గీత దాటితే ఇక్కట్లే.. | Sakshi
Sakshi News home page

గీత దాటితే ఇక్కట్లే..

Published Tue, Apr 23 2024 8:15 AM

- - Sakshi

లోక్‌సభ ఎన్నికల ప్రచారం నానాటికీ జోరందుకుంటోంది. ఈ నేపథ్యాన ఎవరు కూడా నిబంధనలు అతిక్రమించకుండా అధికార యంత్రాంగం డేగకళ్లతో నిఘా వేసింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో స్పందించేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఏర్పాటైన వివిధ రకాల బృందాలు తనిఖీలు ముమ్మరం చేశారు. కాగా, ఎన్నికల వేళ నిబంధనలపై కేంద్ర ఎన్నికల సంఘం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఆయా మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సూచిస్తూ.. ఎవరు అతిక్రమించినా ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యాన ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై కథనం. – ఖమ్మం సహకారనగర్‌

సమావేశాలు

సమావేశాల నిర్వహణకు ముందుగానే లిఖితపూర్వకంగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. నిషేధాజ్ఞలు, ఆంక్షలు ఉన్న ప్రదేశాల వివరాలు తెలుసుకుని ఆ ప్రదేశాలకు దూరంగా వేడుకలు ఏర్పాటుచేసుకోవాలి. సమావేశాల్లో మైక్‌లు, లౌడ్‌ స్పీకర్ల వినియోగానికి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. సమావేశానికి ఎవరైనా ఆటంకం కలిగిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలే తప్ప సొంతంగా చర్యలకు దిగొద్దు.

ఊరేగింపులు

ఊరేగింపు నిర్వహించాలనుకునే వారు ముందస్తుగానే పోలీసులకు తెలియచేయాల్సి ఉంటుంది. ఊరేగింపు మార్గంలో ఏమైనా నిషేధాజ్ఞలు ఉన్నాయో తెలుసుకోవాలి. ట్రాఫిక్‌ కు అంతరాయం కలగకుండా ఊరేగింపు చేపట్టాలి. ఎవరి దిష్టిబొమ్మలను దగ్ధం చేయొద్దు.

అధికార పార్టీ...

ఎన్నికల ప్రచారాన్ని అధికార పర్యటనలతో కలిపి నిర్వహించవద్దు. అధికార యంత్రాంగం, ప్రభుత్వ వాహనాలను వినియోగించరాదు. అలాగే, ప్రభుత్వ వసతిగృహాలపై ఏ ఒక్కరి పెత్తనం ఉండొద్దు. ప్రభుత్వ ఖర్చుతో మీడియాలో ప్రకటనలు ఇవ్వకూడదు. ఏ రకమైన గ్రాంట్లు, పేమెంట్లు కొత్తగా మంజూరు చేయరాదు. అలాగే, అభివృద్ధి పనులపై వాగ్దానాలు చేయకూడదు. నూతన భవనాలు, కార్యక్రమాలకు శంకుస్థాపన చేయొద్దు.

ప్రచారంలో వాహనాలు

ఎన్ని వాహనాలైనా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించవచ్చు. అయితే, రిటర్నింగ్‌ అధికారి నుంచి అనుమతి తీసుకోవాలి. ఒరిజనల్‌ అనుమతి పత్రం స్పష్టంగా కన్పించేలా వాహనానికి అంటించాలి. అనుమతి తీసుకున్న అభ్యర్థి మాత్రమే ఆ వాహనాన్ని వినియోగించాలి. రవాణా శాఖ చట్టానికి లోబడి వాహనాలకు అదనపు మంగులు సమకూర్చుకోవచ్చు. అయితే, విద్యాసంస్థలు, వారి మైదానాలను ప్రచారానికి వాడకూడదు. ప్రైవేట్‌ భూములు, భవనాలకు పోస్టర్లు అంటించాలంటే యజమాని లిఖితపూర్వక అనుమతి తీసుకొని రిటర్నింగ్‌ ఆఫీసర్‌కి అందించాలి. ప్రచార కరపత్రాలు, పోస్టర్లను ముద్రణాలయాల పేరు, చిరునామా ఉండాలి. ప్రచారంలో భాగంగా టోపీలు, కండువాలు ఇచ్చేందుకు అవకాశమున్నా వీటిని ఖర్చులో చూపించాలి. అయితే, చీరలు, చొక్కాలు, అభ్యర్థి ఫొటోలతో డైరీలు, క్యాలెండర్లు ప్రచురించరాదు. వాహనాల స్టెపినీ కవర్లపై కూడా మత సంబంధిత ఫొటోలు, అభ్యర్థి ఫొటోలు ఉండడానికి వీలు లేదు.

