మెడికోలకు కలరా భయం | Sakshi
Sakshi News home page

మెడికోలకు కలరా భయం

Published Mon, Apr 8 2024 12:45 AM

ప్రఖ్యాత వైద్య విద్యాసంస్థ హాస్టల్లోనే అంటువ్యాధులు ప్రబలడంపై ఆందోళన  - Sakshi

శివాజీనగర: బెంగళూరు మెడికల్‌ కాలేజీ, పరిశోధనా సంస్థ (బీఎంసీఆర్‌ఐ) హాస్టల్‌లో వైద్య విద్యార్థినులు కలరా బారిన పడిన ఘటన కలకలం రేపుతోంది. ఆదుర్దాకు గురైన పలువురు వైద్య విద్యార్థులు హాస్టళ్లను ఖాళీ చేస్తున్నారు. అస్వస్థతకు గురైన మొత్తం 49 మందిలో 22 మంది విద్యార్థినులకు కలరా పాజిటివ్‌ అని నివేదికలు రావడం దీనికి కారణం. మిగతా రిపోర్టులు సోమవారం రానున్నాయి. విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్యం స్థిరంగా ఉండగా, ఇద్దరు మాత్రం ఐసీయూలో ఉన్నారు. శనివారం రాత్రి 21 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 22 మంది విద్యార్థినులకు చికిత్స కొనసాగుతోంది.

సొంతూళ్లకు విద్యార్థినులు

విద్యార్థినులు హాస్టళ్లలో వండిన ఆహారం తినకుండా స్విగ్గి, జొమోటాలను ఆశ్రయిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఫోన్లు చేసి ఇళ్లకు రావాలని ఒత్తిడి చేస్తున్నారు. అనేకమంది విద్యార్థినులు లగేజీ తీసుకుని వెళ్లిపోయారు. కొందరు సొంతూళ్లకు, మరికొందరు నగరంలోనే ఇతర హాస్టళ్లు, బంధువుల ఇంటికి వెళ్తున్నట్లు చెప్పారు. పాలక మండలి వారంలోగా హాస్టల్‌ సమస్యను సరిచేస్తామని తెలిపింది.

హాస్టల్‌ వార్డెన్‌ సస్పెండ్‌

హాస్టల్‌ వార్డెన్‌ అఖిలాండేశ్వరిని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. హాస్టల్‌ వంట గది నుంచి వచ్చిన భోజనం తిన్నవారే కలరా బారిన పడ్డారని తనిఖీలలో వెల్లడైంది. హాస్టల్‌లో నీరు, తిండి నమూనాలను ల్యాబ్‌కు పంపామని, నివేదికలు వచ్చాక కారణాలు తెలుస్తాయని కాలేజీ డీన్‌ డా. రమేశ్‌ కృష్ణ తెలిపారు.

పలు జిల్లాల్లో కలరా కేసులు

ప్రస్తుతం రాష్ట్రంలో కలరా కేసుల సంఖ్య పెరుగుతోంది. బెంగళూరులో 3, బెంగళూరు నగర జిల్లా పరిధిలో 6, రామనగర జిల్లాలో 1 కేసు నిర్ధారణ అయినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. బొమ్మనహళ్ళిలో 35 సంవత్సరాల డ్రైవర్‌ కలరా బారిన పడ్డారు.

బీఎంసీఆర్‌ఐ హాస్టళ్ల నుంచి పయనం

ఓ వార్డెన్‌ సస్పెండ్‌

22 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ

1/1

Advertisement
Advertisement