కాంగిరేస్‌లో... హైరానా! | Sakshi
Sakshi News home page

కాంగిరేస్‌లో... హైరానా!

Published Sat, Jun 24 2023 1:10 AM

- - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో టికెట్ల కోసం వేట మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఐదారు నెలల సమయం ఉన్నా ఆలోపు ఏం జరగనుందోనన్న ఆందోళన ఆశావహుల్లో కనిపిస్తోంది. జిల్లాలోని మెజార్టీ నియోజకవర్గాల్లో ముగ్గురు నుంచి నలుగురు పార్టీ టికెట్‌ ఆశిస్తున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి అనుచర వర్గాలు తమకే టికెట్లు వస్తాయన్న ధీమాతో ఉన్నారు. ఇంతలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరిక ఖరారైంది. అయితే, ఆయన పార్టీలో చేరకముందే కొన్ని నియోజకవర్గాలకు తన తరఫున అభ్యర్థులను ప్రకటించడంతో ఆశావహుల్లో కంగారు మొదలైంది.

నియోజకవర్గాల వారీగా ఇలా...
కొత్తగూడెం అసెంబ్లీ సీటు జనరల్‌ కావడంతో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కొన్నేళ్లుగా పట్టు వదలకుండా రేణుకా చౌదరి వర్గానికి చెందిన ఎడవల్లి కృష్ణ ఎన్నికల బరిలో నిలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుండగా, ఈసారి ఎలాగైనా టికెట్‌ దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. అలాగే, భట్టి వర్గానికి చెందిన నాగ సీతారాములు కూడా టికెట్‌ వేటలో ఉన్నారు. ఇంకా అలాగే భట్టి అనుచర నేత పోట్ల నాగేశ్వరరావు కొత్తగూడెంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడమే కాక ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. వీరు కాకుండా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాను మూడు నియోజకవర్గాల్లో ఒకటి ఎంచుకుంటానని చెప్పడంతో జాబితాలో ఖమ్మం లేదా కొత్తగూడెం ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది.

భద్రాచలం నుంచి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న పొదెం వీరయ్య డీసీసీ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మొదటి ప్రాధాన్యతగా టికెట్లు ఇవ్వనుండడంతో ఆయనకే టికెట్‌ ఖాయమని సమాచారం. అయితే ఈ స్థానంపై పొంగులేటి ప్రధాన అనుచరుడైన తెల్లం వెంకట్రావు ఆశలు పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ, 2018లో టీఆర్‌ఎస్‌ నుంచి ఆయన పోటీ చేశారు.

ఇల్లెందు నియోజవర్గంలో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇక్కడ చీమల వెంకటేశ్వర్లు, భూక్యా దళ్‌సింగ్‌నాయక్‌, డాక్టర్‌ రాంచందర్‌నాయక్‌, డాక్టర్‌ జి.రవి, బానోతు విజయలక్ష్మి, కామేపల్లి జెడ్పీటీసీ వెంకటప్రవీణ్‌నాయక్‌ టికెట్‌ రేసులో ఉన్నారు. వీరిలో ఇద్దరు నేతలు భట్టి వర్గం వారు కాగా, మిగతా నేతలు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేణుకౌచౌదరి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వర్గాలకు చెందినవారు. వీరిలో చీమల వెంకటేశ్వర్లు ఇటీవల టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రేను కలిశారు. ఇక జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య పొంగులేటి వర్గం నుంచి టికెట్‌ ఆశిస్తుండగా, ఆయన అభ్యర్థిత్వాన్ని పొంగులేటి కూడా ప్రకటించారు.

అశ్వారావుపేటకు సంబంధించి 2018లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తాటి వెంకటేశ్వర్లు ఇటీవల కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఆ స్థానం టికెట్‌ తనదేనన్న ధీమాతో ఆయన ఉన్నారు. అయితే పొంగులేటి తన వర్గం అభ్యర్థిగా జారె ఆదినారాయణను ప్రకటించడంతో టికెట్‌ ఎవరికనే చర్చ జరుగుతోంది.

సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌, కోటూరి మానవతారాయ్‌, మట్టా దయానంద్‌ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. వీరంతా ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మట్టా దయానంద్‌ ఇటీవలే రేణుకాచౌదరి నేతృత్వాన పార్టీలో చేరగా.. ఈ నియోజకవర్గానికి సంబంధించి కొండూరి సుధాకర్‌ను పొంగులేటి తన అభ్యర్థిగా చెబుతున్నారు. దీంతో టికెట్‌ తమకేననే ధీమాలో ఉన్న వీరు కేడర్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

వైరా నియోజకవర్గంలో పోటీ చేసేందుకు మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి వర్గం నుంచి ధరావత్‌ రామ్మూర్తినాయక్‌, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వర్గం నుంచి మాలోతు రాందాస్‌నాయక్‌, బానోత్‌ బాలాజీనాయక్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే, ఇక్కడ పొంగులేటి వర్గం నుంచి అభ్యర్థిగా బానోతు విజయాబాయిని ప్రకటించడంతో టికెట్‌ కోసం బహుముఖ పోటీ నెలకొంది.

పాలేరు నియోజకవర్గంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కేడర్‌తో కలిసిపోతున్నారు. మరోవైపు మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి వర్గానికి చెందిన రామసహాయం మాధవిరెడ్డి, మద్ది శ్రీనివాస్‌రెడ్డి టికెట్‌ కోసం ప్రయత్నాలు తీవ్రం చేశారు. ఇక్కడ పొంగులేటి వర్గం నుంచి మద్దినేని బేబి స్వర్ణకుమారి టికెట్‌ ఆశిస్తున్నారు.

ఖమ్మంలోనూ రేణుకా చౌదరి, భట్టి అనుచరులు ఒకరిద్దరు టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. వీరిని బరిలో నిలిపేందుకు బలమైన అభ్యర్థులు కారనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ స్థానం నుంచి పొంగులేటి కూడా పోటీలో ఉంటారన్న ప్రచారం మొదలైంది.

పినపాక నియోజకవర్గంలో పాయం వెంకటేశ్వర్లు అధికార పార్టీకి దీటైన అభ్యర్థి అని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

మధిర నుంచి సీఎల్పీ నేత, సిట్టింగ్‌ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. పొంగులేటి వర్గం నుంచి కోటా రాంబాబు ఉన్నప్పటికీ.. భట్టినే బరిలో ఉండనున్నారు.

అధిష్టానం వద్దకు క్యూ
టికెట్‌ దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆశావహులు కాంగ్రెస్‌ అధిష్టానం వద్దకు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పినపాక, ఖమ్మం, మధిర నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట టికెట్‌ కోసం త్రిముఖ, బహుముఖ పోటీ నెలకొంది. ఇటీవల ఇల్లెందుకు చెందిన నేతలు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని కలవగా.. మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి నేతృత్వంలో వైరా నియోజకవర్గం నుంచి రామ్మూర్తి నాయక్‌, సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మట్టా దయానంద్‌, ఖమ్మంకు చెందిన ఎం.డీ.ముస్తఫా తదితరులు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను గురువారం కలిశారు. అలాగే, వీరు శుక్రవారం ఢిల్లీలో టీ పీసీసీ ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రేను కూడా కలవడం గమనార్హం. ఇక పొంగులేటి పార్టీలో చేరనుండడంతో పార్టీ టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య పెరగగా.. టికెట్‌ రేసులో ఉన్న ఆశావహులు, వారి అనుచరుల్లో హైరానా నెలకొంది.

Advertisement
Advertisement