తాత్కాలిక కార్యాలయాలు

ప్రార్థనా స్థలాలు, పాఠశాలలకు, పోలింగ్‌ స్టేషన్లకు 200 మీటర్లకు వెలువలే అభ్యర్థి కార్యాలయం ఏర్పాటుచేసుకోవాలి. కార్యాలయాలపై పార్టీ జెండా, బ్యానర్‌, పార్టీ చిహ్నాన్ని పెట్టుకోవచ్చు. రాత్రి 10గంటల తర్వాత, ఉదయం 6గంటల లోపు మైక్‌లు, లౌడ్‌ స్పీకర్లు వాడకూడదు. రాత్రి 10గంటల తర్వాత పబ్లిక్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయొద్దు. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అభ్యంతకర వార్తలను ప్రసారం చేయొదు.

ఎన్నికల మార్గదర్శకాలు పాటించడం తప్పనిసరి

నియమ, నిబంధనలు జారీచేసిన కేంద్ర ఎన్నికల సంఘం

ప్రచారం, విమర్శల్లో హద్దు దాటకుండా సూచనలు

ఎంసీసీ (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌)

మంత్రులు ఎన్నికల అధికారులను ఎక్కడకు కూడా పిలవడానికి వీలులేదు. ప్రైవేట్‌ పని కోసం వచ్చిన మంత్రిని ఏ అధికారి కలవకూడదు.

వాహనాలను ఇంటి నుంచి తమ కార్యాలయానికి మాత్రమే ఉపయోగించాలి. పైలెట్‌ కార్లు ఎర్ర బుగ్గ కార్లు ఉపయోగించకూడదు. అధికార పార్టీ చేసిన పనులపై ఏర్పాటుచేసిన ప్రచార హోర్డింగ్‌లు తొలగించాలి. కొత్త పనుల ప్రారంభంపై నిషేధం ఉండగా.. ఇప్పటికే మొదలైన పనులు మాత్రం కొనసాగించవచ్చు. అలాగే, పూర్తయిన పనులకు చెల్లింపులు, ప్రకృతి వైపరీత్యాలు వస్తే సహాయక కార్యక్రమాలపై ఎలాంటి నిషేధం ఉండదు. అధికారిక కార్యక్రమాలకు హాజరైనా రాజకీయ ఉపన్యాసాలు చేయవద్దు.

సాధారణ నియమాలు

అభ్యర్థి కానీ పార్టీ నేతలు కానీ కులమత, భాషా విద్వేషాలను రెచ్చగొట్టేలా చేయొద్దు. విధానాలు, కార్యక్రమాలపై, గతంలో చేసిన పనులపైనే తప్ప వ్యక్తిగత జీవితంపై విమర్శలు ఉండకూడదు. కుల, మత ప్రాతిపదికపై ఓట్లు అడగకూడదు. ప్రార్థనా ప్రదేశాలను ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించవద్దు. ఓటు కోసం డబ్బులు ఇవ్వడం, బెదిరించడం నిషేధం. ఒక వ్యక్తి ఓటును మరో వ్యక్తి వేయడం చట్ట వ్యతిరేకం.

వ్యక్తుల అనుమతి లేకుండా వాళ్ల భూమి, భవనాలను ప్రచారానికి ఉపయోగించరాదు. ఇతర పార్టీల ఎన్నికల ప్రచారం, సమావేశాలకు ఆటంకపర్చేలా వ్యవహరించొద్దు

Advertisement
Advertisement