Karnataka Assembly Election: ముక్కోణపు పోరులో విజేత ఎవరో ? | Sakshi
Sakshi News home page

Karnataka Assembly Election: ముక్కోణపు పోరులో విజేత ఎవరో ?

Published Wed, May 3 2023 1:38 AM

- - Sakshi

సాక్షి, బెంగళూరు: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన మొదటి ఎన్నికలోనే కాంగ్రెస్‌ పార్టీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన స్వాతంత్య్ర సమర యోధుడు పట్టాభిసీతారామన్‌, దున్నే వాడిదే భూమి నినాదంతో పోరాటానికి ప్రాతినిధ్యం వహించిన పి వెంకటగిరియప్ప ప్రాతినిధ్యం వహించిన కోలారు నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో గుర్తింపు పొందింది. కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలకు గట్టి పునాదులు కలిగిన నియోజకవర్గం. ఇంతవరకు జరిగిన 15 శాసనసభ ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్‌, జేడీఎస్‌, స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే. నియోజకవర్గంలో ఇంతవరకు కమలం వికసించలేదు.

ప్రస్తుత ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు. జేడీఎస్‌ నుంచి సిఎంఆర్‌ శ్రీనాథ్‌, కాంగ్రెస్‌ నుంచి కొత్తూరు మంజునాథ్‌, బీజేపీ నుంచి వర్తూరు ప్రకాష్‌ పోటీ చేస్తున్నారు. వర్తూరు ప్రకాష్‌ గత మూడు ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండుసార్లు గెలిచారు. కాంగ్రెస్‌లో చేరడానికి విఫల యత్నం చేసిన వర్తూరు ప్రకాష్‌ చివరికి బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగారు. మాజీ సీఎం సిద్దరామయ్య కోలారు నుంచి పోటీ చేయకపోవడంతో ఆ స్థానంలో కాంగ్రెస్‌ టికెట్‌ను పార్టీ కొత్తూరు మంజునాథ్‌కు ఇచ్చింది.

గెలుపోటములపై గంపెడాశాలు
ఎన్నికల్లో కాంగ్రెస్‌, జేడీఎస్‌, బీజేపీ మధ్యనే పోటీ ఉంది. తమదే విజయని ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. జేడీఎస్‌ ఒక్కలిగ సముదాయాన్ని, పార్టీ ఓట్లను నమ్ముకుంటే బీజేపీ కురుబ సముదాయంతోపాటు సాంప్రదాయ ఓట్లను నమ్ముకుంది. జాతి ఓట్ల కొరతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ అభ్యర్థి ఎక్కువగా దళిత, మైనారిటీ ఓట్లపై ఆధారపడి ఉన్నారు.

నియోజకవర్గంలో దళిత, మైనారిటీ ఓట్లే కీలకం కాగా దళితుల ఓట్లు కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్‌, కాంగ్రెస్‌లు పంచుకునే అవకాశం ఉంది. ఇక జయాపజయాలను మైనారిటీ ఓట్లే నిర్ణయించనున్నాయి. మొత్తం ఓటర్లు 2,40,000 మంది కాగా పురుషులు 1.19000 మంది, మహిళలు 1.21,000 మంది ఉన్నారు. కులాల వారీగా ఎస్సీలు 70వేలు, మైనారిటీలు 60వేలు, ఒక్కలిగులు 35వేలు, కురుబలు 25వేలు, బ్రాహ్మణ, వైశ్య, లింగాయత ఓటర్లు 15వేల మంది ఉన్నారు.

స్టార్‌ ప్రచారకుల అబ్బరం
కోలారు నియోజకవర్గం నుంచే కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. జేడీఎస్‌ తన పంచరత్న రథయాత్రను కోలారు జిల్లా నుంచే ప్రారంభించింది. బీజేపీ తరపున దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రచారం చేసి వెళ్లారు.

1/3

2/3

3/3

Advertisement

తప్పక చదవండి

Advertisement