటుకు ప్రయత్నాలు

1/1

Advertisement
Advertisement