Sakshi News home page

ఈసారి నాన్న.. సత్తా చాటేనా?

Published Wed, Apr 17 2024 12:45 AM

- - Sakshi

మండ్యలో హై ఓల్టేజ్‌ పోరాటం

మాజీ సీఎం కుమారస్వామి వర్సెస్‌ వ్యాపారవేత్త

గతంలో కుమార తనయుని ఓటమి

రాష్ట్రంలో హై ఓల్టేజ్‌ ఎంపీ సీట్లలో ఒకటిగా మండ్య ఎప్పుడూ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఇక్కడ పోటీ రాష్ట్రంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. సాదా సీదా నియోజకవర్గాలకు భిన్నంగా ఇక్కడ జరిగే ఎన్నికలు.. రాజకీయాలను వేడెక్కిస్తాయన్నది నిజం. పోటీదారులు, కులం, పార్టీ తదితర అంశాలు ఎన్నికలను కుతూహలంగా మారుస్తాయి. ఈసారి జేడీఎస్‌ మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి, కాంగ్రెస్‌ నుంచి పెద్దగా రాజకీయ చరిత్ర లేని స్టార్‌ చంద్రు తలపడుతున్నారు.

కర్ణాటక: మండ్య ఎంపీ నియోజకవర్గంలో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థిగా కుమారస్వామి, కాంగ్రెస్‌ నుంచి వెంకట రమణ గౌడ అలియాస్‌ స్టార్‌ చంద్రు నామినేషన్లు ముగించి ప్రచారంలో ముందున్నారు. ఎవరు విజయం సాధిస్తారు అనేది ఉత్కంఠ నెలకొంది. గత పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్‌ చేతిలో జేడీఎస్‌ అభ్యర్థి నిఖిల్‌ కుమారస్వామి దారుణంగా ఓడిపోయారు. దీంతో కొడుకు స్థానంలో తండ్రి రంగం మీదకు వచ్చారు. ఈసారి బీజేపీ బలం ఉండడంతో కుమారస్వామి ఉత్సాహంగా ఉన్నారు. మండ్యలో గెలిచి జేడీఎస్‌ జెండాను ఎగరేయాలి అన్నది ఏకై క అజెండాగా పెట్టుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఎన్‌. చెలువరాయస్వామి, కాంగ్రెస్‌ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు.

ఇద్దరూ స్థానికేతరులే
కుమారస్వామి, స్టార్‌ చంద్రు ఇద్దరూ మండ్యలో స్థానికులు కాదు, బెంగళురు నగరానికి చెందిన వారు కావడం విశేషం. స్టార్‌ చంద్రు బెంగళూరులో వ్యాపారవేత్త. కాంగ్రెస్‌ నాయకులు ఆయనను ఏరికోరి దళపతి కుటుంబానికి వ్యతిరేకంగా నిలబెట్టారు. స్టార్‌ చంద్రు గెలుపుని మంత్రి చెలువరాయస్వామి భుజాలకెత్తుకున్నారు. జేడీఎస్‌లో అసమ్మతితో ఉన్న వారిని కాంగ్రెస్‌లోకి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎవరి ప్రచారం ఎలా..
ప్రస్తుత ఎంపీ సుమలత అంబరీష్‌ ఇటీవలే బీజేపీలో చేరి కుమారకు మద్దతు పలికారు. కానీ అధికార కాంగ్రెస్‌ అంత తేలికగా తీసుకోవడం లేదు. ఈ నెల 17న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో మండ్యలో ప్రచార సభ నిర్వహించనుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి పూర్తిగా ఐదు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు, తాను గెలిచి కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలు వస్తాయని ప్రజలకు చెబుతున్నారు. కుమారస్వామి నరేంద్రమోదీ పథకాలు, జిల్లా అభివృద్ధిని ప్రస్తావిస్తున్నారు. జిల్లాలో మైనారిటీలు, దళితులు, కురుబ, ఒక్కళిగ సముదాయం ఓటర్లు అధికం. కాంగ్రెస్‌ మూడు వర్గాలను నమ్ముకుంటే, జేడీఎస్‌ ఒక వర్గాన్ని నమ్ముకుంది.

కుమారకు పాత బలం
గతంలో మండ్య జిల్లాలో ఎక్కువగా జేడీఎస్‌ ఎమ్మెల్యేలే ఉండేవారు. ఆ నాయకులు కుమారస్వామి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఇతర సీనియర్లు చంద్రుకు మద్దతుగా ఉన్నారు. పోలింగ్‌కు ఇంకో 9 రోజులు ఉంది. జిల్లా ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది తేలాల్సి ఉంది.

Advertisement
Advertisement