Sakshi News home page

నాడు వైభవం.. నేడు అధ్వానం

Published Sat, Jun 3 2023 12:22 AM

మరమ్మతుకు నోచుకోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం - Sakshi

గంగావతి రూరల్‌: రెక్కాడితే కానీ డొక్కాడని పేద కూలీ కార్మికులు, రిక్షా, ఆటోవాలాలు, హమాలీ, బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే పాఠశాలలపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎంత నిర్లక్ష్యమో పట్టణంలోని బస్టాండ్‌ సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల దుస్థితిని చూస్తే అర్థం అవుతుంది. ప్రభుత్వాలు పాఠశాలల అభివృద్ధి పనులకు వేల కోట్లు వెచ్చిస్తున్నా అవినీతి రాజకీయ నాయకులు, లంచగొండి అధికారుల వల్ల పాఠశాలలు అభివృద్ధికి నోచుకోలేక పోతున్నాయి. ఈ హైస్కూల్‌కు 2017–18వ సంవత్సరంలో గదుల మరమ్మతు కోసం రూ.31 లక్షల నిధులు మంజూరయ్యాయి. వచ్చిన గ్రాంట్‌తో నాసిరకపు పనులను చేపట్టి ప్రజాప్రతినిధుల పర్సంటేజీ, అధికారుల ముడుపుల పేరుతో పనులను గాలికి వదిలి తమ జేబులు నింపుకోవడంతో ఐదేళ్లు గడిచినా కూడా ఈ పాఠశాలకు ఇంకా మోక్షం కలగలేదు.

భూత్‌ బంగ్లాగా మారిన విద్యాలయం

ప్రస్తుతం ఈ పాఠశాలలో 326 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 18 గదులు కలిగి పట్టణ నడిబొడ్డున వెలసినా కానీ నాసిరకపు పనులతో ఏ గదికి కూడా తలుపులు, కిటికీలు లేవు. క్లాస్‌ రూమ్‌లో గుంతలతో పాటు కరెంటు వ్యవస్థ సరిగా లేక బూత్‌ బంగ్లాలా మారింది. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గద్దెప్ప తరచు ప్రజా ప్రతినిధులకు, సంబంధిత అధికారులకు లేఖలు, మనవి పత్రాలు రాసినా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. పైగా స్థానిక ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్‌ నుంచి ప్రధానోపాధ్యాయుడికి నాసిరకపు పనులతో నిర్మాణమైన గదులను మీరు హస్తగతం చేసుకోవాలని ఒత్తిడి వచ్చినా అందుకు ప్రధానోపాధ్యాయుడు ససేమిరా అనడంతో పాఠశాల అభివృద్ధి అర్థంతరంగానే మిగిలింది. ఈనేపథ్యంలో నూతన ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌ రెడ్డి ఈ పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి వీలుగా పాఠశాల గదులు, మరుగుదొడ్ల మరమ్మతులకు నిధులను కేటాయించాలని నగరవాసులతో పాటు పేద విద్యార్థులు మొరపెడుతున్నారు.

శిథిలావస్థలో నిజాం కాలంలో నిర్మించిన పాఠశాల భవనం

రూ.31 లక్షల గ్రాంట్‌ వచ్చినా నాసిరకం పనులతో అభివృద్ధికి గ్రహణం

Advertisement

What’s your opinion

Advertisement