సీబీఐ దర్యాప్తు అవసరం లేదు: హోంమంత్రి | Sakshi
Sakshi News home page

సీబీఐ దర్యాప్తు అవసరం లేదు: హోంమంత్రి

Published Tue, Jul 11 2023 7:06 AM

- - Sakshi

కర్ణాటక: బెళగావి జిల్లా చిక్కోడి వద్ద ఉన్న నంది ఆశ్రమం జైనముని కామకుమార నంది హత్యపై సోమవారం విధానసౌధలో ఉభయ సభల్లో తీవ్ర చర్చ జరిగింది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. విధానసభ మొదలు కాగానే బీజేపీ నేత బసవరాజ బొమ్మై వాయిదా తీర్మానం కింద జైనముని హత్యపై చర్చించాలని స్పీకర్‌ యూ.టీ.ఖాదర్‌కు విన్నవించారు. చివరకు జీరో అవర్‌లో చర్చ ఆరంభమైంది. బీజేపీ సభ్యులు అభయ్‌ పాటిల్‌, బసవనగౌడ పాటిల్‌ యత్నాళ్‌, శశికళా జొల్లె తదితరులు మాట్లాడుతూ జైనముని హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

చరిత్రలోనే మునుపెన్నడూ జరగని సంఘటన ఇదని అన్నారు. జైన సముదాయానికి భంగం వాటిల్లింది, పోలీసులు సక్రమంగా విచారణ జరపలేరు, సీబీఐకి అప్పగించాలని పట్టుబట్టారు. హత్యలో తొలి నిందితుడైన నారాయణ మాళియను అరెస్ట్‌ చేసి, రెండో నిందితుడు హసేన్‌ను తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు.

కాంగ్రెస్‌ సభ్యుడు లక్ష్మణ సవది ఈ హత్య కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి హంతకులకు మరణశిక్ష విధించాలన్నారు. డబ్బు కోసమే హత్య జరిగిందనేది అవాస్తవమని వీరందరూ అన్నారు. జైనముని హత్య జరిగి మూడు రోజులు గడిచినా కూడా ముఖ్యమంత్రి సంతాపం తెలపలేదు, వేరే మతాలవారైతే చూస్తూ మౌనంగా ఉండేవారా? హిందువులకు భద్రత లేదా అని యత్నాళ్‌ ఘాటుగా ప్రశ్నించారు.

నిందితులను దాచిపెడుతున్నారు
సభాపతి యూటీ ఖాదర్‌ జోక్యం చేసుకుంటూ, జైనముని హత్య భయంకరమైనది. నిందితులకు కఠిన శిక్ష విధించాలి. ఇందులో రాజకీయం చేయరాదని సలహానిచ్చారు. బీజేపీ సభ్యుడు సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ, ఈ భయంకరమైన హత్యతో రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ కేసులో మిగతా నిందితుల పేర్లను ఎందుకు బహిరంగపరచటం లేదు. ఎందుకు నిందితులను కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఇదే మాదిరిగా విధాన పరిషత్‌లో కూడా జైనముని హత్య కేసుపై గందరగోళం నెలకొంది. మంత్రులు హెచ్‌కే పాటిల్‌, ప్రియాంక్‌ ఖర్గేలు మాట్లాడుతూ రాష్ట్ర పోలీసులే ఈ కేసును దర్యాప్తు చేస్తారని తెలిపారు. మరోవైపు హత్యను ఖండిస్తూ చిక్కోడిలో జైనసంఘాల వారు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

సీబీఐ దర్యాప్తు అవసరం లేదు: హోంమంత్రి 
హుబ్లీ: బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా హిరేకోడి ఆశ్రమం జైనముని కామకుమార నంది మహారాజ హత్యోదంతంపై రాజకీయ చేయరాదని, పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని హోంమంత్రి జీ.పరమేశ్వర్‌ అన్నారు. సోమవారం ఆయన నగర విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఎవరూ కూడా పక్షపాతం చూపరని అన్నారు. జైనముని అదృశ్యంపై ఫిర్యాదు నమోదైన తక్షణమే పోలీసులు అన్వేషించారన్నారు.

బావిలో వేసిన మృతదేహాన్ని కనుగొని చర్యలు తీసుకున్నారన్నారు, పోలీసులు బాగా పనిచేశారని అభినందిస్తున్నానన్నారు. హత్యపై నిరసనకు దిగిన జైనమునితో తాను కూడా మాట్లాడానని, వారి డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చానన్నారు. హత్య కేసును సీబీఐకు అప్పగించాలన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభించామని, ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement