నేతల అడ్డా.. వైరా గడ్డ! | Sakshi
Sakshi News home page

నేతల అడ్డా.. వైరా గడ్డ!

Published Sat, Nov 18 2023 12:10 AM

- - Sakshi

లక్ష్మీపురం నుంచి అడుగులు

వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన మల్లు అనంతరాములు 1980లో తొలిసారిగా మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూలు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో జాతీయ స్థాయిలో వ్యవసాయ సంబంధ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కూడా దక్కింది. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, పదకొండు రాష్ట్రాలకు కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా పనిచేశారు. 1989లో తిరిగి నాగర్‌కర్నూలు నుంచి పోటీ చేసి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడయ్యారు. ఈ పదవిలో ఉండగానే ఆయన మృతి చెందారు.

● అనంతరాములు మృతితో ఆయన సోదరుడైన డాక్టర్‌ మల్లు రవి రాజకీయ రంగప్రవేశం చేశారు. 1981లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం, 1998లో అక్కడి నుంచే రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. దివంగత మహానేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డితో రవికి సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేశారు. అంతేకాక ఆయనకు ప్రభుత్వ విప్‌ పదవి కూడా దక్కింది.

● మల్లు అనంతరాములు మరో సోదరుడైన మల్లు భట్టివిక్రమార్కకు మహా నేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. 2007లో జరిగిన ఎన్నికల్లో ఆయన స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2009 సాధారణ ఎన్నికల్లో మధిర నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచారు. వైఎస్‌ కేబినేట్‌లో చీఫ్‌ విప్‌గా, అటు తర్వాత డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఇక 2014, 2018 ఎన్నికల్లోనూ గెలిచిన భట్టి ప్రస్తుత ఎన్నికల్లో మరోమారు పోటీపడుతున్నారు.

సోమవరం వాసి..

మండలంలోని సోమవ రానికి చెందిన కొండబోలు వెంకయ్య 1952 లో మధిర ఎమ్మెల్యేగా పీడీఎఫ్‌ తరపున గెలిచా రు. కాంగ్రెస్‌కు చెందిన మాడపాటి రాంచంద్రరావుపై విజయం సాధించారు. మాడపాటి హనుమంతరావు, సర్దార్‌ జమలాపురం కేశవరావు ఈయన సహచరులు. 1936లోనే కమ్మ హాస్టల్‌ నిర్మాణానికి కృషి చేశారు. అనంతరం వైరాలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేసి 1953లో ఆంధ్రనికేతన్‌ హైస్కూల్‌గా మార్చారు. వైరా సహకార సంఘం అధ్యక్షుడిగానూ పనిచేసిన ఆయన రైతాంగ ప్రయోజనాల కోసం, సాగునీటి సౌకర్యాల అభివృద్ధికి కృషిచేశారు. ఆయన వారసులు వైరాలో కొండబోలు వెంకయ్యచౌదరి(కేవీసీఎం)మెమోరియల్‌ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు.

ఒకే మండలం నుంచి చట్టసభలకు ఏడుగురు

ఎమ్మెల్యేలు, ఎంపీలుగానే కాక

ఉన్నత పదవులు సైతం..

జాబితాలో ముగ్గురు ‘మల్లు’ బ్రదర్స్‌

ఉమ్మడి జిల్లా రాజకీయ పటంలో ఏ ప్రాంతానికి దక్కని ఖ్యాతి వైరాకు ఉంది. ఈ మండలం నుంచి ఒకరు.. ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు చట్టసభల్లోకి అడుగుపెట్టారు. ఒకే

మండలానికి చెందిన ఇంత మంది లోక్‌సభ, అసెంబ్లీకి ఎన్నిక కావటం అరుదనే చెప్పాలి. వీరిలో ముగ్గురు అన్నదమ్ములు ఉండడం మరో విశేషం. – వైరా

గండగలపాడు నుంచి..

మండలంలోని గండగలపాడుకు చెందిన సీపీఎం నేత బోడేపుడి వెంకటేశ్వరరావు మధిర నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. 1985, 1989, 1994 ఎన్నికల్లో గెలిచిన బోడెపూడి.. శాసనసభలో రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పాటుపడ్డారు. 1989లో అసెంబ్లీలో సీపీఎం శాసనసభా పక్షనేతగా ఎన్నికయ్యారు. రైతులకు గిట్టుబాటు ధర, సాగునీటి సమస్య తదితర అంశాలను అసెంబ్లీలో లేవనెత్తి పరిష్కార మార్గాలు చూపడం ద్వారా రైతు బాంధవుడిగా పేరు సాధించారు. 1997 ఆగస్టు 5న ఆయన కన్నుమూశారు. ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మధిర నియోజకవర్గానికి వైరా రిజర్వాయర్‌ నుంచి రక్షిత మంచినీటిని అందించే పథకాన్ని మంజూరు చేయించారు. అయితే, ఆ ప్రాజెక్టు పూర్తి కాకముందే బోడేపుడి కన్నుమూయడం, ప్రభుత్వం ఈ పథకానికి బోడేపుడి సుజల స్రవంతి పథకంగా పేరు పెట్టింది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా 107 గ్రామాల ప్రజలకు రక్షిత తాగునీరు అందింది.

వైరా నుంచి ‘బండారు’

వైరాకు చెందిన బండారు ప్రసాదరావు 1978లో ఇందిరా కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి మధిర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి శీలం సిద్దారెడ్డి, జనతా పార్టీ అభ్యర్థి మద్దినేని నర్సింహారావుపై విజయం సాధించారు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వైరాలో ఆర్టీసీ బస్టాండ్‌ ఏర్పాటు చేయించారు.

కొండకొడిమ నుంచి కొండబాల

మండలంలోని కొండకొడిమకు చెందిన కొండబాల కోటేశ్వరరావు 1999లో మధిర నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 1970లో సర్పంచ్‌గా ఎన్నికై న ఆయన పీజీ చదువుతూ రెండోసారి కూడా ఎన్నికయ్యారు. ఎల్‌ఎంబీ డైరెక్టర్‌గా పనిచేశాక, సహకార సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం డీసీసీబీ చైర్మన్‌ పదవి నిర్వర్తించారు. కొంతకాలం భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్‌గా పనిచేశారు. తొలుత శీలం సిద్ధారెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చినా తర్వాత టీడీపీలో చేరగా, ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఉంటూ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పనిచేస్తున్నారు.

కొండబాల 
కోటేశ్వరరావు
1/7

కొండబాల కోటేశ్వరరావు

బండారు ప్రసాదరావు
2/7

బండారు ప్రసాదరావు

కొండబోలు వెంకయ్య
3/7

కొండబోలు వెంకయ్య

మల్లు 
అనంతరాములు
4/7

మల్లు అనంతరాములు

బోడేపుడి 
వెంకటేశ్వరరావు
5/7

బోడేపుడి వెంకటేశ్వరరావు

మల్లు 
భట్టి విక్రమార్క
6/7

మల్లు భట్టి విక్రమార్క

మల్లు రవి
7/7

మల్లు రవి

Advertisement
Advertisement