రైతు బజారును ప్రక్షాళన చేయాలి | Sakshi
Sakshi News home page

రైతు బజారును ప్రక్షాళన చేయాలి

Published Mon, Nov 20 2023 12:30 AM

-

హోసూరు: హోసూరులోని రైతు బజారును ప్రక్షాళన చేయాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు ఎం.రామగౌండర్‌ డిమాండ్‌చేశారు. ఆదివారం హోసూరు రైతు బజారు ముందు జరిగిన రైతు సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు బజారులో రైతులు మాత్రమే అమ్మకాలు జరపాలి, కానీ కొంత మంది నకిలీ అనుమతి కార్డులు తయారు చేసుకొని వ్యాపారాలు చేస్తున్నారన్నారు. రైతు బజారు లోపల పశువులు, మేకలు సంచరిస్తూ వ్యాపారులు, జనంపై దాడులు చేస్తున్నాయన్నారు. దొంగతనాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, రైతు బజారు అధికారులు సకాలంలో వచ్చి కాయగూరల ధరలను నిర్ణయించాలని అన్నారు. కెలమంగలం పట్టణ పంచాయతీలో రైతు బజారు ఏర్పాటు చేయాలని, అటవీ ప్రాంత గ్రామాల్లో వన్య మృగాల దాడులను నివారించాలని, ఏనుగులు, అడవి పందుల దాడుల్లో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్ష పరిహారం అందజేయాలని తీర్మానాలను చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు కావేరప్ప, సంపత్‌ కుమార్‌, మంజునాథ్‌రెడ్డి, మాదప్ప, సుబ్రమణిరెడ్డి, వణ్ణప్ప తదితరులు పాల్గొన్నారు.

లారీని ఢీకొన్న వ్యాన్‌

10 మందికి గాయాలు

హోసూరు: ముందు వెళుతున్న లారీని వ్యాన్‌ ఢీకొన్న ప్రమాదంలో పది మందికి గాయాలేర్పడిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకొంది. వివరాలు.. బెంగళూరు దగ్గర మాగడి ప్రాంతానికి చెందిన భాస్కర్‌ (50) రెండు రోజుల క్రితం చైన్నెకు వెళ్లి శనివారం వ్యాన్‌లో మరికొందరితో తిరుగు ప్రయాణమయ్యాడు. క్రిష్ణగిరి – హోసూరు జాతీయ రహదారి పేరండపల్లి వద్ద ముందు వెళుతున్న లారీని వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భాస్కర్‌, వ్యాన్‌ డ్రైవర్‌ మనోజ్‌, 5 మంది మహిళలతో పాటు 10 మందికి తీవ్ర గాయాలు తగిలాయి. స్థానికులు వెంటనే బాధితులను హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్సానంతరం బెంగళూరుకు తీసుకెళ్లారు. ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

వైద్య శిబిరం

హోసూరు: పట్టణంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిచే ఆదివారం అరసనట్టి అంగన్‌వాడీ కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్పొరేటర్‌ గాంధిమతి కణ్ణన్‌ ప్రారంభించారు. రోగులకు హృద్రోగ పరీక్షలు, కీళ్ల నొప్పులు, మహిళలకు చెకప్స్‌ నిర్వహించారు. అరసనట్టి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొని వైద్య చికిత్సలు చేయించుకొన్నారు.

ఆస్తి గొడవల్లో ఒకరిపై దాడి

హోసూరు: ఆస్తి తగాదాల్లో కార్మికునిపై దాడి చేసిన నలుగురిని హోసూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. పట్టణంలోని ఆవులపల్లి హడ్కో ప్రాంతానికి చెందిన జయశంకరరెడ్డి (44) హోసూరులోని ప్రైవేటు పరిశ్రమలో కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఇతనికి, బంధువుల మధ్య ఆస్తి తగాదాలుండేవి. శనివారం చెన్నత్తూరు వద్ద ఉన్న పొలం వద్దకెళ్లిన జయశంకర్‌రెడ్డిపై బంధువులు నందకుమార్‌ (32), మోపురెడ్డి (51), వాసుదేవరెడ్డి (56), ఉమాశంకరరెడ్డి (47)లు దాడి చేశారు. గాయపడిన జయశంకరరెడ్డిని స్థానికులు చూసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతని ఫిర్యాదు మేరకు నలుగురిని అరెస్ట్‌ చేశారు.

భార్య అదృశ్యంపై ఫిర్యాదు

క్రిష్ణగిరి: తన భార్యను ఓ వ్యక్తి కిడ్నాప్‌ చేశాడని భర్త కురుబరపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల మేరకు క్రిష్ణగిరి జిల్లా కురుబరపల్లి సమీపంలోని కొత్తక్రిష్ణేపల్లి ప్రాంతానికి చెందిన అరుణ్‌రాజ్‌ భార్య రమ్య (27) 15వ తేదీ ఇంటి నుంచి బయటకెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా జాడ తెలియలేదు. స్థానికుల సమాచారం మేరకు విరుదునగర్‌ జిల్లాకు చెందిన అరుణ్‌ (27) రమ్యను కిడ్నాప్‌ చేసినట్లు తెలిసి కురుబరపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.

బైక్‌లను ఢీకొన్న కారు..

ఇద్దరి మృతి

దొడ్డబళ్లాపురం: రెండు బైక్‌లను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన బెంగళూరు–మంగళూరు 75వ జాతీయ రహదారిపై మరూరు హ్యాండ్‌ పోస్టు వద్ద చోటుచేసుకుంది. మృతులను సింగ్రిగౌడనపాళ్య గ్రామం నివాసి గంగాధరయ్య(45), కుణిగల్‌ నివాసి రజాక్‌ బాషా(34)గా గుర్తించారు. మృతులు ఇద్దరూ సోలూరు మీదుగా కుణిగల్‌ వైపు వేర్వేరుగా బైక్‌లపై వెళ్తుండగా నారసంద్ర వంతెన వద్ద బెంగళూరు వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. గంగాధరయ్య అక్కడికక్కడే మృతిచెందగా, రజాక్‌ బాషాను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారుతో పాటు డ్రైవర్‌ పరారయ్యాడు. కుదూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement