డ్రెయినేజీలో పడిన వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

డ్రెయినేజీలో పడిన వ్యక్తి మృతి

Published Thu, Jan 4 2024 12:20 AM

వెంకటేశ్వర్లు (ఫైల్‌)  - Sakshi

ముదిగొండ: ప్రమాదవశాత్తు డ్రెయినేజీలో పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ముదిగొండ మండలం గంధసిరికి చెందిన మర్రి వెంకటేశ్వర్లు(50) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 1న గ్రామ సెంటర్‌లో జరుగుతున్న నూతన సంవత్సర వేడుకలు చూడడానికి బయలుదేరిన ఆయన ప్రమాదవశాత్తు మార్గమధ్యలోని రహదారి పక్కన ఉన్న మురుగు కాల్వలో పడటంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆయనకు ఖమ్మంలో చికిత్స చేయించి మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఘటనపై మృతుడి బంధువులు బుధవారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు.

పేకాట స్థావరంపై దాడి, పది మంది అరెస్టు

సత్తుపల్లి: పలువురు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి పది మందిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ మోహన్‌ బాబు తెలిపిన వివరాల ప్రకారం... సత్తుపల్లి మండలం సదాశివునిపేట – తుంబురు గ్రామాల మధ్య పామాయిల్‌ తోటలో బుధవారం పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడి చేసి పది మందిని అరెస్టు చేయడమే కాక రూ.35వేల నగదు, ఐదు ద్విచక్ర వాహనాలు సీజ్‌ చేసినట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

సింగరేణిలో ఇద్దరు కార్మికులకు

తీవ్ర గాయాలు

సత్తుపల్లి: చెట్టుకొమ్మలు తొలగిస్తుండగా జారిపడిన ఇద్దరు సింగరేణి డీఎల్‌ఆర్‌ కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సత్తుపల్లిలోని జేవీఆర్‌ ఓసీ డిస్పెన్సరీ వద్ద బుధవారం రేకుల షెడ్డుపై నిల్చుని కార్మికులు చెట్ల కొమ్మలు తొలగిస్తున్నారు. ఈక్రమాన రేకులు పగిలడంతో డీఎల్‌ఆర్‌ కార్మికులైన వెంకట్రావు, మారయ్య జారి పడగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఖమ్మంక్రైం: రైలు ఢీకొనడంతో గుర్తుతెలియని వ్యక్తి(55) మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసకుంది. జీఆర్పీ ఎస్సై భాస్కరావు కఽథనం ప్రకారం... ఖమ్మం – పందిళ్లపల్లి స్టేషన్ల మధ్య సదరు వ్యక్తి పట్టాలు దాటుతూ రైలును గమనించకపోవటంతో ఢీకొట్టింది. ఈ మేరకు ఆయన మృతదేహాన్ని అన్నం పౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సాయంతో మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

పోక్సో కేసు నమోదు

సుజాతనగర్‌: మాయమాటలు చెప్పి మైనర్‌ బాలికను వెంట తీసుకెళ్లిన వ్యక్తిపై పోలీసులు బుధవారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జూలూరుపాడు మండలానికి చెందిన ఓ బాలిక ఇక్కడ ఉన్న ఓ ప్రైవేట్‌ కళాశాలలో చదువుతోంది. గత నెల 10న తల్లాడ మండలానికి చెందిన ఓ వ్యక్తి ఆమెకు మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.సోమేశ్వర్‌ తెలిపారు.

1/1

Advertisement
Advertisement