మత్స్య అవతారంలో రామయ్య | Sakshi
Sakshi News home page

మత్స్య అవతారంలో రామయ్య

Published Thu, Dec 14 2023 12:10 AM

బేడా మండపంలో ఆళ్వార్లతో 
శ్రీసీతారామచంద్ర స్వామివారు  - Sakshi

● తిలకించి పులకించిన భక్తజనులు ● వైభవోపేతంగా అధ్యయనోత్సవాలు ప్రారంభం

భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు బుధవారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు రామయ్య మత్స్య అవతారంలో దర్శనమివ్వగా, తిలకించిన భక్తులు భక్తిపారవశ్యంతో పులకించారు. తొలుత అధ్యయనోత్సవాలలో భాగంగా ఆలయంలోని గర్భగుడిలో మూలమూర్తుల వద్ద ఉత్సవాల నిర్వహణకు అధ్వర్వులు అనుజ్ఙ తీసుకున్నారు. స్వామివారి ఉత్సవమూర్తులను, ఆళ్వార్లను బేడా మండపానికి మేళతాళాల మధ్య తీసుకొచ్చి వేదికపై కొలువుదీర్చి పూజలు జరిపారు. ఈ సందర్భంగా ప్రబంధాలను, సేవాకాలం నివేదించారు. ప్రత్యేక ఆరాధన, విశ్వక్షేన పూజ, పుణ్యావాచనం సమర్పించారు. వైదిక పరిపాలనా సిబ్బందికి దీక్షా వస్త్రాలను అందచేశారు.

మత్స్యావతారుడైన రామయ్య

వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు మత్స్యావతార రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మత్స్యాలంకరణలో అలంకరించిన స్వామివారిని కొద్ది సేపు బేడా మండపంలో ఆళ్వార్లతో కొలువుదీర్చి పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల కోలాటాల నడుమ ఊరేగింపుగా తీసుకొని వెళ్లి మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. మత్స్యావతార రూపంలో కొలువైన స్వామి వారిని దర్శించుకున్న భక్తులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం తాతగుడి సెంటర్‌ వరకు తిరువీధి సేవ జరిపి ఆలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సంగీత కళాకారులు ఆలపించిన కీర్తనలు, హరికథలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్‌, స్థానా చార్యులు స్థలశాయి, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, పండితులు, అర్చకులు, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement