ప్రచారం.. వాయువేగం | Sakshi
Sakshi News home page

ప్రచారం.. వాయువేగం

Published Mon, Apr 8 2024 12:45 AM

గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తుమకూరు వద్ద సభకు వచ్చిన హెలికాప్టర్లు  - Sakshi

సాక్షి, బళ్లారి: ఓ వైపు భానుడు భగభగ మంటూ ప్రతాపం చూపుతూ జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, నాయకులు ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌ల స్టార్‌ క్యాంపెయినర్లు కార్లు, బస్సుల్లో వెళ్లి లోక్‌సభ స్థానాల్లో ప్రచారం చేసేందుకు సమయం, ఓపిక లేకపోవడంతో వాయు మార్గాలను ఎన్నుకున్నారు. హెలికాప్టర్లు, చార్టర్డ్‌ విమానాలను బుక్‌ చేసుకోవడం పెరిగింది. కొండలు, లోయలు వంటి వైవిధ్య భౌగోళిక స్వరూపం కలిగిన రాష్ట్రంలో 28 లోక్‌సభ స్థానాల్లో అగ్రనేతలు తిరగాలంటే మాటలు కాదు. సీఎం, డిప్యూటీ సీఎంలు ఇప్పటికే హెలికాప్టర్లలో ముమ్మరంగా పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తదితర అగ్ర నాయకులతో పాటు రాష్ట్రానికి చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, మాజీ సీఎం యడియూరప్ప, బసవరాజ్‌ బొమ్మై వంటివారు సుడిగాలి పర్యటనలకు లోహ విహంగాలనే ఎంచుకున్నారు. కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ తదితరులు కూడా హెలికాప్టర్లలోనే ప్రచార సభలకు చేరుకుంటారు.

అద్దెలు సైతం ఆకాశంలో

● గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి కర్ణాటకలో హెలికాప్టర్లు, విమానాలకు భారీ డిమాండ్‌ ఏర్పడిందని సమాచారం.

● గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ నాయకులు హెలికాప్టర్లలో తిరిగేందుకు రూ.250 కోట్లపైగా బాడుగలు చెల్లించినట్లు, కాంగ్రెస్‌ నేతలైతే రూ.125 కోట్లు బాడుగ చెల్లించినట్లు తెలియవచ్చింది.

● ఈసారి ధనవ్యయం రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఆయా పార్టీలకు చెందిన అగ్రనాయకులు చెబుతున్నారు. హెలికాప్టర్‌ అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి.

● ఇద్దరు కూర్చొనే హెలికాప్టర్‌కు ఒక గంటకు ప్రస్తుతం రూ.2లక్షలు 15వేలు పలుకుతుండగా, ఐదు మంది కూర్చొనే హెలికాప్టర్‌ దాదాపు రెండున్నర లక్షలు, ఆరు మంది కూర్చొనే మిని విమానం ఒక గంటకు రూ.3.5 లక్షలు చార్జి చేస్తారు.

● 8 మంది కూర్చొనే మినీ విమానం రూ.4 లక్షలు, 12 మంది కూర్చొనేందుకు వీలుండే విమానం రూ.5.50 లక్షలుగా నిర్ణయించారని సమాచారం. అయినా కూడా అవి దొరకనంతగా డిమాండు ఏర్పడిందని పలువురు నేతలు తెలిపారు.

ఎన్నికల వేళ హెలికాప్టర్లు,

చిన్న విమానాలకు గిరాకీ

సత్వర ప్రయాణాలకు నేతల మొగ్గు

మూడు నెలల కిందటే బుకింగులు

పార్టీల రూ.వందల కోట్ల వ్యయాలు

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో అధిక సీట్లే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు పోరాటం సాగిస్తున్నాయి. ఇది నేల మీది నుంచి నింగిలోకి కూడా పాకింది. హెలికాప్టర్లు, చిన్న విమానాల్లో అగ్ర నాయకులు సంచరిస్తూ దూరప్రాంతాల్లో వాడివేడిగా ప్రచారానికి నాంది పలికారు. ఖర్చు ఎంతైనా ఫరవాలేదు, రోజులో వీలైనన్ని ఎక్కువ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలి అనుకుంటున్న నాయకులు లోహ విహంగాల వెంట పడుతున్నారు.

Advertisement
Advertisement