‘సహకారానికి’ మహర్దశ ! | Sakshi
Sakshi News home page

‘సహకారానికి’ మహర్దశ !

Published Tue, Jan 9 2024 12:08 AM

మూతపడిన నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారం సొసైటీ బంక్‌ - Sakshi

● తెరుచుకోనున్న పీఏసీఎస్‌ల పెట్రోల్‌ బంక్‌లు ● త్వరలో రిటైల్‌ విక్రయాలకు అనుమతి ● ఇకపై డీజిల్‌తో పాటు పెట్రోల్‌.. రైతులకే కాక అందరికీ అమ్మకం ● ఉమ్మడి జిల్లాలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణ

నేలకొండపల్లి: రైతులకు మరిన్ని సేవలందించాలన్న లక్ష్యంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన బంక్‌లకు తిరిగి మహర్దశ పట్టనుంది. రైతులకు సేవలందించేలా పీఏసీఎస్‌ల ఆధ్వర్యాన బంక్‌లను 2021లో ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చర్ల, ఎర్రుపాలెం మండలం ములుగుమాడు, నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారం(రాజారాంపేట) పీఏసీఎస్‌ల ఆధ్వర్యాన ఇవి మొదలయ్యాయి. వీటి ఏర్పాటు ఉద్దేశం మంచిదే అయినా.. వాణిజ్య బంక్‌లతో పోటీ పడలేకపోయాయి. ఫలితంగా కొన్నాళ్లకే అవి మూతపడడంతో సహకార సంఘాల ఉద్దేశం నెరవేరకపోగా రైతులకు సేవలు దూరమయ్యాయి.

ధరల్లో వ్యత్యాసం..

పీఏసీఎస్‌ల ఆధ్వర్యాన ఉమ్మడి జిల్లాలో నాలుగు బంక్‌లు ఏర్పాటయ్యాయి. రైతులకు సేవ చేయాలనేదే ఆయా బంక్‌ల ఏర్పాటు ఉద్దేశం. అందుకే వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడేలా, అదీ రైతులకు మాత్రమే డీజిల్‌ విక్రయించేవారు. అంతేకాక లాభాలను తగ్గించుకుని డీజిల్‌పై రూపాయి తగ్గించి అమ్మేవారు. వ్యాపారులు కల్తీ చేసే అవకాశాలు ఉండగా.. సంఘాలు నిర్వహించే బంక్‌లలో కల్తీకి అస్కారం ఉండేది కాదు. ఇదంతా బాగానే ఉన్నా.. ధరల విషయానికొస్తే ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సి వచ్చేది. కానీ వాణిజ్య బంక్‌లు ఏ రోజుకా రోజు ధర పెంచడం, తగ్గించడం జరిగేది. కానీ రిఫైనరీల్లో ధర తగ్గినా, పెరిగినా పీఏసీఎస్‌ల బంక్‌ల్లో అలా చేయడం సాధ్యం కాకపోయేది. దీంతో వాణిజ్య బంక్‌లతో పోటీ పడలేకపోగా.. నానాటికీ నష్టాలు పెరిగాయి. ఫలితంగా పీఏసీఎస్‌ల బంక్‌లు మూతపడ్డాయి. అంతేకాకుండా ఈ బంక్‌ల్లో రైతులకే మాత్రమే విక్రయించాలనే నిబంధన కూడా నష్టాలకు ఓ కారణమైంది.

త్వరలోనే వాణిజ్య బంక్‌లుగా..

సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బంక్‌లు మూతపడడంతో ఏడాది పాటు పరికరాలు వృథాగా పడి ఉన్నాయి. వీటిని వినియోగంలోకి తీసుకరావాలని పలువురు సొసైటీ ప్రతినిధులు, అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఈ క్రమంలోనే వాటిని వాణిజ్య బంక్‌లుగా మార్చాలని ప్రయత్నించారు. వీటి వలన సంఘాలపై భారం పడకుండా కొంతమేర వెసులుబాటు కలుగుతుందని పీఏసీఎస్‌ పాలకవర్గాల భావన. అంతే కాకుండా డీజిల్‌తో పాటు పెట్రోల్‌ కూడా విక్రయించాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా పాలకవర్గాలు తీర్మానాలు చేయడంతో ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా అందాయి. బంక్‌లను ఇటీవల సంబంధిత అధికారులు పరిశీలించగా.. వారం, పది రోజుల్లో తెరుచుకోనున్నాయి. ఇదే జరిగితే అటు సంఘాలకు లాభాలు రావడమే కాక రైతులు, సాధారణ ప్రజలకు కల్తీ లేని డీజిల్‌, పెట్రోల్‌ సమీపంలో అందే అవకాశముంది.

Advertisement
Advertisement