Karnataka : బళ్లారి విజేత ఎవరు? | Sakshi
Sakshi News home page

Karnataka : బళ్లారి విజేత ఎవరు?

Published Sat, Apr 6 2024 1:35 AM

బ్రిటిషు వారు నిర్మించిన బళ్లారి రైల్వే జంక్షన్‌ స్టేషన్‌  - Sakshi

బళ్లారి లోక్‌సభలో హోరాహోరీ

హ్యాట్రిక్‌ సాధకులు టేకూరు సుబ్రమణ్యం, బసవరాజేశ్వరి

2004 నుంచి బళ్లారి బీజేపీకి భద్రకోటగా మారిన వైనం

ఒక నియోజకవర్గం దేశవ్యాప్తంగా న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో ఉంటుంది. అదే కర్ణాటకలోని బళ్లారి. భౌగోళిక, రాజకీయ, చారిత్రక ప్రాధాన్యం ఉన్న బళ్లారి గురించి గ్రౌండ్‌ రిపోర్ట్‌ మీరే చదవండి

సాక్షి, బళ్లారి: రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని 545 లోక్‌సభ స్థానాల్లో ప్రముఖమైన, దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలకు, ప్రముఖులకు గుర్తుండే లోక్‌సభ స్థానాల్లో బళ్లారి లోక్‌సభ కూడా ఒకటి అంటే అతిశయోక్తి కాదు. బళ్లారి లోక్‌సభ పరిధిలో చారిత్రాత్మక కట్టడాలైన ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీ, అపారమైన ఇనుప ఖనిజ నిల్వలు, తుంగభద్ర డ్యాం తదితరాలు ఉండటం ఒక ఎత్తయితే, 1999లో ఈ లోక్‌సభ స్థానం నుంచి అప్పటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, బీజేపీ తరపున దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ పోటీ చేయడంతో అందరి దృష్టి బళ్లారిపై పడింది. ఈనేపథ్యంలో సహజంగానే చారిత్రాత్మక నేపథ్యం కలిగిన నియోజకవర్గంలో అగ్రనేతలు ఢిల్లీ నుంచి వచ్చి బళ్లారిలో పోటీ చేయడంతో అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్‌సభ ఎన్నికలే కాదు, అసెంబ్లీ ఎన్నికలను కూడా దేశ వ్యాప్తంగా అందరూ గమనిస్తుంటారు. కాగా స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి అంటే 1951 నుంచి 2019 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలను గమనిస్తే ప్రతి ఎన్నిక హోరాహోరీగానే జరిగాయి.

అత్యధిక సార్లు గెలిచింది ఎవరంటే?

1951లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో బళ్లారి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోటీ చేసిన టేకూరు సుబ్రమణ్యం తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి వై.మహాబళేశ్వరప్పపై 30 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొంది అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు అంటే 1957, 1962లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయనే కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొంది హ్యాట్రిక్‌ లోక్‌సభ సభ్యుడుగా రికార్డు సృష్టించారు. ఆయన తర్వాత 1967లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన వీ.కే.ఆర్‌.వీ.రావ్‌ స్వతంత్ర అభ్యర్థి వై.మహాబళేశ్వరప్పపై విజయం సాధించారు.

1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ వీ.కే.ఆర్‌.వీ.రావ్‌ రెండోసారి కూడా విజయం సాధించారు. 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కే.ఎస్‌.వీరభద్రప్ప కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ భారతీయ లోక్‌దళ్‌ పార్టీ తరపున పోటీ చేసిన తిప్పణ్ణపై గెలుపొందారు. 1980లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్‌ నుంచి ఆర్‌.వై.ఘోర్పడే విజయం సాధించారు. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బసవరాజేశ్వరి కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎం.పీ.ప్రకాష్‌పై పోటీ చేసి గెలుపొందారు. 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండోసారి, 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బసవరాజేశ్వరి మూడో సారి పోటీ చేసి గెలుపొంది హ్యాట్రిక్‌ లోక్‌సభ సభ్యురాలుగా ఈమె కూడా రికార్డు సృష్టించారు. అప్పటి వరకు జరిగిన బళ్లారి లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలుపొంది హాట్రిక్‌ లోక్‌సభ మెంబర్లుగా వీరిద్దరు మాత్రమే నిలిచారు.

ఐదేళ్లలో నాలుగుసార్లు ఎన్నికలు

1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన కే.సీ.కొండయ్య తన సమీప ప్రత్యర్థి ఎన్‌.తిప్పణ్ణపై విజయం సాధించారు. 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ కే.సీ.కొండయ్య విజయం సాధించి, రెండుసార్లు లోక్‌సభ మెంబరుగా గెలుపొందారు. 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించాయి. అప్పట్లో బళ్లారి నుంచి కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీ, బీజేపీ తరపున సుష్మాస్వరాజ్‌ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీ గెలుపొంది రికార్డు సృష్టించారు. అప్పట్లో బీజేపీ ఓడిపోయినా సుష్మాస్వరాజ్‌ పోటీ చేయడంతో కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న బళ్లారిపై క్రమేణా బీజేపీ పట్టు సాధించేందుకు వీలైంది. 2000 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కోళూరు బసవనగౌడ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కేఎస్‌ వీరభద్రప్పపై విజయం సాధించారు.

2004 నుంచి బీజేపీకి కంచుకోట

2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన కరుణాకరరెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి కే.సీ.కొండయ్యపై విజయం సాధించారు. తొలిసారి బీజేపీ లోక్‌సభ సభ్యుడుగా గాలి సోదరుల్లో అగ్రజుడు కరుణాకరరెడ్డి విజయం సాధించడంతో బళ్లారిలో గాలి సోదరుల ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన జే.శాంత తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్‌.వై హనుమంతప్పపై విజయం సాధించారు.

2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన బీ.శ్రీరాములు కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడించి గెలుపొందారు. 2018లో జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన ఉగ్రప్ప తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జే.శాంతపై ఘన విజయం సాధించారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన వై.దేవేంద్రప్ప తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి వీఎస్‌ ఉగ్రప్పపై ఘన విజయం సాధించారు. ఇలా ఇప్పటి వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలను గమనిస్తే ఎక్కువసార్లు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థులే గెలుపొందారు.

ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌ హోరాహోరీ

అయితే 2004 నుంచి ఇప్పటి వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలను గమనిస్తే 2018లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికలు మినహా మిగిలిన ఎన్నికల్లో బీజేపీనే ఘన విజయం సాధిస్తూ ఇక్కడ పట్టు పెంచుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. బీజేపీ తరపున మాజీ మంత్రి బీ.శ్రీరాములు, కాంగ్రెస్‌ తరపున మాజీ మంత్రి, సండూరు ఎమ్మెల్యే తుకారాం పోటీ పడుతున్న నేపథ్యంలో పోటీ మరింత రసవత్తరంగా మారనుంది.

బళ్లారి లోక్‌సభ పరిధిలో బళ్లారిసిటీ, బళ్లారి రూరల్‌, హగరిబొమ్మనహళ్లి, హడగలి, సండూరు, కూడ్లిగి, కంప్లి, విజయనగరతో సహా 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆరు నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా, మిగతా రెండు నియోజకవర్గాల్లో ఒక చోట బీజేపీ, మరొక చోట జేడీఎస్‌ ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు. ఈ లోక్‌సభ పరిధిలో మొత్తం 18,65,341 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 9,20,022 మంది, మహిళా ఓటర్లు 9,45,319 మంది ఉన్నారు. పురుష ఓటర్లు కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement