‘ఉపాధి’కి ప్రణాళికలు | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’కి ప్రణాళికలు

Published Wed, Dec 6 2023 12:20 AM

- - Sakshi

● 2024–25లో ఈజీఎస్‌ పనులకు గతంలోనే మార్గదర్శకాలు ● ఎన్నికల కారణంగా నిలిచిన ప్రక్రియ ● మళ్లీ కసరత్తు మొదలుపెట్టిన అధికారులు?

ఖమ్మంమయూరిసెంటర్‌: మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టా ల్సిన పనులపై అధికారులు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. 2024–25 ఏడాదికి గాను జిల్లాలో అడిగిన ప్రతీ కూలీకి పని కల్పించేలా, ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళిక తయారు చేయాలని ఆదేశాలు అందాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యాన గ్రామాల్లో పనుల గుర్తింపు, గ్రామసభల్లో ఆమోదం వంటివి జరగలేదు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సిద్ధం చేయాల్సిన ఉపాధి ప్రణాళికల్లో జాప్యం జరుగుతోంది. తాజాగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యాన ప్రణాళిక సిద్ధం చేయడంపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

పనుల గుర్తింపునకు ప్రణాళిక

పేదల జీవన ప్రమాణాలు పెంచడం, వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు అమలుచేసే మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2024–25 సంవత్సరానికి పనుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే షెడ్యూల్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా అక్టోబర్‌ 2 నుంచి ప్రణాళికల తయారీ గ్రామసభలు, సర్వే, డాక్యుమెంట్‌ సిద్ధం చేసి ఆమోదించాల్సి ఉంటుంది. ఇదంతా జనవరి 21లోగా పూర్తిచేయాలి. జిల్లాల నుంచి వచ్చిన ప్రణాళికలను ఫిబ్రవరి 10న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం కేంద్రానికి నివేదిస్తుంది. అయితే, అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో జరగాల్సిన పనులన్నీ ఎన్నికల కారణంగా నిలిచిపోయాయి.

లేబర్‌ బడ్జెట్‌తో ప్రారంభం

గ్రామ సభల్లో పనులకు సంబంధించి కూలీల బడ్జెట్‌ ఖరారు చేసి.. అందుకు అనుగుణంగా పనులను గుర్తించాక గ్రామసభ ఆమోదం తీసుకోవాలి. అనంతరం ఈనెల 5వ తేదీ లోపు ఏపీఓ, ఈసీ, ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఆమోదం కోసం మండల పరిషత్‌లకు పంపించాలి. కానీ గ్రామసభలు నిర్వహించకుండానే బడ్జెట్‌ను మండల అధికారులకు పంపిస్తున్నట్లు తెలిసింది. మండలంలో ఆమోదించిన పనులను డిసెంబర్‌ 20లోగా జిల్లా పరిషత్‌, వచ్చే ఏడాది జనవరి 21లోపు కలెక్టర్‌ ఆమోదం పొందాలి. అనంతరం రాష్ట్రప్రభుత్వానికి, అక్కడి నుంచి కేంద్రానికి ఆమోదం కోసం పంపిస్తారు. కానీ ఎన్ని కల కారణంగా ఇదంతా షెడ్యూల్‌ ప్రకారం జరగలేదు. ఫలితంగా గ్రామసభల ఆమోదం లేకుండానే మండలాలకు పంపిస్తుండగా, మిగతా ప్రక్రియను ముందుగా జారీ చేసిన షెడ్యూల్‌ ప్రకారం పూర్తిచేసేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

జిల్లాలో ఉపాధి హామీ ఇలా...

జాబ్‌కార్డులు 3,04,657

కార్డుల్లోని కూలీలు 6,44,455

ఈ ఏడాది పని పొందిన కుటుంబాలు 1,22,752

పనికి వచ్చిన కూలీలు 1,92,601

ఈ ఏడాది పూర్తి చేసిన పనిదినాలు 39,42,222

Advertisement
Advertisement