Sakshi News home page

జిల్లా కోర్టు సంకీర్ణం

Published Fri, Nov 17 2023 1:06 AM

సువిశాలంగా నిర్మించిన నూతన జిల్లా కోర్టు భవనం  - Sakshi

బళ్లారికి మణిహారం..

సాక్షి,బళ్లారి: స్టీల్‌ సిటీగా, చారిత్రక నగరంగా గుర్తింపు పొందిన బళ్లారిలో మరొక అద్భుతమైన జిల్లా కోర్టు సంకీర్ణం(కాంప్లెక్స్‌) నిర్మాణం పూర్తి కావడంతో అందులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని తాళూరు రోడ్డులో నిర్మించిన అత్యాఽఽధునిక నూతన కోర్టు భవనాన్ని గత ఏడాది జూలై నెలలో అప్పటి హైకోర్టు న్యాయమూర్తి రితురాజ్‌ ప్రారంభించారు. అయితే వివిధ కారణాలు, చిన్న చిన్న పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో నిధులు కూడా ఇంకా అవసరం కావడంతో కోర్టు భవనం ప్రారంభమైనా కార్యకలాపాలు పాత కోర్టులోనే జరిగేవి. ప్రస్తుతం నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి పెండింగ్‌లో ఉన్న నిధులను మంజూరు చేసేందుకు సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేసేందుకు తన వంతు కృషి చేశారు. నగరానికే తలమానికంగా అత్యాధునిక హంగులతో ఉన్న భవనం జిల్లా నూతన కోర్టు కావడం విశేషం. ప్రస్తుతం ఉన్న పాత కోర్టుకు కూడా ఎంతో చారిత్రాత్మక గుర్తింపు ఉంది. అయితే భవనాలు దెబ్బతినడంతో పాటు కోర్టు పక్కనే రైల్వే లైన్‌ వెళ్లడంతో నిత్యం రైళ్ల రాకపోకల శబ్దాలతో కోర్టు విధుల్లో న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులకు ఇబ్బందిగా మారింది.

రూ.130 కోట్లతో అత్యాధునిక భవనం

దీంతో జిల్లా కోర్టును వేరొక చోటకు మార్చాలని, కొత్తభవన నిర్మాణాలు చేపట్టాలని భావించి ఆ దిశగా అప్పటి జిల్లా న్యాయమూర్తి విశ్వేశ్వర భట్‌, అప్పటి జిల్లా న్యాయవాదులు సంఘం అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది పాటిల్‌ సిద్ధారెడ్డిల నేతృత్వంలో చర్చించి అప్పటి హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లడంతో బీజేపీ ప్రభుత్వ హయాంలో నూతన కోర్టు భవన నిర్మాణాలకు, జిల్లా న్యాయవాదుల సంఘం భవనానికి రూ.130 కోట్ల నిధులు మంజూరు చేసి, పనులను చకచకా ప్రారంభించి, వేగవంతంగా పూర్తి చేశారు. నగరంలోనే అత్యాధునిక భవనంగా జిల్లా కోర్టు భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. తాళూరు రోడ్డులో నిర్మించిన జిల్లా కోర్టులో 20 కోర్టు హాల్‌లతో పాటు 20 మంది జడ్జిలు కూర్చొని తీర్పులు చెప్పేందుకు ప్రత్యక భవనాలను నిర్మించడంతో పాటు జజ్జిలకు ప్రత్యేకంగా 20 చాంబర్లు, కక్షిదారులకు ప్రత్యేక లాంజ్‌, అన్ని హంగులతో సెంట్రలైజ్డ్‌ ఏసీ గదులతో నిర్మించిన 20 హాల్స్‌ను కూడా నిర్మించారు. దాదాపు 18 ఎకరాల్లో కోర్టు ఆవరణ ఉండటంతో తాళూరు రోడ్డుకే బళ్లారిలో దాదాపు రూ.120 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ భవనాలు కాని, ప్రైవేటు భవనాలు కాని లేకపోవడంతో జిల్లా కోర్టు భవన సముదాయం నగరానికే మరింత పేరు తెచ్చే విధంగా దోహదం చేస్తోంది.

జడ్జిలకు వసతి గృహాల సదుపాయం

నూతన భవనంలో

కార్యకలాపాలు ప్రారంభం

న్యాయమూర్తులు, న్యాయవాదులు,

కక్షిదారులతో కళకళ

నూతన కోర్టు ఆవరణలో జిల్లా న్యాయమూర్తులకు వసతి గృహాల నిర్మాణాలు పూర్తి చేసి ఇప్పటికే ప్రారంభించడంతో న్యాయమూర్తులకు కూడా ఎంతో అనుకూలంగా జిల్లా కోర్టు భవనం ఉంది. పాత కోర్టు ఆవరణలో 13 కోర్టులు ఉండగా, ఇందులో ప్రస్తుతం జిల్లా కోర్టు, జిల్లా అదనపు న్యాయాలయం, 2వ అదనపు జిల్లా కోర్టు తదితర ఐదు కోర్టులకు సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభం కావడంతో జిల్లా నూతన కోర్టు భవనం కళకళలాడుతోంది. అంతేకాకుండా న్యాయవాదులకు ప్రత్యేకంగా సంఘం కార్యాలయం కూడా పూర్తి కావడంతో న్యాయవాదులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. కక్షిదారులు కూడా కోర్టు ఆవరణ, లోపల ప్రశాంతంగా కూర్చోనేందుకు వీలు కల్పించారు. ఈసందర్భంగా జిల్లా న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు పాటిల్‌ సిద్ధారెడ్డి సాక్షితో మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి నూతన కోర్టులో కార్యకలాపాలు ప్రారంభమమయ్యాయన్నారు నూతన కోర్టు ఆవరణ న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులతో సందడిగా మారిందన్నారు. కాగా నూతన కోర్టు భవనంలో కార్యకలాపాలు ప్రారంభం కావడంతో తాళూరు రోడ్డుకు డిమాండ్‌ ఏర్పడింది. చుట్టుపక్కల లేఅవుట్లలో ఇళ్ల స్థలాలకు, ఇళ్లకు డిమాండ్‌ పెరగడంతో పాటు వ్యాపార కార్యకలాపాలు కూడా ఇక్కడ పుంజుకునే అవకాశం ఉంది.

Advertisement
Advertisement