డీకే ఇంటికి మంత్రులు, ఎమ్మెల్యేల క్యూ | Sakshi
Sakshi News home page

డీకే ఇంటికి మంత్రులు, ఎమ్మెల్యేల క్యూ

Published Fri, Nov 10 2023 5:14 AM

-

పదవుల పంపకాలపై చర్చ

శివాజీనగర: కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల్లో నెలకొన్న అసంతృప్తిని రూపుమాపేందుకు బోర్డు, కార్పొరేషన్‌ల అధ్యక్షుల ఎంపికకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ సిద్ధమవుతోంది. కొందరు ఎమ్మెల్యేలు కేపీసీసీ అధ్యక్షుడైన ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌ను భేటీ చేయడం చర్చనీయాంశమైంది. మంగళవారం ఢిల్లీకి వెళ్లిన డీకే గురువారం నగరానికి తిరిగి వచ్చారు. సదాశివనగరలో ఆయన ఇంటికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లి ఢిల్లీలో చర్చలు, పదవుల పంపకాల గురించి మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదారు నెలలు గడిచినా కూడా ఇప్పటికి బోర్డు, కార్పొరేషన్ల పదవులను భర్తీ చేయకపోవడంపై ఎమ్మెల్యేల్లో అలక ఏర్పడింది. పెద్దసంఖ్యలో నేతలు, ఎమ్మెల్యేలు ఆ పదవుల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నెల 17న మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు ముగిసిన తరువాత రాష్ట్రానికి వచ్చి పదవుల పంపకాలను ఖరారు చేస్తానని సీనియర్‌ నేత సుర్జేవాలా తెలిపారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కష్టపడాలనే హామీతో పదవులను కట్టబెట్టాలని హైకమాండ్‌ యోచిస్తోంది.

రోజూ ఎమ్మెల్యేలతో మాట్లాడతా

ఈ సందర్భంగా డీకే విలేకరులతో మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 10 నుండి 10.30 గంటల వరకు ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో సమస్యలపై చర్చించడానికి కేటాయిస్తానని తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేపీసీసీ అధ్యక్షుల మార్పుపై ఢిల్లీలో చర్చలు జరిగాయన్నారు. 3–4 సంవత్సరాల అవధి ముగిసిందో వారిని మార్చాలని ఉందన్నారు.

నంజుండేశ్వరుడికి భారీ ఆదాయం

మైసూరు: దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన మైసూరు జిల్లా నంజనగూడులోని శ్రీ నంజుండేశ్వర స్వామి కానుకలు లెక్కించారు. ఈసారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. భక్తుల నుంచి రూ. 1.4 కోట్ల ఆదాయం సమకూరింది. ఆలయంలో అన్ని హుండీల ద్వారా రూ. 1.25 కోట్ల ఆదాయం రాగా 155 గ్రాముల బంగారు, రెండు కిలోల వెండి, కొన్ని విదేశీ నోట్లు వచ్చాయి.

ఏటీఎంలో నగదు దోపిడీ

యశవంతపుర: గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎం కత్తరించి రూ.20 లక్షల నగదు దోచుకెళ్లిన ఘటన బెళగావి జిల్లా చిక్కోడి పట్టణంలో జరిగింది. అంబేడ్కర్‌నగర సమీపంలో బుధవారం రాత్రి కారులో వచ్చిన నలుగురు దుండగులు ఎస్‌బీఐ ఏటీఎంలోని రూ.20 లక్షల నగదును దోచుకెళ్లారు. అర్ధరాత్రి కారులో వచ్చి దుండగులు నగదును దోచేశారు. ఈ ఘటనకు సంబంధించి బ్యాంక్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయటంతో నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

Advertisement
Advertisement