‘సువిధ’తో సులభంగా అనుమతులు | Sakshi
Sakshi News home page

‘సువిధ’తో సులభంగా అనుమతులు

Published Thu, Nov 9 2023 12:20 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమ్‌, పక్కన అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్‌ - Sakshi

ఖమ్మంసహకారనగర్‌: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని రకాల అనుమతులను సువిధ యాప్‌ ద్వారా జారీ చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ వెల్లడించారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు సువిధ ద్వారా 424 అనుమతులు ఇచ్చామని చెప్పారు. కాగా, కొత్త ఓటరు నమోదు, మార్పులు, చేర్పులపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10వ తేదీలోగా పరిష్కరిస్తామన్నారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాల పేర్లు తప్పుగా పడినందున మార్పు చేయనున్నామని, ఇందులోనూ అభ్యంతరాలు ఉంటే తెలపాలని చెప్పారు. ఖమ్మం నియోజకవర్గంలో పాండురంగాపురం, ఖానాపురం, కొత్తూరు, పాలేరులో పెద్దతండా, బోధ్యతండా, నాయకన్‌గూడెం, వైరా నియోజకవర్గంలో సామ్యాతండా, లావుడ్యాతండా, వెంకట్యాతండా, చింతలతండా, మధిర నియోజకవర్గంలో మత్కేపల్లి, పందిళ్లపల్లి, రామకృష్ణాపురం, ఆళ్లపాడు గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాల పేర్లు మారనున్నాయని వెల్లడించారు.

దరఖాస్తులన్నీ 10లోగా పరిష్కారం

కొత్తగా ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించి దరఖాస్తులన్నీ ఈ నెల 10లోగా పరిష్కరించాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సూచించారు. క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులతో సమీక్షించి సూచనలు చేశారు. వచ్చిన దరఖాస్తులన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. అలాగే, పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్య తేలేనాటికి కావాల్సిన బ్యాలెట్‌ యూనిట్ల సంఖ్యపై ప్రతిపాదనలు సమర్పించాలని, ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌నాయక్‌, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌, కలెక్టరేట్‌ ఏఓ అరుణ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్లు రాంబాబు, మదన్‌గోపాల్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పార్టీ ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్‌ గౌతమ్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement