ఎన్నికలపై పాఠం! | Sakshi
Sakshi News home page

ఎన్నికలపై పాఠం!

Published Fri, Nov 17 2023 12:16 AM

ఖమ్మం శాంతినగర్‌ హైస్కూల్‌లో పాఠం బోధిస్తున్న ఉపాధ్యాయుడు - Sakshi

● పదో తరగతి సోషల్‌ పుస్తకంలో పాఠ్యాంశం ● విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్యంపై అవగాహన ● ఎన్నికల వేళ ప్రత్యేకంగా బోధిస్తున్న ఉపాధ్యాయులు

అమ్మానాన్నకు వివరించా..

ప్రజాస్వామ్యంలో సుపరిపాలన అందించే వ్యక్తులను ఎన్నుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని తెలిసింది. పాఠంలోని వివరాలు ఆధారంగా మా ఉపాధ్యాయులు అన్ని విషయాలు వివరించారు. దీంతో ఓటు వేయడం ఎంత తప్పనిసరో మా అమ్మానాన్నకు చెప్పా.

– ఎస్‌.వెంకటశివ, పదో తరగతి,

శాంతినగర్‌ హైస్కూల్‌, ఖమ్మం

విద్యార్థి దశ నుంచే

అవగాహన

పదో తరగతి సోషల్‌ పుస్తకంలో ఎన్నికల ప్రక్రియపై పాఠ్యాంశాన్ని ముద్రించటం అభినందనీయం. తద్వారా విద్యార్థి దశ నుంచే ఎన్నికలపై అవగాహన కల్పించడం సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఈ పాఠం బోధిస్తే విద్యార్థులు ఆసక్తి విన్నారు.

– వి.యాదగిరి, సోషల్‌ ఉపాధ్యాయుడు, మంగళగూడెం

అందుబాటులో ఉండే వారిని ఎన్నుకోవాలి

ఎన్నికల సమయంలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా అందుబాటులో ఉండే వారిని ఎన్నుకోవాలని మా సార్‌ చెప్పారు. తద్వారా మంచి జరుగుతుందని వివరించాడు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ పాఠం చెప్పడంతో అనేక విషయాలు తెలిశాయి.

– ఎస్‌.గోపీచందన,

పదో తరగతి,

మంగళగూడెం హైస్కూల్‌

ఖమ్మం సహకారనగర్‌: ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలంటే హడావుడి అంతా ఇంతా కాదు. అయితే, ఎన్నికలంటే ఓటు వేయడం, ఎమ్మెల్యేను ఎన్నుకోవడమే కాదు ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికల ప్రక్రియ ఎంతో కీలకమైనది. ఈనేపథ్యాన విద్యార్థి దశ నుంచే ఎన్నికల ప్రక్రియ, ఓటింగ్‌, ఇతరత్రా అంశాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం పదో తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకంలో ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పేరిట పాఠాన్ని ముద్రించింది. ఓటు హక్కు విలువను తెలియచేయడం, స్వేచ్ఛగా ఓటు వేయాల్సిన ఆవశ్యకత, ప్రలోభాలకు లొంగకుండా సేవ చేసే నాయకుడినే ఎన్నుకోవాలనే సూచనలను ఇందులో పొందుపరిచారు. సాంఘిక శాస్త్రం పుస్తకంలోని ఎనిమిది పేజీల్లో ఎన్నికల ప్రక్రియ వివరాలను ఎనిమిది పేజీల్లో ముద్రించగా.. ప్రస్తుత ఎన్నికల నేపథ్యాన ఉపాధ్యాయులు ప్రత్యేకంగా బోధిస్తున్నారు.

విద్యార్థి స్థాయి నుంచే...

పదో తరగతిలో ఎన్నికల ప్రక్రియపై పాఠ్యాంశాన్ని ముద్రించి బోధిస్తుండడం పౌరులుగా ఎదిగే విద్యార్థులకు తప్పనిసరని చెబుతున్నారు. అలాగే, విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైతం ఓటింగ్‌ విధానం, స్వేచ్ఛగా ఓటు వేయడం, ప్రలోభాలకు లొంగకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించే అవకాశముంది. కాగా, ఈ పాఠ్యాంశంలో భారత ఎన్నికల వ్యవస్థ ఏర్పాటు, విధులు, ప్రతిపత్తి తదితర విషయాలను వివరించారు. అలాగే, 1950 జనవరి 25న ఏర్పడిన భారత ఎన్నికల సంఘం, తదనంతరం కాలంలో వచ్చిన మార్పులు, ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా టీఎస్‌.శేషన్‌ విధులు నిర్వర్తించిన సమయాన చేపట్టిన చర్యలను పేర్కొన్నారు.

అవగాహన ఇలా..

పదో తరగతి పాఠ్యాంశంలో భారత ఎన్నికల వ్యవస్థ, భారత ఎన్నికల సంఘం, ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ విధులు, ఓటింగ్‌ ప్రక్రియ, ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఎలాంటి కార్యక్రమాలను చేపట్టవద్దు, ఓటరు ప్రతిజ్ఞ, వివిధ స్థాయిల్లో ఎన్నికల నిర్వహణ, నోటా, ఎన్నికల సంస్కరణలు, ఈవీఎం, కంట్రోల్‌ యూనిట్ల పనితీరును సమగ్రంగా వివరించారు.

పదో తరగతి సోషల్‌ పుస్తకంలోని ఎన్నికల పాఠ్యాంశం
1/5

పదో తరగతి సోషల్‌ పుస్తకంలోని ఎన్నికల పాఠ్యాంశం

2/5

3/5

4/5

5/5

Advertisement
Advertisement