ఖమ్మం సభకు ‘పొంగులేటి’ సిద్ధం | Sakshi
Sakshi News home page

ఖమ్మం సభకు ‘పొంగులేటి’ సిద్ధం

Published Sat, Jun 24 2023 1:20 AM

ముఖ్యనేతలతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి  - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. పొంగులేటి, ఆయన అనుచరులతోపాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ముఖ్యనేతలు ఢిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని ఈనెల 26వ తేదీన కలవనున్నారు. ఆ తర్వాత వచ్చేనెల 2న మంచి ముహుర్తం ఉండడంతో అదేరోజు ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించేందుకు పొంగులేటి వర్గం సమాయత్తం అవుతోంది. ఈ సభకు రాహుల్‌గాంధీ రానున్నట్లు తెలుస్తుండగా, సభను విజయవంతం చేసేందుకు మాజీ ఎంపీ అనుచరగణం ఏర్పాట్లు మొదలుపెట్టింది.

60 మందికి పైగా ఢిల్లీకి..
రాహుల్‌గాంధీని కలిసేందుకు పొంగులేటితోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఆయన అనుచరగణం 60 మందికి పైగా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈనెల 25 రాత్రి హైదరాబాద్‌ చేరుకుని.. 26న తెల్లవారుజామున ఢిల్లీ వెళ్తారు. పొంగులేటితో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పలు జిల్లాల నేతలు కూడా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రతీ నియోజకవర్గం నుంచి ఆరుగురు చొప్పున ఢిల్లీకి రావాలని ఆహ్వానాలు అందాయి.

ఏడు నియోజకవర్గాలపై ఫోకస్‌
వచ్చేనెల 2న ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్‌ సమీపాన పొంగులేటికి చెందిన స్థలంలో కాంగ్రెస్‌లో చేరిక సభ నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ సభకు భారీ జన సమీకరణ చేసేందుకు నియోజకవర్గానికి ఒకరిద్దరు చొప్పున ఇన్‌చార్జిలను నియమించడంతో వారు శుక్రవారం నుంచే మండలాల వారీగా సన్నాహక సమావేశాలు ప్రారంభించారు. ఖమ్మం నియోజకవర్గానికి తుళ్లూరి బ్రహ్మయ్య, దొడ్డా నగేష్‌, మలీదు జగన్‌, వైరాకు మార్క్‌ఫెడ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, బానోతు విజయాబాయి, సత్తుపల్లికి మువ్వా విజయ్‌బాబు, కొండూరు సుధాకర్‌, కొత్తగూడెంకు ఊకంటి గోపాలరావు, ఆళ్ల మురళి, ఇల్లెందుకు కోరం కనకయ్య, పినపాకకు పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేటకు జారె ఆదినారాయణ, జూపల్లి రమేష్‌, భద్రాచలానికి తెల్లం వెంకట్రావు, మధిరకు కోటా రాంబాబు, ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, దేవిశెట్టి రంగారావు, పాలేరుకు స్వర్ణకుమారి, రామసహాయం నరేష్‌రెడ్డిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. ప్రధానంగా ఖమ్మం చుట్టుపక్కల ఉన్న పాలేరు, ఖమ్మం, వైరా, మధిర, ఇల్లెందు, కొత్తగూడెం, సత్తుపల్లి నియోజకవర్గాల నుంచే భారీ జన సమీకరణ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

జన సమీకరణ భారీగా చేయాలి
రాహుల్‌గాంధీ హాజరయ్యే సభకు భారీగా జన సమీకరణ చేయాలని పొంగులేటి పది నియోజకవర్గాల్లోని అనుచర నేతలకు సూచించారు. ఖమ్మానికి సమీప నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి సారించాలని తెలిపారు. కేడర్‌ అభిప్రాయం మేరకే కాంగ్రెస్‌లోకి వెళ్తున్నందున జన సమీకరణలో కేడర్‌ భాగం చేయాలని ఖమ్మంలో అనుచర నేతలతో సమావేశమైన ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement