కాంగ్రెస్‌ గ్యారంటీలే దెబ్బ తీశాయి | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గ్యారంటీలే దెబ్బ తీశాయి

Published Fri, Jun 2 2023 12:12 AM

- - Sakshi

సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పనులు చేపట్టిందని, డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో చేసిన అభివృద్ధి పనులను జనం మరిచి కాంగ్రెస్‌ గ్యారంటీ కార్డులను చూసి ఆ పార్టీని గెలిపించారని నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలోని అటల్‌ బిహారి వాజ్‌పేయి లేఔట్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కరోనా సమయంలో రెండేళ్లు ప్రతి ఒక్కరికి కేంద్రం నుంచి 10 కేజీలు చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేశామని గుర్తు చేశారు. అయినా అదంతా జనం మరిచిపోయి కాంగ్రెస్‌ అసత్యపు హామీలకు లోనై వారికే ఓటు వేశారన్నారు. నగరంలో తాను ఓటమి చెందడానికి, కాంగ్రెస్‌ గ్యారంటీ కార్డులతో పాటు కేఆర్‌పీపీ ప్రభావం వల్ల కూడా తాను ఓటమి చెందానన్నారు. కేఆర్‌పీపీ బరిలో ఉంటుందని తెలిసినా కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును చీలుస్తుందని భావించామన్నారు. అయితే వారికి పడిన ఓట్లన్నీ బీజేపీవేనన్నారు. దీంతో తాను ఓటమి చెందాల్సి వచ్చిందన్నారు.

గాలి జనార్దనరెడ్డిపై విమర్శలు

తన సోదరుడు, కేఆర్‌పీపీ అధినేత గాలి జనార్దనరెడ్డిపై సోమశేఖరరెడ్డి విమర్శలు గుర్పించారు. ఎవరి వల్ల ఎవరు రాజకీయంగా ఎదిగారో ప్రజలకు, ఆ భగవంతుడికి తెలుసన్నారు. తమను అడ్డం పెట్టుకుని చేసిన అక్రమాలు కూడా ఆయన బయటకు చెప్పాలన్నారు. గతంలో కేజేపీ, బీఎస్‌ఆర్‌ల మాదిరిగా మళ్లీ కేఆర్‌పీపీ బీజేపీలోకి వస్తే కలిసి పని చేస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా, అదంతా తన పరిధిలో లేనిదని, ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే ఎలా చెప్పగలం అన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలను త్వరలో అమలు చేయకపోతే బీజేపీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందన్నారు. ఓటమిపై ఆత్మావలోకనం చేసుకుంటున్నామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేస్తామన్నారు. మళ్లీ దేశానికి మోదీని ప్రధానిని చేయాలన్నది అందరి ఆకాంక్షగా ఉందన్నారు. జనం కూడా బీజేపీకి బ్రహ్మరథం పట్టడం ఖాయమన్నారు. ఎంపీ దేవేంద్రప్ప మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల సమర్థ పాలన గురించి వివరించారు. ఎమ్మెల్సీ వై.ఎం.సతీష్‌, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప, పార్టీ నాయకులు డాక్టర్‌ బీ.కే.సుందర్‌, అనిల్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

కేఆర్‌పీపీ వల్లనే నేను ఓడిపోయాను

మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి

Advertisement
Advertisement