ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు.. | Sakshi
Sakshi News home page

ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు..

Published Fri, Nov 17 2023 12:16 AM

బచ్చోడులో మాట్లాడుతున్న 
పొంగులేటి శ్రీనివాసరెడ్డి  - Sakshi

● కేసీఆర్‌ను ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. ● పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

తిరుమలాయపాలెం: అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ కుటుంబం ప్రజలకు మేలు చేయకపోగా వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందని పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈమేరకు ఆయనను ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేస్తే ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది దోచుకోవడానికే అన్నట్లుగా సీఎం తీరు ఉందని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు భావిస్తే పేపర్ల లీకేజీతో బతుకులు ఆగం చేశారన్నారు. అంతేకాక పేదలకు ఇళ్లు, రేషన్‌ కార్డులు రాలేదని, అర్హులెవరికీ సంక్షేమ పథకాలు అందలేదని పేర్కొన్నారు. ఈమేరకు కేసీఆర్‌కి తగిన గుణపాఠం చెప్పి.. కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం.. ఆ వెంటనే భూమిలేని పేదలకు ఏటా రూ.12 వేలు, ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నెలనెలా రూ.2,500 సాయం, రూ.4వేల పింఛన్‌ అమలుచేస్తామని పొంగులేటి తెలిపారు. కర్ణాటకకు చెందిన నాయకుడు అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చామని చెప్పారు. అయినా బీఆర్‌ఎస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రచారంలో జెడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్‌, ఎంపీపీ మంగీలాల్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, నాయకులు రాయల నాగేశ్వరరావు, స్వర్ణకుమారి, నరేష్‌రెడ్డి, హరితారెడ్డి, అరవిందరెడ్డి, బుద్దా వంశీకృష్ణ, కనకయ్య, ఇజ్రాయిల్‌, గండ్ర గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement