17.36 ఎకరాల అసైన్డ్‌ భూమి స్వాధీనం | Sakshi
Sakshi News home page

17.36 ఎకరాల అసైన్డ్‌ భూమి స్వాధీనం

Published Wed, Mar 22 2023 12:38 AM

హద్దులు ఏర్పాటుచేయిస్తున్న తహసీల్దార్‌ శైలజ - Sakshi

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం మల్లెమడుగు రెవెన్యూ పరిధిలోని అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతం కావడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏళ్ల క్రితం పేదలకు సాగు అవసరాల నిమిత్తం ప్రభుత్వం అసైన్డ్‌ భూములను పంపిణీ చేయగా.. అవి చేతులు మారుతూ వచ్చాయి. కొందరు లబ్ధిదారులే అమ్ముకోగా, మరికొంత భూమిని రియల్టర్లు ఆక్రమించినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ అనంతరం 19.05 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని ఖమ్మం ఆర్డీఓ రవీంద్రనాథ్‌ ఖమ్మం అర్బన్‌ తహసీల్దార్‌ శైలజను ఆదేశించారు. ఈమేరకు ఆమె సిబ్బందితో చేరుకుని ఎకరం పైగా పట్టా భూమి కూడా ఉన్నట్లు గుర్తించగా.. అదిపోగా 17.36 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని హద్దురాళ్లు పాతించడంతో పాటు ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గజం ధర సుమారు రూ.10 వేల వరకు ఉండగా.. ఎకరం మేర రోడ్లుగా పోయినా అధికారులు స్వాధీ నం చేసుకున్న భూమి విలువ సుమారు రూ.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. పదేళ్ల క్రితం ఈ భూమిని పలువురికి కేటాయించగా.. ప్లాట్లుగా మార్చడంతో చేతులు మారుతూ వచ్చింది. ఇప్పుడు అక్కడ వ్యవసాయం చేసినట్లుగా ఆనవాళ్లు కూడా లేకపోవడం గమనార్హం. కాగా, భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్న నేపథ్యాన రియల్టర్ల నుంచి కొనుగోలు చేసిన వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

విలువ రూ.50 కోట్ల పైమాటే..

Advertisement
Advertisement