టిప్పర్‌, బైక్‌ ఢీ.. వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

టిప్పర్‌, బైక్‌ ఢీ.. వ్యక్తి మృతి

Published Thu, Nov 9 2023 1:06 AM

మరణించిన రిటైర్డ్‌ టీచర్‌ గాదెప్ప  - Sakshi

సాక్షి,బళ్లారి: టిప్పర్‌ బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది. బుధవారం ఆ జిల్లా అథణి సమీపంలో బైక్‌ను టిప్పర్‌ ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్‌ కార్యాలయంలో పని చేసే దశరథ రాము పవార్‌(50) మృతి చెందినట్లు అక్కడి పోలీసులు తెలిపారు.

బైక్‌ నుంచి కిందపడి వ్యక్తి మృతి

గంగావతి: కొప్పళ తాలూకాలో బైక్‌ అదుపు తప్పి ఓ రిటైర్డ్‌ టీచర్‌ కింద పడిపోయి గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. రిటైర్డ్‌ టీచర్‌ గాదెప్ప(65) ఇందరిగి తాండా వద్ద బైక్‌పై వెళుతుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మునిరాబాద్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

పిడుగుపాటుకు 36 గొర్రెల మృతి

కంప్లి: హరపనహళ్లి తాలూకాలోని గుడిగుడాళ గ్రామ పరిసరాల్లోని పొలంలో మంగళవారం ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండగా పిడుగుపాటుకు గురై 36 గొర్రెలు మృతి చెందాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, పశు వైద్యాధికారి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

చిరుత దాడిలో ఆవుదూడ బలి

రాయచూరు రూరల్‌: రెండు రోజులుగా చిరుత ప్రత్యక్షం కావడంతో గ్రామీణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం రాత్రి మాన్వి తాలూకా కల్లూరులో చిరుత సంచరించి ఓ ఆవుదూడపై దాడి చేసి చంపేసిందని గ్రామస్తులు తెలిపారు. కాగా చిరుత పట్టివేతకు బోనులను ఏర్పాటు చేసి తమను చిరుత బెడద నుంచి రక్షించాలని అటవీ శాఖాధికారులను ప్రజలు కోరారు.

టెన్త్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలి

బళ్లారిటౌన్‌: ఈఏడాది 10వ తరగతి పరీక్షలను విద్యార్థులు ధైర్యంగా ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించాలని జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, విద్యా శాఖల ఆధ్వర్యంలో 2023–24వ సంవత్సరంలో 10వ తరగతిలో మంచి ఫలితాల సాధనకు చేపట్టిన ముందస్తు సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది కన్నా ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఆయా బీఈఓలు కృషి చేయాలన్నారు. గత ఏడాది కన్నా మరింత మెరుగైన ఫలితాలను సాధించాలన్నారు. సమావేశంలో విద్యాశాఖ డీడీపీఐ ఏ.హనుమక్క, బీఈఓలు శేఖర్‌, నయీముర్‌ రహిమాన్‌, సిద్దలింగమూర్తి, హెచ్‌.గుర్రప్ప, ఎం.బసవరాజు తదితరులు పాల్గొన్నారు.

ఐజీకి పోలీసుల గౌరవ వందనం

హొసపేటె: డాక్టర్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ జిల్లా స్టేడియంలో విజయనగర జిల్లా ఎస్పీ బీఎల్‌ శ్రీహరిబాబు నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(పబ్లిక్‌ గ్రీవెన్స్‌ అండ్‌ హ్యూమన్‌ రైట్స్‌) దేవజ్యోతిరాయ్‌కు బుధవారం గౌరవ వందనం సమర్పించారు. దేవజ్యోతి రాయ్‌ మాట్లాడుతూ విజయనగర నూతన జిల్లాలో పోలీసు శాఖకు ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరమో తనిఖీ చేస్తానన్నారు. మహిళా పోలీస్‌ స్టేషన్‌, సీఈఎన్‌ పోలీస్‌ స్టేషన్‌తో సహా మిగతా సౌకర్యాలను అందిస్తామన్నారు. పోలీసు, మహిళా సిబ్బంది, క్రైం ఎస్‌ఐల కొరతను కూడా తీరుస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ మంజునాథ్‌ తళ్వార్‌, పీఐలు ఉమేష్‌ కాంబ్లే, శ్రీనివాస్‌ మేటి, బాలనగౌడ, దీపక్‌ బూసరెడ్డి, కే.శివరాజ్‌, విశ్వనాథ్‌ హిరేగౌడర్‌, సుధీర్‌ బెంకి, సురేష్‌ తళ్వార్‌, సామ్రాట్‌, ఆర్పీఐ శశికుమార్‌, పీఎస్‌ఐలు శోభ, ఎస్పీ నాయక్‌, ఎరియప్ప పాల్గొన్నారు.

నాటు వైద్యానికి తగ్గని ప్రాధాన్యం

రాయచూరు రూరల్‌: నేటి యుగంలో కొత్త రోగాలు పుట్టుకొస్తున్న క్రమంలో గ్రామాల్లో నాటు వైద్యానికి ప్రాధాన్యత తగ్గలేదని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు పేర్కొన్నారు. ఆయన బుధవారం వీరశైవ కల్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన కళ్యాణ కర్ణాటక పారంపరిక నాటు వైద్య పరిషత్‌ జిల్లా సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. భారతీయ ఆయుర్వేద వైద్య పద్ధతిలో నాడీ పరీక్ష ద్వారా రోగుల వ్యాధిని గుర్తించే స్థాయిలో నాటు వైద్యులున్నారన్నారు. పారంపరిక నాటు వైద్యంపై ఆయుర్వేద ఎండీలు, అధ్యాపకులతో శిక్షణ ఇప్పించాలన్నారు. నాటు వైద్యులకు ప్రభుత్వం నుంచి గుర్తింపు కల్పించాలని నాటు వైద్య పరిషత్‌ జిల్లాధ్యక్షుడు ఆనంద్‌ కోరారు. సమావేశంలో అతిథి కేశవరెడ్డి, గౌరవాధ్యక్షుడు మదాని, హుసేన్‌ అన్సారి, మల్లనగౌడ, ఆనందయ్య, కుమారస్వామి, గురుసిద్ధప్ప, సతీష్‌, అస్లాం పాషా, యూసఫ్‌ ఖాన్‌లున్నారు.

గొర్రెల కళేబరాలను పరిశీలిస్తున్న అధికారులు
1/2

గొర్రెల కళేబరాలను పరిశీలిస్తున్న అధికారులు

ప్రతిభాన్విత విద్యార్థులను సన్మానిస్తున్న 
జిల్లాధికారి తదితరులు
2/2

ప్రతిభాన్విత విద్యార్థులను సన్మానిస్తున్న జిల్లాధికారి తదితరులు

Advertisement

తప్పక చదవండి

Advertisement