ఉచిత ప్రయాణం... ప్రభుత్వం మా పొట్ట కొడుతోంది... | Sakshi
Sakshi News home page

ఉచిత ప్రయాణం... ప్రభుత్వం మా పొట్ట కొడుతోంది...

Published Tue, Jun 20 2023 7:20 AM

ప్రయాణికులు లేక వెలవెలబోతున్న ప్రైవేట్‌ బస్సులు  - Sakshi

గౌరిబిదనూరు: ప్రభుత్వం తీసుకువచ్చిన శక్తి యోజన పథకం తమను పూర్తిగా రోడ్డున పడేలా చేసిందని పలువురు ప్రైవేట్‌ బస్సు యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ బస్సుల వైపే మొగ్గు : గతంలో గ్రామీణ ప్రదేశాలలో నగరానికి ప్రైవేట్‌ బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణం చేసేవారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని ప్రకటించడంతో ఎంత సేపైనా ఆ బస్సుల కోసం మహిళలు వేచి ఉంటున్నారు. సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి వస్తుందని బస్సుల నిర్వాహకులు చెబుతున్నారు.

అమ్ముదామన్నా కొనేవారే లేరు : బస్సులను అమ్మేస్తామన్నా కొనేవారు లేరు. రెండేళ్ల క్రితం కరోనా పూర్తిగా దెబ్బతీసింది. ఇప్పుడు ఊహించని పరిణామం ఎదురైంది. కుటుంబాలను ఎలా పోషించుకోవాలి, సిబ్బందికి జీతాలు ఎలా చెల్లించాలని అని బస్సుల యజమానులు నిరాశలో ఉన్నారు. మూడు నెలలకు రూ.7,952 రోడ్డు ట్యాక్స్‌ కట్టాలి, ఏడాదికి రూ. 72,202 బీమా ప్రీమియం, ఎఫ్‌సిలు చేయించాలి, వ్యాపారాలే లేకున్నప్పుడు ఇంత మొత్తం ఎలా చెల్లించాలి అంటూ బస్సుల ఆపరేటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధిపై వేటు : కేవలం యజమానులే కాదు బస్టాండ్లలో టికెట్లు ఇచ్చే లోడర్లు, డ్రైవర్‌, కండక్టర్‌లు, వారి కుటుంబాలు వీధిన పడాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్దల కాలం నుంచి బస్సులపైనే జీవితాలు నడుస్తున్నాయి. ప్రభుత్వం తాజా నిర్ణయం ట్రావెల్‌ నిర్వాహకులకు అశనిపాతంలా మారింది.

కష్టంగా మారింది
మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాలు కల్పించడంతో ప్రైవేట్‌ బస్సులు ముఖం చూసే వారే కనిపించలేదు, దీంతో ఎలా నెట్టుకు రావాలో అర్థం కావడం లేదు. జీతాలు చెల్లించలేని పరిస్థితి వస్తోంది.

– ప్రదీప్‌, బస్సు యజమాని

ఎలా బతకాలి
నాలుగైదు బస్టాండ్లలో టికెట్లు విక్రయించి రోజుకు రూ. 200 నుంచి 300 సంపాదించే వారం, ప్రభుత్వం ఇప్పుడు మా పొట్ట కట్టింది. ప్రయాణికులే లేకుంటే మాకు కమీషన్‌ ఎలా వస్తుంది, కుటుంబాలను ఎలా పోషించాలి. గౌరిబిదనూరు బస్టాండులో 15 మందికిపైగా ఏజెంట్లు ఉన్నారు. – నాగేశ్‌, బస్‌ ఏజెంట్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement