దిగొస్తున్న టమాట ధరలు | Sakshi
Sakshi News home page

దిగొస్తున్న టమాట ధరలు

Published Sat, Aug 12 2023 1:24 AM

- - Sakshi

కోలారు: గత కొద్ది రోజులుగా రెక్కలు కట్టుకుని ఆకాశంలో తిరుగుతున్న టమాట ధరలు దిగి వస్తున్నాయి. శుక్రవారం కోలారు ఏపీఎంసీ మార్కెట్‌ యార్డులో 15 కిలోల బాక్సు టమాట ధర కేవలం రూ.800 పలికింది. దీంతో మొదటి సారిగా 15 కిలోల బాక్సు ధర రూ.1000 లోపునకు దిగి వచ్చినట్లయింది.

బుధవారం రూ.1100 ఉన్న బాక్సు టమాట ధరలు ఒకే రోజులో రూ.300 తగ్గడంతో రైతులు అసంతృప్తికి గురవుతుండగా వినియోగదారులకు మాత్రం కాస్త ఊరట లభిస్తోంది. పెరిగిన ధరలతో టమాటలను కొనలేక నానా ఇబ్బండులు పడిన వినియోగదారులకు ఇక మార్కెట్‌లో టమాటలు కొనడానికి ముందుకు వచ్చే అవకాశం కలిగింది. ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉందని రైతులు, మార్కెట్‌ నిపుణులు, వ్యాపారులు అంటున్నారు.

రూ.2700 పలికిన ధర
జూలై 31న కోలారు మార్కెట్‌ యార్డులో టమాట బాక్సు గరిష్ట ధర రూ.ఽ2700 పలికి రికార్డు సృష్టించింది. ధరలు తగ్గడానికి మార్కెట్‌కు అధికంగా టమాట దిగుబడి అవుతుండడమే కారణమని అంటున్నారు. గత బుధవారం కోలారు మార్కెట్‌కు 86,091 క్వింటాళ్ల టమాట అంటే 12,913 బాక్సుల టమాట వచ్చింది. జూలై 31న మార్కెట్‌కు 52,820 క్వింటాళ్ల టమాట వచ్చింది.

అంటే గత 10 రోజుల అవధిలో మార్కెట్‌కు దాదాపు 33 వేల క్వింటాళ్ల టమాట దిగుబడి పెరిగిందని, అందువల్లే టమాట ధరలు తగ్గుముఖం పడుతున్నాయని మార్కెట్‌ అధికారులు అంటున్నారు. టమాట ధరలు పెరిగిన తరువాత జిల్లాలో దాదాపు ఇటీవల 6 వేల హెక్టార్లలో రైతులు టమాట నాటినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement