మల్బరీ సాగులో అసమాన సాధన | Sakshi
Sakshi News home page

మల్బరీ సాగులో అసమాన సాధన

Published Tue, Dec 5 2023 5:06 AM

కరువు సమయంలో మొక్కలకు నీటిని సైకిల్‌పై బిందెల్లో తెస్తున్న రైతు వెంకటరామయ్య(ఫైల్‌)   - Sakshi

కోలారు: మల్బరీ వ్యవసాయంలో శాస్త్రవేత్తలను తలదన్నేలా కొత్త విషయాలను ఆవిష్కరించడంలో తాము ముందంజలో ఉన్నామని జిల్లా రైతులు నిరూపిస్తున్నారు. ఇందుకు తాలూకాలోని హొన్నేనహళ్లి రైతు వెంకటరామయ్యే చక్కటి నిదర్శనం. మల్బరీ వ్యవసాయంలో వినూత్న పద్ధతిని ఆవిష్కరించిన రైతుకు గత పదేళ్లలో ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం, గుర్తింపు లభించక తెరమరుగునే ఉండి పోవాల్సి వచ్చింది. రైతు వెంకటరామయ్య వినూత్నంగా ఆవిష్కరించిన మల్బరీ మొక్కల పెంపకంలో చెట్టు పద్ధతి దేశవిదేశాల దృష్టిని ఆకర్షించింది. శాస్త్రవేత్తల బృందం చేయాల్సిన పరిశోధనలు రైతు వెంకటరామయ్య చేసి చూపించడం విశేషం. వెంకటరామయ్య చేసిన సాధనకు చిక్కిన ప్రతిఫలం పట్టు పరిశ్రమ శాఖ నుంచి లభించిన రూ.10 వేల ప్రోత్సాహధనం మాత్రమే. వెంకటరామయ్య సాధనపై మైసూరు సీఎస్‌ఆర్‌టీఐ ప్రకటించిన పట్టు వ్యవసాయం విజయగాథల ఆంగ్ల లేఖనం ఎంతో మంది విదేశీయుల దృష్టిని కూడా ఆకర్షించింది.

అవసరమే అన్వేషణకు మూలం

వెంకటరామయ్య ఆవిష్కరణ వెనుక ఆయన అవసరం దాగి ఉంది. నీటి మూలాలు తక్కువగా ఉన్న కోలారు జిల్లాలో ఎంతోమంది రైతులు పట్టు వ్యవసాయానికి దూరమైనా పట్టు వ్యవసాయాన్నే కొనసాగించాలనే పట్టుదల పట్టులో చెట్టు పద్ధతి ఆవిష్కరణకు కారణమైంది. హొన్నేనహళ్లి వద్ద వెంకటరామయ్యకు 4 ఎకరాల పొలం ఉంది. బోరుబావిని తవ్వించి కూరగాయలు తదితర వాణిజ్య పంటలను పండించేవారు. 2011–12లో జిల్లాలో కరువు ఆవరించింది. ఆ సమయంలో రైతులు నీటికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. పలువురు రైతులు పట్టు వ్యవసాయం చేయడాన్ని మానుకున్నారు. ఇలాంటి సమయంలో వెంకటరామయ్య మెదడులో పుట్టిన ఆలోచనే చెట్టు పద్దతి ద్వారా మల్బరీ తోటను పెంచడం.

తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి

గతంలో మొక్కగా పెంచే మల్బరీని చెట్టులాగా పెంచాలని నిర్ణయించాడు. ఈ పద్ధతిలో మల్బరీ చెట్టుకు నీరు తక్కువ అవసరం ఉండేది. తన ఆలోచనను అమలు చేసి కరువు సమయంలో నీరు లేక సైకిల్‌పై బిందెలతో నీరు పోసి చెట్టు పద్ధతిలో మల్బరీ ఆకులను పెంచి సఫలమయ్యాడు. ఆరంభంలో కేవలం 10 గుంట్ల స్థలంలో 144 చెట్లను నాటి చెరువు నుంచి సైకిల్‌పై బిందెలతో నీరు తీసుకు వచ్చి పోసి పెంచాడు. చెట్టుకింద బాటిల్‌ ఉంచి అందులో పోసి డ్రిప్‌ ఇరిగేషన్‌ తరహాలో చేసి తక్కువ నీటితో చెట్టు పెరిగేలా చూశాడు. గతంలో కంటే మల్బరీ ఎక్కువ దిగుబడి రావడంతో వెంకటరామయ్య ఇక వెనుదిరిగి చూడలేదు,. ప్రస్తుతం 900 మల్బరీ చెట్లను పెంచి మల్బరీ ఆకులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు.

చెట్టు పద్ధతిలో ఉత్పత్తి పెంపు

సాధారణంగా మొక్క పద్దద్ధలో పెంచే మల్బరీ పంటతో 100 పట్టు గుడ్లకు 60 నుంచి 70 కిలోల పట్టు గూళ్లు ఉత్పత్తి అయ్యేవి. చెట్టు పద్దతిలో ఉత్పత్తి చేయడం వల్ల 100 పట్టుగుడ్లకు 90 నుంచి 100 కిలోల వరకు ఉత్పత్తి అవుతోంది. చెట్టు పద్ధతిలో మల్బరీ సాగు వల్ల ఉత్పత్తి పెరుగుతోంది. పూర్తిగా సేంద్రీయ పద్దతిలోనే పెరిగిన చెట్లు కావడం వల్ల పట్టు ఆకుల్లో ఉన్న తేమ , పోషకాంశాలే దిగుబడి పెరగడానికి కారణమని వెంకటరామయ్య అంటున్నారు. ఆరంభంలో 8–8 అడుగుల దూరంలో నాటుతున్న మల్బరీని తరువాత 10–10 అడుగుల దూరానికి పెంచాడు. దీని వల్ల ప్రయోజనం మధ్యలో అలసందలు, ఉలవలు, రాగులు పండించవచ్చని అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థలు, విశ్వవిద్యాలయాలు రైతులను ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నాయనేందుకు వెంకటరామయ్యే నిదర్శనం అని చెప్పవచ్చు.

వినూత్నంగా చెట్టు పద్ధతి ఆవిష్కర్తకు ప్రోత్సాహం కరువు

విశిష్ట రైతుకు ప్రభుత్వాల నుంచి లభించని తగిన గుర్తింపు

 వెంకటరామయ్య పొలంలోని మల్బరీ పంటను పరిశీలిస్తున్న వివిధ ప్రాంతాల విద్యార్థులు(ఫైల్‌)
1/1

వెంకటరామయ్య పొలంలోని మల్బరీ పంటను పరిశీలిస్తున్న వివిధ ప్రాంతాల విద్యార్థులు(ఫైల్‌)

Advertisement
Advertisement