‘ఎర్లీబర్డ్‌’పై ప్రచారమేదీ? | Sakshi
Sakshi News home page

‘ఎర్లీబర్డ్‌’పై ప్రచారమేదీ?

Published Mon, Apr 8 2024 12:10 AM

సత్తుపల్లి మున్సిపల్‌ కార్యాలయం - Sakshi

● ఆస్తిపన్ను ముందుగా చెల్లిస్తే 5 శాతం రాయితీ ● ఉమ్మడి జిల్లాలో స్పందన నామమాత్రమే ● ఈనెల 30తో ముగియనున్న గడువు

సత్తుపల్లిటౌన్‌: ఆస్తి పన్నుపై ఐదు శాతం రాయితీ కల్పించే ఎర్లీబర్డ్‌ పథకంపై ప్రచారం కరువైంది. మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఆస్తిపన్ను మొత్తం ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీ కల్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఏప్రిల్‌ 1 నుంచి 30వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లెందు, సత్తుపల్లి మున్సిపాల్టీల్లో మాత్రమే ఐదుశాతం రాయితీ పథకంపై స్పందన కనిపిస్తోంది. మిగతా మున్సిపాల్టీల్లో వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

బకాయిలు పేరుకుపోతుండడంతో..

మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు పన్నులే. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే పన్నులు వసూలు చేయగలిగితే తప్ప.. పూర్తి స్థాయిలో రాబట్టడం సాధ్యపడడం లేదని గమనించిన పురపాలక శాఖ ఎర్లీబర్డ్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆస్తి పన్ను బకాయిలు మున్సిపాల్టీల్లో పేరుకుపోవడంతో అభివృద్ధి పనులు వెనుకబడుతున్నాయి. దీంతో పాటు సిబ్బంది, కార్మికుల జీతభత్యాలకు, బిల్లుల చెల్లింపులకు మున్సిపాల్టీలు సతమతం అవుతున్నాయి.

గతేడాది పన్ను చెల్లించిన వారే..

2023–24 ఆర్థిక సంవత్సరంలో నివాస, నివాసే తర ఆస్తిపై ఎలాంటి బకాయి లేకుండా పూర్తిగా పన్ను చెల్లించిన వారు మాత్రమే ఎర్లీబర్డ్‌ పథకానికి అర్హులు. రాయితీ పొందాలనుకునే వారు గతేడాది తమ ఆస్తిపన్నును పూర్తిగా చెల్లించి ఈ ఏడాది ముందస్తుగా చెల్లిస్తే 5శాతం రాయితీ వర్తిస్తుంది.

మున్సిపాల్టీ ఎసెస్‌మెంట్లు డిమాండ్‌ ఇప్పటివరకు

(రూ.కోట్లలో) రాయితీపై

వసూలైనవి(శాతం)

ఖమ్మంకార్పొరేషన్‌ 80,132 68.88 0.77

సత్తుపల్లి 9713 5.53 2.17

మధిర 8699 3.51 1.42

వైరా 7114 3.5 0.83

కొత్తగూడెం 22240 12.99 0.31

మణుగూరు 7534 2.23 0.90

పాల్వంచ 23370 28.42 0.46

ఇల్లెందు 8357 2.45 2.45

సద్వినియోగం చేసుకోండి

ఈ ఏడాది ఆస్తి పన్ను ముందుగానే పూర్తిగా చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం రాయితీ అవకాశం కల్పించింది. ఈ నెల 30వ తేదీలోగా భవన యజమానులు, వ్యాపారులు ఆస్తి పన్ను చెల్లించి ఎర్లీబర్డ్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ పథకంపై బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లు, భవన యజమానులకు ఫోన్లు చేస్తూ అవగాహన కల్పిస్తున్నాం.

–మందా రవిబాబు, మున్సిపల్‌ కమిషనర్‌, సత్తుపల్లి

పన్నులు వసూలు చేస్తున్న బిల్‌ కలెక్టర్లు
1/3

పన్నులు వసూలు చేస్తున్న బిల్‌ కలెక్టర్లు

2/3

3/3

Advertisement
Advertisement