బాలుడి హత్య కేసులో 17 మంది నిందితుల అరెస్టు | Sakshi
Sakshi News home page

బాలుడి హత్య కేసులో 17 మంది నిందితుల అరెస్టు

Published Fri, Nov 10 2023 5:14 AM

వివరాలు వెల్లడిస్తున్న ఐజీ రవికాంతేగౌడ, చిత్రంలో ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలున్నారు - Sakshi

కోలారు: నగరంలోని బాలుర ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో గత శుక్రవారం రాత్రి మైనర్‌ బాలుడు కార్తీక్‌సింగ్‌ హత్య కేసులో పోలీసులు మొత్తం మూడు కేసులు బనాయించి 17 మందిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐజీ రవికాంతేగౌడ మాట్లాడుతూ ఇందులో సైబర్‌ క్రైం, బాలుడిపై దౌర్జన్య ఘటనకు సంబంధించి మొత్తం 17 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. హత్య కేసులో నిందితులను అరెస్టు చేయడానికి ఎస్పీ నారాయణ్‌ మూడు ప్రత్యేక బృందాలను రచించారన్నారు. పోలీసుల తనిఖీలో గత 8 నెలల క్రితం నిందితులు మృతుడు కార్తీక్‌సింగ్‌ను బట్టలు విప్పి దౌర్జన్యం చేసినట్లు తెలిసిందన్నారు. ఇదే గుంపు రెండేళ్ల క్రితం పబ్లిక్‌ ప్రాంతంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకుని మారణాయుధాలతో కేక్‌ కట్‌ చేసిన సందర్భం ఉంది. మారణాయుధాలతో వీడియోలు తీసి వాటిని ఇన్‌స్ట్రాగాంలో పోస్ట్‌ చేశారు. అందువల్ల వీరిపై మారణాయుధాల చట్టం ప్రకారం మరో కేసును కూడా దాఖలు చేశారన్నారు.

పట్టుబడిన నిందితుల వివరాలివే

కార్తీక్‌ సింగ్‌ హత్యకు సంబంధించి సోను, ఉదయకుమార్‌, ప్రశాంత్‌, యశ్వంత్‌, మరో ఇద్దరు మైనర్‌లతో పాటు 7 మంది నిందితులను అరెస్టు చేశారన్నారు. అరెస్టు సమయంలో మరో ఇద్దరు బాల నేరస్తులు తప్పించుకునే నెపంతో ముళబాగిలు దేవరాయసముద్ర వద్ద పోలీసులపై దాడి చేయడంతో వారి కాలిపై పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేశారన్నారు. మిగిలిన నిందితులను పోక్సో, మారణాయుధాల చట్టం కింద అరెస్టు చేసినట్లు తెలిపారు. కార్తీక్‌ సింగ్‌ హత్య అనంతరం నిందితులు తప్పించుకోవడానికి సహకారం అందించివారిని కూడా వదిలేది లేదన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్‌ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, ప్రజలు సహకారం అందించాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే సిబ్బందిపై కూడా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఇప్పటికే పలువురు సిబ్బందిని సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎం.నారాయణ, అదనపు ఎస్పీ భాస్కర్‌, డీఎస్పీ మల్లేష్‌, ముళబాగిలు డీఎస్పీ నందకుమార్‌ పాల్గొన్నారు.

అరెస్టు సమయంలో ఇద్దరు

నిందితులపై కాల్పులు

ఐజీ రవికాంతేగౌడ వెల్లడి

Advertisement
Advertisement